2021లో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఎన్నికలు, నియామకాలు ఇవే..

727
Kavitha-Photo11

2021 సంవత్సరంలో జరిగిన పలు ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హుజురాబాద్, మా అసోషియేషన్ ఇలా పలు ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా వాటిపై చర్చ కొనసాగింది. ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీశ్ రావుకు ఈటల రాజేందర్ మరోసారి షాకిచ్చారు. అదేవిధంగా ఏపీలో కూడా ఎప్పుడూ లేని విధంగా శాసనమండలికి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణలో పలువురు నేతలకు మళ్లీ ఎమ్మెల్సీ పదవులు వరించగా.. మరికొంతమంది ఉద్యమకారులకు కూడా పదవులు లభించాయి. అదేవిధంగా పలు నియామకాలు కూడా జరిగాయి. వాటన్నిటి వివరాలు మీ కోసం..

 

Etela-Rajendhar-1

1. హుజూరాబాద్ లో ఈటలకే జై..

అధికార టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనూహ్యంగా, రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. విజయాన్ని ప్రసాదించిన హుజూరాబాద్ ఓటర్లకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని ఈటల రాజేందర్ ఎంతో భావోద్వేగంగా చెప్పారు. తమ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితమని, అన్యాయానికి, అధర్మానికి తన విజయం చెంప చెళ్లుమనిపించిందని అభివర్ణించారు. ఈటలది ఇది ఏడోసారి విజయం. మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

 

MLC Selection of Candidates

2. ఏపీలో 15 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పూర్తి మెజార్టీ ఉన్న వైసీపీ, ఇపుడు శాసన మండలిలోనూ అధిక సభ్యులు కలిగిన పార్టీగా అవతరించింది. ఎమ్మెల్యే కోటాలో కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కల్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 11 మంది ఏకగ్రీవమయ్యారు. ఎన్నికైన అభ్యర్థులు జిల్లాల వారీగా… ఇందుకూరు రఘురామరాజు (విజయనగరం), వరుదు కళ్యాణి, వంశీకృష్ణయాదవ్ (విశాఖ), ఆనంత ఉదయభాస్కర్ (తూర్పు గోదావరి), తలశిల రఘురాం, మొండి తోక అరుణ్ కుమార్ కృష్ణా), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు గుంటూరు), తూమాటి మాధవరావు, చిత్తూరు నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ ప్రకాశం), వై.శివరామిరెడ్డి (అనంతపురం).

 

CM KCR, Madhusudhana Chary

3. మండలికి గుత్తా, కడియం, సిరికొండ

రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఆరు ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. మెజారిటీ సభ్యులు ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీకే ఈ పదవులు దక్కాయి. ఈ గెలుపును నవంబర్ 22న లాంఛనంగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, పరుపాటి వెంకట్రామిరెడ్డి ప్రమాణం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి నియమితులయ్యారు. ఆయన పేరును సిఫార్సు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ గవర్నర్ కు పంపగా, దాన్ని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ – హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణిదేవి గెలుపొందారు.

 

balaraj11

4. ఉద్యమకారులకు పదవులు..

రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ హుజూరాబాద్ ఉపఎన్నికల నుంచి ప్రారంభమైంది. ఆ ఎన్నికకు ముందు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ కు సర్కారు కీలక పదవిని కట్టబెట్టింది. ఇటీవల మళ్లీ నియామకాలను షురూ చేసిన ప్రభుత్వం మొదట రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ గా మన్నె క్రిశాంక్ ను, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ను, గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా వీడ సాయిచంద్ ను నియమించింది. ఈ ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థి నేతలే కావడం గమనార్హం. కాగా, డిసెంబర్ 17న రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడైన జూలూరి గౌరశంకర్‌ను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను తెలంగాణ మహిళా ఫైనాన్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా, విద్యార్థి నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా, గజ్జెల నాగేశ్వర్‌ను తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా, పాటిమీది జగన్ మోహన్ రావును తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

 

5. మంత్రి హరీశ్ కు అదనంగా ఆరోగ్యం..

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావుకు ఆర్థికశాఖతో పాటు అదనంగా ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ అప్పగించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు ఆగస్టు 22న ఆయన్ను ప్రభుత్వం ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కూడా నియమించింది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని విడటంతో ఈ అధ్యక్ష పదవీ ఖాళీ అయింది.

 

6. తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేలు..

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నియమిస్తూ ప్రకటన జారీ చేసింది. అప్పటికి చీఫ్ జస్టిస్ గా ఉన్న రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరఖండ్ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. హిమా కోహ్లీతో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు గోస్వామితో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు.

 

7. హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వీరిని నియమిస్తూ గెజిట్ జారీ చేసింది. ఇందులో నలుగురు మహిళా జడ్జిలున్నారు. కొత్త జడ్జీల్లో డాక్టర్ చిల్లకూరి సుమలత, శ్రీ సుధ, గురజాల రాధారాణి, మస్నూరి లక్ష్మణ్, నున్నావత్ తుకారంజీ, అద్దుల వెంకటేశ్వర్ రెడ్డి, జ్యూడీషియల్ అధికారులుగా పట్లోళ్ల మాధవీలత ఉన్నారు. ఈ ఏడుగురితో కలిపి ప్రస్తుతం హైకోర్టు జడ్జీల సంఖ్య 20కి చేరనున్నది. ఇంకా 22 మంది జడ్జీల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు పరిధిలో ఉన్న ఈ కింది స్థాయి కోర్టుల్లో మొత్తం జడ్జిల సంఖ్య 474 కాగా, ఇంకా 96 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

 

kavitha 1

8. స్కౌట్స్ , గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా కవిత

స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా రెండోసారి ఎమ్మెల్సీ కవిత ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని స్కౌట్స్, గైడ్స్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో కవిత ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ప్రకటించారు.

 

9. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. నోరి క్యాబినెట్ హోదాలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. నోరి ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్. ఆయన ఇటీవల ఏపీ సీఎం జగన్ ను కలిసి అధునాతన వైద్య విధానాలపై ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో ఆయనను ప్రభుత్వ సలహాదారుగా ఉండి సేవలందించాలని సీఎం జగన్ కోరి, నియమించారు.

 

Manchu Vishnu

10. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక జాయింట్ సెక్రటరీ పోస్టులు ఆయన ప్యానెల్ కే దక్కాయి. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్ , ఒక జాయింట్ సెక్రటరీ పోస్టులను చేజిక్కించుకుంది. మొత్తం 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పోస్టుల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన 11 మంది, మంచు విష్ణు ప్యానెల్ కు చెందిన ఏడుగురు గెలిచారు.

 

11. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

టీఎస్ పీఎస్సీ సెక్రటరీగా అనితా రామచంద్రన్ నియమితులయ్యారు. ఐఏఎస్ బదిలీల్లో భాగంగా పంచాయతీరాజ్ కమిషనర్ గా శరత్, వ్యవసాయశాఖ కమిషనర్ గా రఘునందన్ రావు నియమితులయ్యారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్, సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఢాది చివరలో హైదరాబాద్ నగర కమిషనర్ గా సీ వీ ఆనంద్ నియమితులయ్యారు.

 

12. ఎక్సైజ్ లో పోస్టింగులు

ఎక్సైజ్ అధికారులకు ఎట్టకేలకై పోస్టింగ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. పెండింగ్ లో ఉన్న ఈ ఫైల్ కు మోక్షం లభించింది. ఎక్సైజ్ లో పోస్టింగ్ ఆర్డర్ల పెండింగ్ పై దిశ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్పై సీఎంవో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తొలుతగా 12 మంది అధికారులకు పోస్టింగ్ లిచ్చారు. త్వరలో మిగతావారికి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.