గులాబీ పార్టీ నేతల్లో ‘ఈఎస్ఐ’ గుబులు.. ఈడీ సోదాలతో అటెన్షన్

by  |
గులాబీ పార్టీ నేతల్లో ‘ఈఎస్ఐ’ గుబులు.. ఈడీ సోదాలతో అటెన్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతల్లో గుబులు మొదలైంది. ఒక సీనియర్ అధికారికి సైతం అదే తరహా భయం పట్టుకుంది. త్వరలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీచేస్తారేమోనన్న టెన్షన్ ఆయనలో ఉంది. కోదాడ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులకు, సీఎంవోలోని ఒక అధికారి స్థాయి వ్యక్తికి సంబంధం ఉండే అవకాశం ఉన్నదనే చర్చ మొదలైంది.

కోదాడ నుంచి సీఎంవోకు లింక్?

ఈఎస్ఐ డైరెక్టర్ అవకతవకలతో మొదలైన ఈ వ్యవహారం ఇతర శాఖల అధికారులకు, అధికార పార్టీ నేతల సంబంధాలపై ఆరా వరకు వెళ్లింది. ప్రస్తుతం ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారి ఇళ్ళు, ఆఫీసుల్లో మాత్రమే ఈడీ సోదాలు చేస్తున్నది. భవిష్యత్తులో తమ దాకా వస్తుందేమోనన్న భయం కొందరిని నిద్రపోనివ్వకుండా చేస్తున్నది. ప్రమోద్​రెడ్డికి సంబంధాలు కలిగిన వారిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ప్రమోద్​రెడ్డి తల్లి నల్లగొండ జిల్లా కోదాడ మార్కెట్​ కమిటీ చైర్​పర్సన్​గా కొనసాగుతున్నారు. దీంతో పలువురు టీఆర్​ఎస్​నేతలకు భయం పట్టుకుంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈడీ సోదాల్లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవికారాణి నివాసంతోపాటు దివంగత కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడైన శ్రీనివాసరెడ్డి, మంత్రికి గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుందరెడ్డి, ఆయన బంధువు వినయ్ రెడ్డి, మరో వ్యక్తి ప్రమోద్ రెడ్డి కూడా ఉన్నారు.

రూ. 3.10 కోట్లు ఎక్కడివి

తాజా సోదాల్లో నాయిని నర్సింహారెడ్డి పీఏ ముకుందరెడ్డి నివాసంలో కోటిన్నర రూపాయలు, ప్రమోద్‌రెడ్డి నివాసంలో రూ. 1.15 కోట్లు, ముకుందరెడ్డి బంధువైన వినయ్ రెడ్డి ఇంట్లో రూ. 45 లక్షల మేర లెక్కలోకి రాని నగదు దొరికిందని ఈడీ వెల్లడించింది. దీంతో ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, వీరికి ఉన్న వ్యాపారాలేమిటి? అనే కోణంలో దర్యాప్తు చేయడంతోపాటు, లావాదేవీలను విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉన్నది. నగదుతో పాటు కొన్ని కీలకమైన పత్రాలు, డిజిటల్ రూపంలో ఉన్న ఆధారాలను సైతం ఈడీ స్వాధీనం చేసుకున్నందున భవిష్యత్తులో మరింత లోతైన దర్యాప్తు చేయనున్నది.

సీఎంవోకు లింక్​ ఎలా.?

ఈఎస్ఐ కుంభకోణంలో సీఎంవో కార్యాలయంలో అధికారి స్థాయి వ్యక్తికి ఏ రూపంలో సంబంధం ఉండవచ్చనేది చర్చనీయాంశమైంది. అధికార దుర్వినియోగమా? పరోక్ష సహకారమా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమోద్ రెడ్డి, ముకుందరెడ్డి నివాసాల్లో దొరికిన కీలక పత్రాల ఆధారంగా భవిష్యత్తు సదరు అధికారి స్థాయి వ్యక్తి మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఏడాది క్రితం వరకూ ఈఎస్ఐ వ్యవహారంగానే కనిపించినా ఇప్పుడు కొత్త వ్యక్తుల సంబంధాలు, పేర్లు తెరపైకి వస్తుండడం, ఈడీ రంగంలోకి దిగడంతో సీన్​ మారిపోయింది. సదరు వ్యక్తులతో సంబంధాలున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భారీ స్థాయిలో అవినీతి, మనీ లాండరింగ్ లాంటి అంశాలన్నీ ఈ కుంభకోణంలో ఉన్నాయి. కేసును కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నందున.. ఈ వ్యవహారం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది ఊహకు అందడం లేదు. కోదాడ పట్టణానికి చెందిన టీఆర్ఎస్‌లోని వివిధ స్థాయిల నేతలు, ఓ అధికారి స్థాయి వ్యక్తి అప్రమత్తమయ్యారు. దర్యాప్తుపై ఎప్పటికప్పడు తెలుసుకుంటున్నట్టు సమాచారం.



Next Story