ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

by  |
ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు
X

దిశ, కామారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదన్న కసితో ఓ కౌన్సిలర్ భర్త ఆ వార్డుకు చెందిన 33 మంది పింఛన్లు తొలగింపజేశాడు. గత 15 రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శరత్ విచారణకు ఆదేశించారు. విచారణలో 33 మంది పింఛన్ల తొలగింపు నిజమేనని నిర్దారణ కావడంతో అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే పింఛన్లు తొలగింపులో పాత్ర ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ రాజును విధుల నుంచి తొలగించారు. పింఛన్ల తొలగింపుపై నిర్లక్ష్యం ప్రదర్శించిన మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ పై జిల్లా కలెక్టర్ శరత్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గత రెండు నెలలుగా తమకు పింఛన్లు రావడం లేదని పింఛన్ దారులు మున్సిపల్ చైర్మన్ కు మొరపెట్టుకున్నారు.

తాత్కాలిక సమస్యే కదా అని భావించి పింఛన్ దారులకు సర్ది చెప్పారు. రెండు నెలలుగా వారు కార్యాలయం చుట్టూ తిరగడంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించిన చైర్మన్ కు అసలు విషయం తెలిసింది. 8 వ వార్డు కౌన్సిలర్ భర్త నులుగొండ శ్రీనివాస్ తమకు ఓటు వేయకుండా ఇతర పార్టీ వ్యక్తికి వేశారని వారిపై ఎలాగైనా కసి తీర్చుకోవాలని భావించాడు. దానికోసం ఆ వార్డులో ఓటు వేయని వారికి ఎంతమందికి పింఛన్ వస్తుందో వివరాలు తీసుకుని కంప్యూటర్ ఆపరేటర్ రాజుతో పింఛన్లు తొలగింపజేశాడు. కంప్యూటర్ ఆపరేటర్ రాజును గట్టిగా నిలదీయగా విషయం బయటకు పొక్కింది.

ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెల్దామని పింఛన్ దారులు సిద్ధమవ్వగా విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఎంతమంది పింఛన్లు తొలగించబడ్డాయో అంత మందికి సొంత డబ్బులు ఇవ్వజూపాడు. దాంతో ఆగ్రహించిన పింఛన్ దారులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కలెక్టర్ ఆపరేటర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత జరిగినా దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ ను కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story

Most Viewed