మేడ్చల్ బాలుడికి ‘బాల పురస్కార్’.. ప్రధానితో వీడియో కాల్!

దిశ, తెలంగాణ బ్యూరో : దేశం మొత్తం మీద వివిధ అంశాలపై సృజనాత్మకత కనబరిచిన, సామాజిక దృక్పథంతో సేవా ప్రతిభను చూపించిన 32 మంది చిన్నారులకు ఈ సంవత్సరానికిగాను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అవార్డుకు ఎంపిక చేసింది. అందులో తెలంగాణ నుంచి కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే ఎంపికయ్యాడు. మేడ్చల్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు చదలవాడ హిమేష్‌కు ఈ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఆస్థా సక్సేనా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు మూడు రోజుల క్రితం లేఖ రాశారు. నేడు వీరందరితో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముచ్చటించనున్నారు.

ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు వీరికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నవారి ఆరోగ్య పరిరక్షణకు ఒక స్మార్ట్ వాచీని హిమేష్ కనిపెట్టారు. తన అమ్మమ్మ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక స్మార్ట్ వాచీని తయారుచేసి దీని ద్వారా ఎప్పటికప్పుడు ఆ పేషెంట్ బీపీ, పల్స్, అనూహ్యమైన అనారోగ్య లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఆ వాచీకి అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్లేలా ఒక యాప్‌ను తయారుచేశారు. దీంతో పేషెంట్ బెడ్ మీద నుంచి లేవగానే ఆ యాప్‌లో పేర్కొన్న మొబైల్ నెంబర్లకు మెసేజ్ వెళ్తుంది. దీని ద్వారా నిరంతరం వారి కదలికలను డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడానికి వీలు పడుతుంది. ఈ వినూత్న పరికరాన్ని తయారు చేసినందుకుగాను హిమేష్‌ను అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.