ఈసీ సంచలన ప్రకటన.. ముగ్గురు సర్పంచ్‌లు, 78 మంది వార్డు మెంబర్లపై వేటు

by  |
Election Commission
X

దిశ, గుడిహత్నూర్ : మండలంలో ముగ్గురు సర్పంచ్‌లపై అనర్హత వేటు పడటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి నెలకొంది. గ్రామ పంచాయతీ 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సర్పంచ్‌లు సోయం సుగుణ(సోయంగూడ), కుమ్రం లింగు(సూర్యగూడ), తొడసం భారతి(మాన్కాపూర్)లు ఎన్నికల్లో తుది ఖర్చుల వివరాలు ఎన్నికల అధికారులకు సమర్పించలేదు. అయితే, 40 రోజుల క్రితమే వారికి నోటీసులు ఇచ్చినా ఎటువంటి స్పందనా లేకపోవడంతో తదుపరి చర్యల్లో భాగంగా ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసిందని మండల అధికారులు చెబుతున్నారు.

ఒకేసారి అధికార పార్టీకి చెందిన ముగ్గురు సర్పంచ్‌లపై వేటు వేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు సర్పంచ్‌లు కూడా ఆదివాసీ సమాజానికి చెందిన వారు కావడం, అందులో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీ కూడా ఉండటం విశేషం. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 17 మంది సర్పంచ్ అభ్యర్థులపై కూడా మే 2024 వరకు అనర్హత వేటు కొనసాగుతుంది అని అధికారులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా, వివిధ గ్రామపంచాయతీల్లోని 78 మంది వార్డు మెంబర్లపై కూడా ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది.

ఇందులో ముత్నుర్, గురుజ్, బెల్లురి, డోంగర్‌గావ్, గుడిహత్నూర్, మన్నూర్, ముత్నూర్ తండా, సోయంగూడ, సూర్యగూడ, తోషం, గోండ్ అర్కాపూర్, కొలారి, లింగాపూర్, మచ్చాపూర్, సీతాగొంది, శంభుగూడ, కమలాపూర్, తదితర, గ్రామపంచాయతీల్లో ఎన్నికల్లో పోటీ చేసిన వార్డు సభ్యులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని గ్రామపంచాయితీల్లో పాలకవర్గం సర్పంచ్ మినహా వార్డు సభ్యులందరిపై అనర్హత వేటు వేశారు. మచ్చాపూర్, ముత్నూర్ గ్రామపంచాయతీల్లో ఉప సర్పంచ్‌తో సహా, వార్డు మెంబర్లపై కూడా చర్యలు తీసుకోవడంతో అక్కడ పాలకవర్గం పూర్తిస్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. దీంతో గ్రామపంచాయతీల్లో తీవ్ర రాజకీయ చర్చ కొనసాగుతోంది. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన 20 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసిన 154 మందిపై వేటు పడటం రాజకీయంగా సంచలనంగా మారింది.

కోర్టును ఆశ్రయిస్తాం : అనర్హులు

అనర్హత వేటు పడిన సర్పంచ్‌లు సోయం సుగుణ, కుమ్రం లింగు, తొడసం భారతిలు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో ఖర్చుల వివరాలు సమర్పించలేదని పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ పాలక వర్గంపై చర్యలు తీసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.


Next Story