ఓయూలోకి నో ఎంట్రీ.. డబ్బులు కడితే ఓకే!

by  |

దిశ, తెలంగాణ బ్యూరో : వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రీ పాస్ సిస్టమ్ మొదలైంది. పాస్​లేని వ్యక్తులను లోనికి రాకుండా అడ్డుకునేందుకు యంత్రాంగం సిద్ధమైంది. బయటి వ్యక్తుల రాకపోకలపై వర్సిటీ ఆంక్షలు విధించింది. మరోవైపు వాకర్స్, స్పోర్ట్స్ కోసం వచ్చే వ్యక్తుల నుంచి యూజర్​చార్జీలను వసూలు చేయనుంది. దీనిపై ఓయూ విద్యార్థులతోపాటు స్థానికులు, ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వర్సిటీ ప్రతిష్టను కాపాడేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, వాకింగ్‌కు, ఆటలాడుకునేందుకు వచ్చే వారికి నెలకు కొంత మొత్తాన్ని చార్జీగా విధించడంపై పలు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వర్సిటీ ప్రతిష్టను భంగం కలిగించొద్దంటే ప్రతీ ఒక్కరికీ ఒకే రూల్​పెట్టాలని, యూజర్​చార్జీలు వసూలు చేస్తే బయటి వ్యక్తులకు వర్సిటీపై ప్రాతినిధ్యం పెరుగుతుందని మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయానికి నిధులు సమకూర్చుకునే విధానం ఇది కాదని, దీని వల్ల వర్సిటీకి నష్టమేనని చెబుతున్నారు. కాగా బుధవారం ఎంట్రీ పాస్​విధానాన్ని అమలుచేసిన అధికారులు వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో తొలిరోజు రాకపోకలపై చూసీచూడనట్లు వ్యవహరించారు. క్రమంగా దీనిని పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు.

వర్సిటీ తీసుకున్న ఎంట్రీ పాస్​నిర్ణయంపై విద్యార్థుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి చీకటైతే చాలు.. ఓయూలోకి బయటి వ్యక్తులు ప్రవేశించి మద్యం తాగి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడిన సంఘటనలున్నాయి. దీనికి చెక్​పెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. వర్సిటీ ఉన్నది విద్యార్థుల కోసమని.., మరి వాకర్స్, ఆటలాడేందుకు వచ్చే వారి నుంచి డబ్బుల కోసం పాసులు ఎందుకు జారీ చేస్తున్నట్లని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల వర్సిటీపై వారి పెత్తనం పెరిగిపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.

ఎలాగూ డబ్బులు చెల్లిస్తున్నారు కాబట్టి క్రమంగా వారు ఏం చేసినా నడుస్తుంది అనే రేంజ్​కి పరిస్థితి వెళ్తుందని విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడిస్తున్నారు. ఇలా చేయడం కంటే బయటి వ్యక్తులను మొత్తానికే రానియ్యకుండా, కేవలం విద్యార్థులు, స్టాఫ్ కు మాత్రమే అనుమతించేలా నిబంధన పెట్టుకుంటే బాగుండేదని అభిప్రాయ పడుతున్నారు. ఎంతో చరిత్ర ఉన్న క్యాంపస్ ను డబ్బులు వసూలు చేస్తూ పార్కులా మారుస్తున్నారంటున్నా పబ్లిక్ సైతం విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా బయటి వ్యక్తుల రాకపోకలు ఇలా అయినా కాస్తయినా తగ్గుతాయని భావించిన వారూ లేకపోలేదు.

ఓయూలో బయటి వ్యక్తులు వాకింగ్ చేయాలన్నా, క్రీడాకారులైనా గ్రౌండ్​యూజర్​ చార్జీలు చెల్లించాల్సిందే. వాకింగ్​కు అయితే ఒకరికి నెలకు రూ.200, అథ్లెటిక్​క్యాంప్స్​కు అయితే నెలకు రూ.500, ఫుట్​బాల్, బాస్కెట్​బాల్​ కోసమైతే నెలకు రూ.500 చెల్లించాలని వర్సిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. వీరిని కూడా ఉదయం 6 గంటల నుంచి 8 వరకు, సాయంత్రం సెషన్​లో 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే ఉండాలని పేర్కొంది. ఓయూలోని జిమ్​కి వచ్చే వారు నెలకు రూ.వెయ్యి , 3 నెలలకు రూ.2,500 కట్టాల్సి ఉంటుంది. రూ.10 వేలు చెల్లిస్తే ఏడాది పాటు మెంబర్​షిప్ ఇవ్వనున్నారు.

Ou Entri pass

ఓయూలోకి బయటికి వ్యక్తుల ప్రవేశాన్ని తగ్గించేందుకు ఇప్పటికే బస్సులు, భారీ వెహికల్స్ రావడాన్ని అధికారులు నిషేధించారు. వర్సిటీ వాతావరణం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రైవేటు వ్యక్తుల వాహనాలను కూడా నిషేధించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓయూలో పనిచేసే వారి వాహనాలకు పాస్​ల రూపంలో స్టిక్కర్లను ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో గుర్తింపు కార్డులున్నవారిని, వర్సిటీ జారీ చేసిన స్టిక్కర్లున్న వాహనాలనే లోపలికి అనుమతించనున్నారు. ఆర్ట్స్ కాలేజీ దగ్గరికి ప్రతిరోజు ఎంతో మంది విజిటర్స్ వస్తుంటారు. సాయంత్రం వేళ్లల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారు పిల్లలతో కలిసి ఆర్ట్స్ కాలేజీ ఎదుట టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అలాంటి వారందరికీ వర్సిటీ బ్రేకులు వేసింది.

ఇటీవల ఆర్ట్స్ కాలేజీని సందర్శించిన హయ్యర్ ఎడ్యుకేషన్​కు చెందిన ఉన్నతాధికారి అక్కడి జనాన్ని చూసి విస్తుపోయినట్లు సమాచారం. ఓయూలో వాకింగ్ కి వచ్చే వారిలో 80 శాతం వర్సిటీకి చెందిన రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్​లు, లీడర్లు ఉన్నారు. దీంతో వీరి నుంచి సైతం యూజర్ చార్జీలు వసూలు చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాకర్స్ నుంచి వసూలు చేసిన డబ్బులతో వర్సీటీలో గ్రీనరీని ఏర్పాటుచేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని పలు ప్రాంతాల్లో ఏడుచోట్ల బస్తీల మాదిరిగా కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు పది వేల వరకు జనాభా అక్కడ నివసిస్తున్నారు. మరి వీరికి కూడా ఈ నిబంధన అమలుచేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా వర్సిటీ రెండు గేట్ల నుంచి ఉద్యోగులు, సామాన్యులు ఎంతోమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ దారిలో పెద్దగా ట్రాఫిక్​ ఉండకపోవడంతో పాటు దూరం తగ్గుతుందని ఈ రూట్​నే ఎంచుకుంటారు. ఇప్పుడు ఈ రూట్​నుంచి పాస్​ ఉంటేనే అనుమతించే అవకాశం ఉండటంతో ప్రయాణికులు, ఉద్యోగులు అడిక్​మెట్​రూట్​లో వెళ్లాల్సిఉంది. ఇప్పటికే ఆ దారిలో ట్రాఫిక్​ చాలా ఎక్కువగా ఉంటుంది. తాజా నిర్ణయంతో ఆ రూట్లో ట్రాఫిక్​ ​మరింత ఎక్కువ కానుంది. వర్సిటీ నిర్ణయాన్ని వీరు సైతం తప్పుపడుతున్నారు. ఈ రోడ్డు వేయించింది జీహెచ్ఎంసీ నిధులతో అని, నిర్వహణ కూడా వారిదేనని, అలాంటిది దీనిపై వర్సిటీ అధికారుల పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఇదేం రూల్.. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయండి

Shankar

వర్సిటీని అంగడిగా మార్చొద్దు. రూ.200 తీసుకొని వర్సిటీ ప్రతిష్టను కించపరచొద్దు. డబ్బులు తీసుకుంటే వర్సిటీ హక్కులు వాకర్స్ కు కల్పించినట్లే. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలా ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోం. వర్సిటీ అధికారులు కేసీఆర్​కు తొత్తులుగా వ్యవహరించొద్దు. ముందు విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే నిర్ణయం తీసుకోండి. ఇలాంటి పనికిమాలిన నిబంధనలు పెట్టి ఓయూ ప్రతిష్టను దెబ్బతీయొద్దు.
-శంకర్, ఓయూ రీసర్చ్​స్కాలర్

వర్సిటీలు ఉన్నది చదువు నేర్పించేందుకు

Jeevan

యూనివర్సిటీలను ఆర్థికంగా బలోపేతం చేయాలనుకునే విధానం ఇది ఇలా కాదు. విశ్వవిద్యాలయాలు ఉన్నది చదువు నేర్పించేందుకు. విద్యార్థులకు గ్రూప్స్, సివిల్స్​కోచింగ్ లాంటివి ఇప్పించేలా నిర్ణయం తీసుకోండి. అలా పెట్టి వర్సిటీ విద్యార్థులకైతే రూ.500 బయటి వారికి రూ.5 వేలు చొప్పున తీసుకోండి. అంతేకానీ ఇవేం నిబంధనలు. దీనివల్ల విద్యా వాతావరణం మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటివరకు 50 మంది కూడా పాస్​తీసుకోలేదు. బయటి వ్యక్తులను రానివ్వకూడదంటే మొత్తం రోడ్డే మూసేయండి.
-జీవన్, ఏబీవీపీ స్టేట్​జాయింట్ సెక్రటరీ

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story