చైనాతో పెట్టుకుంటే తల పగిలిపోద్ది.. శత్రు దేశాలకు జిన్‌పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్

by  |
China President Jinping
X

బీజింగ్: శత్రు దేశాలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమతో పెట్టుకుంటే అధోగతి పట్టిస్తామని, వారి తలలు బద్ధలవుతాయని హెచ్చరించారు. 140 కోట్ల చైనా పౌరుల రక్తమాంసాలతో కూడిన గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్‌కు బాది శత్రువుల రక్తం వెదజల్లుతామని అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి గురువారానికి నూరేళ్లు నిండాయి. ఈ సందర్భంగా తియన్‌మెన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సుమారు 70 వేల మంది పౌరులు హాజరయ్యారు. వైమానిక విన్యాసాలు జరిగాయి. 1921లో ఆవిర్భవించిన చైనా కమ్యూనిస్టు పార్టీ దేశంలో 1949లో జరిగిన సుదీర్ఘ సివిల్ తర్వాత అధికారాన్ని చేపట్టి 72ఏళ్లు నిరాటంకంగా పాలిస్తున్నది. ‘చైనీయులు న్యాయాన్ని ఎత్తిపడతారు.

చైనీయులుగా మనందరం గర్వపడుతున్నాం, ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని ఉన్నాం. ఇతర దేశాల ప్రజలపై చైనీయులు ఎన్నడూ ఆధిపత్యం చెలాయించలేదు, బాధపెట్టలేదు, వారిని బానిసలుగా మార్చుకోలేదు. భవిష్యత్‌లోనూ అలా చేయం. అదే రీతిలో ఇతర దేశాల శక్తులూ చైనీయులపై ఆధిపత్యాన్ని సాధించజాలవు. కానీ, ఎవరైనా చైనీయులతో పెట్టుకోవాలని భ్రమపడితే నష్టపోకతప్పదు. ఆ ప్రయత్నాలు చేసే వారి తలలు బద్ధలవుతాయి. 140 కోట్ల చైనా పౌరుల రక్తమాంసాలతో కూడిన గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్‌కు బాది రక్తాన్ని చిందిస్తాం’ అని అన్నారు. అమెరికా, చైనాల మధ్య సంబంధాలు మరింత కుచించుకుపోతున్న తరుణంలో జిన్‌పింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మా మాటే వినాలంటే ఒప్పుకోం

ఇతర దేశాల విజయాల నుంచి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటామని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారు. ‘ఇతర సంస్కృతులు సాధించిన విజయాల నుంచి నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. సహాయకర సలహాలను ఆహ్వానిస్తాం. నిర్మాణాత్మక విమర్శలనూ స్వీకరిస్తాం. అంతేకానీ, తామే నీతి సూత్రాలు చెబుతామని, తాము చెప్పిన వాటినే ఇతరులు పాటించాలని భావించే వారి నుంచి ఉచిత ఉపన్యాసాలను స్వీకరించం. వాటిని పట్టించుకోం’ అని స్పష్టం చేశారు.

సామ్యవాదమే చైనాకు రక్ష

చైనా ప్రజలు నిత్యనూతనంగా ఉండటానికి ఇష్టపడతారని, పాత ప్రపంచాన్ని ధ్వంసం చేయడానికి వారు వెనుకాడరని అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. కొత్త ప్రపంచాన్ని నిర్మించడంలోనూ ముందుంటారని వివరించారు. చైనాను సామ్యవాదమే రక్షిస్తుందని స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శతవసంతోత్సవాల సందర్భంగా ద్విశత వార్షికోత్సవానికి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. అప్పటి వరకు చైనాను అన్ని అంశాల్లో గొప్ప ఆధునిక సామ్యవాద దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తైవాన్ విషయంలోనూ శషభిషలకు తావులేకుండా చైనా వైఖరిని పునరుద్ఘాటించారు. తైవాన్‌ను చైనాలో ఐక్యం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, చైనా సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడంలో పౌరుల సామర్థ్యాలను తక్కువ అంచనా వేయవద్దని అన్నారు. తైవాన్, చైనా బిడ్డలు, సోదరసోదరీమణులు కలిసి పనిచేసుకోవాలని, పరస్పరం సంఘీభావాన్ని ఏర్పరుచుకోవాలని సూచించారు. తైవాన్ స్వాతంత్ర్యమనే కుట్రలను భగ్నం చేయాలని తెలిపారు.

Next Story