కరోనా ఎఫెక్ట్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో భారీ కోత!

by  |
కరోనా ఎఫెక్ట్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో భారీ కోత!
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. అమెరికా, చైనా, పలు యూరపు దేశాలు ఈ వైరస్ బారిన పడి విలవిలలాడుతున్నాయి. రోజుల తరబడి లాక్ డౌన్ తో ఆ దేశాల్లో ఉత్పత్తి స్తంభించిపోయింది. మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిని వేల కోట్ల డాలర్ల సంపద ఆవిరవుతోంది. ఈ ప్రభావం భారత్ పై ఎలా ఉండబోతోందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా, పై దేశాలకు చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజాలకు సేవలు అందించే ఇండియన్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మన దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది సాఫ్ట్ వేర్, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారని, ప్రస్తుత లాక్ డౌన్ తర్వాత వీరిలో ఎంత మంది ఉద్యోగాలు గల్లంతవుతాయో చెప్పలేమని, చాలా మంది రోడ్ల మీద పడక తప్పదని వీళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పుణె, బెంగళూరు, గుర్గావ్ తదితర నగరాల్లో ఐటీ ఉద్యోగులపై స్వచ్చందంగా రాజీనామా చేయాలన్న ఒత్తిడి పెరుగుతోందంటున్నారు. హైదరాబాదుకు సైతం ఈ ముప్పు పొంచి ఉందని, ఇదే జరిగితే ఇక్కడ 2008 తరహాలో వేలాది మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇంటిదారి పట్టక తప్పదని అంటున్నారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనగానే ఆరంకెల జీతం, మెడలో టాగ్, సూటు బూటు, క్యాబ్‌లో వెళ్లి రావచ్చు.. ఇలా ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కరోనా వైరస్ ఉనికిలోకి రావడంతో అనేకమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తొలిరోజుల్లో ‘వర్క్ ఫ్రం హోమ్’ ఉంటుంది గదా అనే ధీమాతోనే ఉన్నారు. కానీ ‘లాక్‌డౌన్’ పరిస్థితి అనంతరం వారి ఉద్యోగాలకు ఎసరు వస్తుందేమో అనే ఆందోళన ఇప్పుడు వారిని వెంటాడుతోంది. అనేక ఉత్పత్తి రంగ పరిశ్రమలు, రిటైల్ రంగం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న ఉదాహరణలను వారు చూస్తూనే ఉన్నారు. నగరంలోని అనేక సాప్ట్‌వేర్ పరిశ్రమలు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని పెద్ద కంపెనీలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి సేవలందిస్తున్నాయి. ఆ దేశాల్లోని ఆర్థికవ్యవస్థ, ఐటీ పరిశ్రమల ఆర్థిక వనరులు దెబ్బతినడంతో ఇప్పుడు ఇక్కడి ఐటీ పరిశ్రమలో కూడా అనుమానాలు ముసురుకున్నాయి. నగరంలో సుమారు ఐదారు లక్షల మంది సాఫ్ట్‌వేర్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. తక్కువ సర్వీసు ఉన్నవారికి, ఎక్కువ జీతం తీసుకుంటున్నవారికి, ఒకే పనిలో సుదీర్ఘ అనుభవం ఉన్నా మరో పనిలో అనుభవం లేనివారికి ఉద్యోగ భద్రత అనుమానమే అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే జీతాన్ని తగ్గించుకోడానికి ఉద్యోగులు సిద్ధపడినట్లయితే ఉద్యోగ భద్రతకు ఢోకా ఉండదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

ఈ రంగాలకు ఢోకా లేదు..

బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, టూరిజం, ట్రావెల్, ఔట్‌సోర్సింగ్, సైట్ సర్వీస్ లాంటి పలు రంగాల్లో సేవలందిస్తున్న ఐటీ పరిశ్రమలకు ముప్పు తప్పదని ఒక సాఫ్ట్‌వేర్ పరిశ్రమలోని సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, ఆన్‌లైన్, సూపర్ మార్కెట్ చైన్స్, ఈ-కామర్స్, ఆర్ అండ్ డి, ఫార్మా, రిమోట్ వర్క్, టెక్నాలజీ సర్వీసెస్ లాంటివి మాత్రం కరోనా ఒడిదుడుకులను తట్టుకోవడంతో పాటు సమీప భవిష్యత్తులో లాభాల బాట పడతాయన్నారు. వీటిలో ఉద్యోగాల భద్రతతో పాటు కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నందువల్ల తక్కువ జీతాలకు పనిచేయడానికి ఎక్కువ మంది దొరుకుతారని, ఉపాధి లభిస్తున్నప్పటికీ వేతనాల్లో మాత్రం భారీ కోత ఉంటుందని అభిప్రాయపడ్డారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ సంస్థలు ఇకపైన ఖర్చును తగ్గించే ఆలోచన చేస్తాయని, మన దేశంలో మానవ వనరులకు కొరత లేనందున తక్కువ జీతానికే నియమించుకునే అవకాశాలుంటాయన్నారు. కానీ పనిలో ప్రావీణ్యత, పలు పనులు చేయగలిగిన సామర్థ్యం, పోటీతత్వం, అప్పగించిన పనిలో చూపిన ఫలితం తదితరాలే ఉద్యోగ అవకాశాలకు, భద్రతకు కొలమానాలుగా ఉంటాయని అన్నారు. ఇప్పటిదాకా ఉన్న ‘ఫిక్స్‌డ్ పే’, ‘పర్మినెంట్ ప్లేస్‌మెంట్స్’ స్థానంలో ‘ఫ్లెక్సీ పే’ అనే తాత్కాలిక పద్ధతిన తక్కువ జీతంతోనే సరిపెట్టుకునే నూతన రిక్రూట్‌మెంట్ పాలసీలు ఊహించని విధంగా ఉనికిలోకి వస్తాయన్నారు.

ఇప్పటివరకూ సంవత్సరానికి ఇరవై లక్షల జీతం తీసుకుంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇకపైన సగానికి లేదా పన్నెండు లక్షలకే పనిచేసే పరిస్థితులు వస్తాయని, ‘ఫిక్స్‌డ్ పే’ విధానానికి బదులుగా ‘పే ఫర్ పర్‌ఫార్మెన్స్’ అనే విధానాన్ని ఐటీ పరిశ్రమలు అవలంబించే అవకాశాలు ఉన్నాయని సూచనప్రాయంగా తెలిపారు. ఒక్క అమెరికాలోనే సుమారు ఎనిమిది కోట్ల ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్థితులు ఉన్నాయంటూ మూడీస్ అనే సంస్థ చీఫ్ ఎకనమిస్ట్ వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. అంటే అమెరికాలో ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో సగం మంది ఉద్యోగాలకు కోత తప్పదని ఉదహరించారు. అక్కడి డాలర్లలోని వేతనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ రూపాయల్లో ఒక్కరి స్థానంలో పది మంది ఉద్యోగాలను నిర్వహించవచ్చని వివరించారు.

కొనసాగనున్న ‘వర్క్ ఫ్రం హోమ్’..

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సుమారు ఐదారు లక్షల మంది సాఫ్ట్‌వేర్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అమెరికాకు చెందిన పరిశ్రమలు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. ప్రధానంగా అక్కడి కాలమానం ప్రకారం రాత్రి వేళల్లో పనిచేయడానికి ఉద్యోగులు దొరకరు. దీంతో చైనా, భారత్ లాంటి దేశాల్లో యూనిట్లను నెలకొల్పుకుంటాయి. ఆ తరహాలోనే హైదరాబాద్ సహా బెంగుళూరు, చెన్నయ్, పూణె, గుర్గావ్, నోయిడా లాంటి అనేక చోట్ల అమెరికాకు చెందిన ఐటీ కంపెనీల తరపున పనిచేసే యూనిట్లు ఉన్నాయి. చైనాలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆ దేశంలో పనిచేయడానికి బదులు భారత్‌లో ఎక్కువ అవకాశాలు ఉనికిలోకి వచ్చాయి. అమెరికాలో రాత్రి సమయమైనా భారత్‌లో పగటి సమయం అవుతుంది కాబట్టి నిరంతరాయం పని జరగడానికి ఆస్కారం ఏర్పడింది. దీనికి తోడు అమెరికా వేతనాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ కాబట్టి లక్షలాది మందికి ఐటీ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించాయి.

అయితే కరోనా కారణంగా తాత్కాలికంగా ‘వర్క్ ఫ్రం హోమ్’ విధానానికి ఇక్కడి ఐటీ పరిశ్రమలు శ్రీకారం చుట్టాయి. దీంతో ఉద్యోగులను ఇళ్ళ నుంచి ఆఫీసుకు తీసుకురావడానికి క్యాబ్ సర్వీసులకు పెట్టే ఖర్చు తగ్గిపోయింది. క్యాంటీన్ లాంటి అవసరాలకు పెట్టే ఖర్చూ తగ్గిపోయింది. కంపెనీ ప్రతీ నెలా వెచ్చించే ‘ఓవర్ హెడ్ ఛార్జీ’ల్లో భారీ స్థాయిలో ఆదా అయింది. ఇకపైన ఇదే విధానాన్ని కొనసాగించాలని కంపెనీలు భావిస్తున్నట్లు ఆ రంగంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవైపు జీతాల్లో కోత పెట్టడం, కొత్తగా చేరిన ఉద్యోగులు ఇతర పనుల్లో ఇమడలేని పక్షంలో వారికి ఉద్వాసన పలకడం, కొత్తగా రిక్రూట్‌మెంట్ చేయాలనుకునే ప్రతిపాదననలను కొంతకాలం వాయిదా వేసుకోవడం… ఇలాంటి విధానాలను కొనసాగించక తప్పదన్నారు. ఇకపైన ఎప్పటికీ ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని కొనసాగించడం ద్వారా కంపెనీ ఖర్చులు తగ్గించుకోడానికి, ఆర్థిక భారం లేకుండా చూసుకోడానికి వీలు కలుగుతుందని, ఆ దిశగా చాలా కంపెనీలు ఆలోచించే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు.

గుర్గావ్ ఐటీ ఉద్యోగుల టెర్మినేషన్..

ఢిల్లీ శివారు ప్రాంతంలోని గుర్గావ్ కేంద్రంగా పనిచేసే ఒక ఐటీ అనుబంధ (బిజినెస్ ప్రోసెస్ ఔట్‌సోర్సింగ్) సంస్థ సుమారు 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తొలుత స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిందిగా ఉద్యోగులపై వత్తిడి తెచ్చింది. రాజీనామాకు గల కారణాలను వివరించాల్సిందిగా వారు హెచ్ఆర్ మేనేజర్‌ను కోరారు. కానీ కారణాలను వివరించకపోవడంతో రాజీనామా చేయలేదు. చివరకు వారిని మూకుమ్మడిగా టెర్మినేట్ చేస్తూ మార్చి 26 తెల్లవారుజామున ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం (ఫోరమ్ ఫర్ ఐటీ/ఐటీఇఎస్ ఎంప్లాయీస్) దృష్టికి తీసుకెళ్ళారు బాధిత ఉద్యోగులు. ఈ ఉద్యోగం తప్ప మరో ఉపాధి అవకాశం లేదని, ప్రస్తుతం లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్ళలేమని, జీతం వస్తేనే ఇంటి అద్దె, అప్పులు కట్టడం సాధ్యమవుతుందని మొరపెట్టుకున్నారు. చివరకు హర్యానా రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ విషయాన్ని వివరించింది. కేంద్ర కార్మిక శాఖ ఆదేశాల ప్రకారం వీరిని టెర్మినేట్ చేయడానికి వీల్లేదని, ఆఫీసుకు రాకున్నా జీతం చెల్లించాల్సిందేనని, రాజీనామా ఒత్తిడి చేయవద్దంటూ ఆ కంపెనీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. పూణె లోని మరో సంస్థ సైతం ఇదే తీరులో ఉద్యోగులకు ఉద్వాసన పలికితే ఆ రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమల్లోని కనీసంగా రెండు లక్షల మందికి ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం కానుందని ఒక ప్రముఖ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ వ్యాఖ్యానించారు.

దేశం మొత్తం మీద సుమారు 60 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నా సుమారు 12 లక్షల మంది ఐదు ప్రముఖ కంపెనీల్లోనే ఉన్నారని, మిగిలినవారు ఆ ప్రధాన కంపెనీలపై ఆధారపడిన చిన్నచిన్న ఐటీ పరిశ్రమల్లో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఐటీ ఉద్యోగులకు విదేశీ టూర్లు, రవాణా సౌకర్యాలు కల్పించే లాజిస్టిక్ సేవలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడిందన్నారు. ఒక సీనియర్ ఉద్యోగి ఆఫీసు పనిమీద ఇతర దేశాలకు వెళ్ళాల్సి వస్తే ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం మొదలు ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసి విమానాశ్రయంలో వదలడం, విదేశంలో తగిన వసతి సౌకర్యాన్ని ఇక్కడి నుంచే సమకూర్చడం, తిరుగు ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం… ఇలా అనేక పనులను చేసే సర్వీసు సంస్థలు ఉన్నాయని, ఇప్పుడు అవన్నీ ఆగిపోవడంతో ఇలాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీల మనుగడ ప్రశ్నార్థకమైందని, పలితంగా ఆ ప్రభావం ఉద్యోగులపై పడిందని వివరించారు. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను సకాలంలో పూర్తిచేయడానికి చాలా సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉద్యోగులతో ‘వర్క్ ఫ్రం హోమ్’ ద్వారా పనిచేయిస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కాంట్రాక్టులు సంపాదించడం కష్టమేనని, ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమన్నారు.

Tags: Corona, IT, ITES, Employees, Jobless, Resignation, Termination



Next Story

Most Viewed