మహ్మద్ సిరాజ్ విజయ రహస్యం ఇదే

by  |
మహ్మద్ సిరాజ్ విజయ రహస్యం ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: మహ్మద్ సిరాజ్.. ప్రస్తుత యువ క్రికెటర్లలో ఓ సంచలనం. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో రెండు మేడిన్ ఓవర్లు వేసిన ఘనత ఇతడి సొంతం. అంతేకాదు.. అదే లీగ్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్న ఆటగాడు ఇతడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన తొలి టెస్టు సిరీస్‌లోనే ప్రత్యర్థులను బెంబేలెత్తించిన వికెట్ల వీరుడు. హార్డ్ హిట్టర్లకు సైతం సవాల్‌గా మారిన బౌలర్ అతడు. ప్రస్తుతం మహ్మద్ సిరాజ్‌ పేరు యావత్ ప్రపంచం అంతా వినబడుతోంది. ఎంతో మంది యువ ఆటగాళ్లకు రోల్డ్‌ మోడల్‌గా ఎదిగాడు సిరాజ్. కానీ, అతడు ఆ స్థాయిలో ఉండటానికి కారణం తన తండ్రి మహ్మద్ గౌస్. తండ్రి ఆశయం, అతడి లక్ష్యం ముందు పోటీ ప్రపంచం తలవంచింది. దీంతో ప్రపంచ బౌలర్‌‌గా సిరాజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఇంతటి గుర్తింపు సాధించిన భారత ఫాస్ట్ బౌలర్ ప్రస్థానం మొదలైంది మాత్రం హైదరాబాద్‌లోనే.

హైదరాబాద్ కుర్రాడే..

హైదరాబాద్‌ టోలీచౌకికి చెందిన సిరాజ్… మార్చి13, 1994న ఓ పేద కుటుంబంలోనే జన్మించాడు. తండ్రి మహ్మద్ గౌస్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయినప్పటికీ తన కొడుకులను ఉన్నత స్థాయిలో చూడాలని కలగన్నారు. సిరాజ్‌కు సోదరుడు కూడా ఉన్నాడు. అయితే, పాతబస్తీ గల్లీ క్రికెటర్‌గా మొదలైన సిరాజ్‌ క్రికెట్ ప్రయాణం మైదానం వరకు తీసుకెళ్లింది. హైదరాబాద్‌లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలోనే సిరాజ్.. ఈద్గా మైదానంలో ఎన్నో మ్యాచులు ఆడాడు. ముఖ్యంగా అతడు బౌలింగ్‌పైనే ఫోకస్ చేశాడు. కాళ్లకు షూ లేకున్నా సరే మైదానంలో పదునైన బంతులను సంధించసాగాడు. దీనికి తోడు సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ క్రికెట్ ఆడేందుకే ఎంతో ఎంకరేజ్ చేశాడు. స్వయంగా సిరాజ్‌ను మైదానంలో వదలివెళ్లేవారు.

ప్రస్థానం మొదలైంది అప్పుడే..

ఇక యుక్త వయస్సుకు వచ్చే వరకు మహ్మద్ సిరాజ్‌ ఆటను ఎంతో మెరుగుపరుచుకున్నాడు. ఇక సిరాజ్‌ ఆటను గుర్తించి హైదరాబాద్ క్రికెట్ క్లబ్‌లో అవకాశం వచ్చింది. ఈ తరుణంలోనే నవంబర్ 15, 2015లో హైదరాబాద్ తరఫున రంజీ మ్యాచ్ ఆడిన సిరాజ్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 2.6 కోట్లు పెట్టి సిరాజ్‌ను కొనుగోళు చేయడంతో అతడి దశ తిరిగింది. అక్కడ మొదలైన మహ్మద్ సిరాజ్ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే సిరాజ్ ముద్ర వేయడంతో.. అతడి ప్రతిభను గుర్తించిన బీసీసీఐ నవంబర్ 4, 2017లో న్యూజీలాండ్‌తో జరిగిన టీ-20లో అవకాశమిచ్చింది.

కెప్టెన్ కోహ్లీ చొరవ..

ఇదే సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేరువైన మహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. దీంతో 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సిరాజ్‌ను కొనుగోలు చేసింది. దీంతో 2018-2019-2020-సీజన్‌లల్లో సిరాజ్ బెంగళూరు తరఫున ఆడాడు. ముఖ్యంగా దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-13లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. కోల్‌కతాతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఏకంగా రెండు మేడిన్ ఓవర్లు వేశాడు. ఇదే సమయలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీసి కొత్త రికార్డు సృష్టించాడు. ఇక మహ్మద్ సిరాజ్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో అతడు ఇండియా టూర్ ఆఫ్ ఆసీస్‌లో చోటు సంపాధించాడు.

తండ్రి మరణ వార్త..

ఇక తండ్రి అనుకున్న ఆశయాన్ని నెరవేర్చానని అనుకునే లోపు అతడికి ఊహించని పరిణామం ఎదురైంది. తన కొడుకును ప్రపంచ బౌలర్‌గా చూడాలన్న తండ్రి మహ్మద్ గౌస్ తన కండ్లతో చూడలేకపోయారు. సరిగ్గా ఆసీస్ పర్యటనలో భాగంగా బయోబబుల్‌లోనే సిరాజ్ ఉండగా.. తండ్రి మహ్మద్ గౌస్ చనిపోయారు. ఈ వార్త విన్న సిరాజ్ ఎంతో మనోవేధనకు గురయ్యాడు. తన తండ్రి అంతిమయాత్రకు బీసీసీఐ కూడా అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ సిరాజ్.. తిరిగి ఇంటికివచ్చేందుకు నిరాకరించాడు. తన తండ్రి చివరి మజిలీ కంటే.. తండ్రి ఆశయమే ముఖ్యమని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆసీస్‌ అరంగేట్రంలోనే అద్భుతం చేసి తన తండ్రికి నిజమైన నివాళి అనుకున్నాడు సిరాజ్.

సవాళ్లను ఎదురించి నిలబడ్డాడు..

ఆసీస్‌ టూర్‌ భావోద్వేగ సమయంలో కూడా సిరాజ్ మానసిక యుద్ధమే చేశాడు. అన్ని సవాళ్లను ఎదురించి ఆసీస్ అభిమానుల వివక్ష పూరితమైన మాటల నడుమ సత్తా చాటాడు అంటే అతడి పట్టుదలకు ఇదే నిదర్శనం. ఓ వైపు తండ్రి మరణం, మరోవైపు ఆస్ట్రేలియా అభిమానుల హేళన వ్యాఖ్యలను అధిగమించి కంగారులను చిత్తు చేశాడు. భారత క్రికెట్‌ చరిత్రలోనే ఎవరూ చేయలేనంతగా.. తొలి మ్యాచ్‌లోనే 13 వికెట్లు తీసుకొని అరుదైన ఘనతను సాధించాడు. దీనికి తోడు ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఈ ఘనతతో సిరాజ్ తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడు.

తండ్రికే అంకితం…

మ్యాచ్ అనంతరం వెంటనే హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్ నేరుగా తండ్రి మహ్మద్ గౌస్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత విజయాన్ని, తాను తీసుకున్న వికెట్లను తన తండ్రికి అంకితం చేస్తున్నట్టు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. నిజంగా తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు సిరాజ్ ఒక యుద్ధమే చేశాడని భారత క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేయగా.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే నిదర్శనం అంటూ యావత్ ప్రపంచం కోడై కూస్తోంది. ఇంతటి ఘనత సాధించిన సమయంలో తన తండ్రి పక్కనే లేకపోవడం బాధాకరం. ఏది ఏమైనా అతడి విజయం వెనుక తండ్రి బలమైన ఆశయం, అతడి పట్టుదల ఉట్టిపడుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Next Story

Most Viewed