ధర్మపురిలో ఈనెల 13న ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

289

దిశ, ధర్మపురి : నవ నృసింహ క్షేత్రాలలో ఒకటిగా వెలసిన ప్రాచీణ పుణ్య క్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో ఈ నెల 13వ తేది గురువారం నిర్వహించే ముక్కోటి ఏకాదశి మహోత్సవాన్ని ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్య నిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్​ తెలిపారు.

ముక్కోటి ఏకాదశి కార్యక్రమ వివరాలు..

ముక్కోటి ఏకాదశి సందర్భంగా 13వ తేది గురువారం ఉదయం 2.30 గంటలకే శ్రీ లక్ష్మీనృసింహ స్వామి (యోగ, ఉగ్ర), శ్రీ వెంకటేశ్వర స్వాముల మూల విరాట్‌లకు మహా క్షీరాభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం అనంతరం ఉదయం 4 గంటలకు వైకుంఠధామం వద్ద ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన పుష్పవేదికపై మువ్వురు స్వాముల ఉత్సవ మూర్థులను ప్రధాన ఆలయాల నుండి మేళతాళాలతో, వేద మంత్రాలతో తీసుకొచ్చి ఆసీనులను చేసి ప్రత్యేక పూజలను చేపడుతారు. అనంతరం ఉదయం 5 గంటలకు ధర్మపురి శ్రీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతి స్వామి జీ, గుంటూరుకు చెందిన శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీల కరకమలములతో వైకుంఠ ద్వారానికి ప్రత్యేక పూజలను చేసి ద్వారాన్ని తెరువగా భక్తులు ఉదయం 8 గంటల వరకు వైకంఠ ద్వారం నుండి స్వామి వారిని దర్శంచుకుంటారు.

స్వామివారి ఊరేగింపు సేవ రద్దు..

కాగా వైకుంఠ ద్వార దర్శనం అనంతరం స్వామి వారిని పల్లకిపై ఆశీనులను చేసి క్షేత్ర వీధులలో ఊరేగించే సేవా కార్యక్రమాన్ని కొవిడ్ దృష్ట్యా రద్దు చేసినట్లు ఈఓ తెలిపారు.

ఏర్పాట్లు..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయంల బయట, వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటుతోపాటు, దేవాలయంలో ప్రత్యేక శామియాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. అలాగే దేవాలయాలం రాజ గోపురాలకు విద్యుత్​దీపాలతో అలంకరణ చేస్తున్నట్లు ఇంకా భక్తులకు కావలసిన ఏర్పాట్లను చేస్తామని తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాత్రి శేషప్ప కళావేదికపై రాత్రి భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఈఓ తెలిపారు.