ఉద్యోగుల సర్దుబాటు మళ్లీ వెనక్కి.. కొత్త నోటిఫికేషన్లపై ప్రభావం..!

by  |
ఉద్యోగుల సర్దుబాటు మళ్లీ వెనక్కి..  కొత్త నోటిఫికేషన్లపై ప్రభావం..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన జోనల్​ విధానంలో ఉద్యోగుల సర్దుబాటు మళ్లీ సందిగ్థంలో పడింది. ఇప్పటికే మూడు నెలలుగా సాగుతున్న సర్దుబాటు ప్రక్రియ వెనక్కే వెళ్తోంది. తాజాగా పలు అంశాలు తెరపైకి రావడంతో ఈ ఫైల్​ను న్యాయశాఖ సలహాకు పంపించారు. దీంతో ఉద్యోగుల ఆఫ్షన్ల ప్రక్రియ ఇప్పట్లో లేనట్టే కనిపిస్తోంది. ఫలితంగా కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లపై ప్రభావం చూపించనున్నట్లు ఉద్యోగ వర్గాల సమాచారం. ఆప్షన్లు, బదిలీల ప్రక్రియ పూర్తికాకముందే నోటిఫికేషన్లు జారీ చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని ఇప్పటికే అధికారవర్గాలు వెల్లడించాయి. తాజాగా సర్దుబాటు సమస్యగా మారుతుండటం నిరుద్యోగులకు ఆందోళన కల్గించే అంశమే.

ఎలా చేయమంటారు..?

ఇటీవల నూతన జోనల్​ విధానాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి అనుగుణంగా పాత ఉద్యోగులను సర్దుబాటు చేయడంపై స్పష్టత లేకుండా పోయింది. కొత్త జిల్లాల ప్రకారం ఆర్డర్​ టూ సర్వ్​ కింద ఉద్యోగులను బదిలీ చేశారు. కేవలం ఆరు నెలలు, ఏడాది కాలానికి మాత్రమే అంటూ పాత జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు చేశారు. వారంతా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. అంతేకాకుండా జిల్లాల వారీగా అసలు పోస్టులెన్నీ, ఖాళీలెన్ని అనే అంశం తేల్చలేదు. ఇదే నేపథ్యంలో ఉద్యోగుల పదోన్నతులు చేపట్టారు. దాదాపు 50 వేల మందికిపైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో ఆర్డర్​ టూ సర్వ్​ కింద కేటాయించిన సమయంలో చాలా మంది ఉద్యోగులు జోన్లు కూడా మారాల్సి వచ్చింది. తాజాగా ప్రమోషన్లు రావడంతో ఒక్కో కొత్త జిల్లా పరిధిలో ఉన్న పోస్టులను బట్టి చూస్తే పదోన్నతులు పొందిన ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణగా వికారాబాద్​ జిల్లాలో పంచాయతీరాజ్​, పరిషత్​లో సుమారు 10 సూపరింటెండెంట్​ పోస్టులు ఉంటే.. దానికి దాదాపు 18 నుంచి 20 మంది ఉద్యోగులు పోటీ పడుతున్నారు. ఇలా పోస్టులు తక్కువగా ఉండటం, పాత ఉద్యోగులు ఆర్డర్​ టూ సర్వ్​ కింద పని చేస్తుండటం, అదే జిల్లా పరిధిలో కొత్త వారికి ప్రమోషన్లు రావడంతో వీరందరినీ ఎలా సర్దుబాటు చేయాలో అధికారులకు అంతు చిక్కని సమస్యగా మారింది. దీనికి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే అంశంపై క్లారిటీ లేకపోవడంతో పాటు పలు సమస్యలు ఉత్ఫన్నమవుతుండటంతో న్యాయశాఖ సలహాల కోసం ఫైల్​ను పంపించారు. ప్రస్తుతం ఈ ఫైల్​ న్యాయశాఖ దగ్గర పెండింగ్​లో ఉంది.

వీఆర్వో, వీఆర్ఏల సర్దుబాటు ఎట్ల?

మరోవైపు రెవెన్యూ శాఖలోని వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. ఏడాదికాలంగా వీఆర్వో, వీఆర్​ఏలకు ఎలాంటి పనులు చూపెట్టడం లేదు. తమను ఏదో ఒక శాఖలో మెర్జ్ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే వివిధ శాఖల్లో ప్రమోషన్లతో ఏర్పడిన ఖాళీలను వారితో సర్దుబాటు చేస్తారనుకున్నా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీఆర్వోలు 5,200, వీఆర్​ఏ లు 22 వేలు మంది ఉన్నారు. వీరిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల భర్తీపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. అందరినీ ఒకేసారి సర్దుబాటు చేయడం కష్టమని, భవిష్యత్ లో ఏర్పడే ఖాళీల మేరకు సర్దుబాటు చేస్తామని గతంలో అధికారులు వెల్లడించారు. కానీ వీరిని ఎక్కడ.. ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై కూడా న్యాయశాఖను కోరినట్లు అధికారులు చెప్పుతున్నారు. అంతేకాకుండా మెజార్టీ వీఆర్వోలు డిగ్రీ పూర్తి చేసి, 15 నుంచి 20 ఏండ్ల సర్వీస్​ కలిగి ఉన్నారు. వీరిలో చాలా మంది సీనియర్​ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్​ స్పెక్టర్​ ప్రమోషన్లకు అర్హులైనప్పటికీ.. వీరి ప్రమోషన్లను ప్రభుత్వం పక్కనపెట్టింది. వీరందరినీ అడ్జెస్ట్​ చేయాలనుకుంటే ఇప్పుడున్న పోస్టుల్లోనే అవకాశం ఇవ్వాల్సి ఉంటోంది. ఇలా అయితే మళ్లీ పాత ఉద్యోగుల సర్దుబాటు సమస్యగా మారుతోంది. దీంతో న్యాయశాఖ సలహాలు తప్పడం లేదు.


Next Story

Most Viewed