ఏపీ ప్రభుత్వంపై యువత ధిక్కారం!

by Disha edit |
ఏపీ ప్రభుత్వంపై యువత ధిక్కారం!
X

గత ఎన్నికల ప్రచారంలో జగన్ ఎన్నో యువభేరిలు నిర్వహిస్తూ ప్రత్యేక హోదా, ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ లాంటి హామీలిచ్చి మాట తప్పను, మడమ తిప్పను అని ఉద్వేగభరిత ప్రసంగాలు చేసి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కల్పించే విషయంలో, ప్రభుత్వ కొలువుల భర్తీలో విఫలం అయ్యారు. దీంతో పట్టభద్రుల ఓటర్లలో కీలకం అయిన ఉద్యోగార్థులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రికి తెలిసేలా తమకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టభద్రులు ఇచ్చిన తీర్పును గౌరవించి తాను ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీని నెరవేర్చాలి. ఇకపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల శీతకన్ను ప్రదర్శిస్తే రాబోవు ఎన్నికల్లో నిరుద్యోగులు కన్నెర్ర చేయడం తప్పదు.

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తమలో గూడుకట్టుకున్న అసంతృప్తిని అధికార పక్షానికి ఓట్ల రూపంలో వెళ్లగక్కారు. అధికార పక్షం అంచనాలు తలక్రిందులుగా చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను పెద్దల సభకు పంపారు. యువత తమ సమస్యలపై, ప్రయోజనాలపై పోరాటం చేస్తారని పట్టభద్రులు కసితో ఓట్లు వేసి గెలిపించారనేది ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల మెజారిటీలను పరిశీలిస్తే అర్థం అవుతుంది.

మాట తప్పను అంటూనే.. తప్పి

గత ఎన్నికల్లో వైసీపీకి అంత ఆధిక్యం రావడానికి ప్రధాన కారణం యువత. ఆ ఎన్నికల ప్రచారంలో జగన్ ఎన్నో యువభేరిలు నిర్వహిస్తూ ప్రత్యేక హోదా, ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ లాంటి హామీలిచ్చి నిజాయితీకి మారుపేరని మాట తప్పను, మడమ తిప్పను అని ఉద్వేగభరిత ప్రసంగాలు చేసి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కల్పించే విషయంలో, ప్రభుత్వ కొలువుల భర్తీలో విఫలం అయ్యారు. దీంతో పట్టభద్రుల ఓటర్లలో కీలకం అయిన ఉద్యోగార్థులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రికి తెలిసేలా తమకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. మాట తప్పను అంటూ భారీగా గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీ ఉంటుందని హామీ ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని ఆశగా ఎదురుచూసిన ఉద్యోగార్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సంక్షేమం పేరిట నవరత్నాలను పట్టించుకుంటూ ఉద్యోగాల భర్తీని పట్టించుకోలేదు. అయితే దీనికి పరోక్ష కారణం భారీ ఎత్తున చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ అని చెప్పవచ్చు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగానే సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లోనే ఏర్పాటు చేసి జగన్ తన నిజాయితీకి ఎవరూ సాటిరారని పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపై కిమ్మనలేదు. అయితే ఈ భర్తీపై ఎన్నో విమర్శలు, అనుమానాలు, ఆరోపణలు వచ్చినా లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎప్పుడైతే ఈ నియామకాలు చెప్పట్టారో ఈ నియామకాలను ముఖ్యమంత్రి దగ్గరి నుంచి గ్రామస్థాయి నేతల వరకు తాము నిరుద్యోగ యువతకు ఇచ్చిన కొలువుల భర్తీ హామీ నెరవేర్చిన హామీగా లెక్కలేసుకున్నారు. అందుకేనేమో జాబ్ కేలండర్ హామీని అటకెక్కించారు. ఇది ఉద్యోగార్థులు వేయి కళ్లతో ఎదురు చూసిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నియామకాలపై తీవ్ర ప్రభావం చూపింది.

అవకాశాన్ని వినియోగించుకొని..

ఓ వైపు పక్క రాష్ట్రంలో గత ఏడాది నుంచి కొలువుల జాతర కొనసాగుతుంది. పబ్లిక్ లైబ్రరీలన్ని కిటకిటలాడుతున్నాయి. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులపై తీవ్రంగా చూపించిందని పోలైన ఓట్ల సరళిని బట్టి అర్థమవుతుంది. ప్రతి ఏడాది కొత్త సంవత్సరం రోజు ప్రభుత్వం నుంచి జాబ్ కేలండర్ రూపంలో తీపి కబురు వినాలనుకున్నా తీవ్ర నిరాశే మిగిలింది. తమ తోటి తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగ సాధనలో నిమగ్నమవుతుంటే ఆంధ్ర ప్రాంతం వారు మాత్రం తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరాశ్రయులుగా మిగిలిపోయారు. తమ నిరసన గళం తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి రైళ్లలో విజయవాడకు వచ్చి ధర్నాలు,ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులది. మరోవైపు పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు తమపై ఎక్కడ కేసులు నమోదు చేస్తుందో అని, అసలుకే ఎసరు వస్తుంది అని నిరుద్యోగులు ఒకటి రెండు సార్లు మినహా పెద్దగా ఆందోళనలు చేయలేదు.

నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడింది లేదు. ప్రజాదర్భార్ లేదు. మంత్రులకి, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ దొరకడంలేదు. అందుకే వారి నిరసన తెలియజేయడానికి వచ్చిన అవకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో టీడీపీ అర్థ శాస్త్ర నిపుణుడు, వేలాది మందికి పోటీ పరీక్షల్లో అర్థశాస్త్రాన్ని బోధించిన వ్యక్తిని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బలపరిచింది. దీంతో నిరుద్యోగులకు తమ గొంతుక వినిపించే అవకాశం ఉండటంతో తమకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ చిరంజీవిని గెలిపించారు. యువత తమ నిరసనను గాంధేయ మార్గంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఆలోచించి ఓటు హక్కుని వినియోగించుకోవడం శుభపరిణామం.

ఇప్పటికైనా తీర్పును గౌరవించి..

నిజానికి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అసాధ్యం. పదుల సంఖ్యల్లో పోస్టులు ఉన్నా పోటీ మాత్రం లక్షల్లో ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు పక్కనపెడితే ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించి ఉపాధి మార్గం చూపించాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రెండవ అతిపెద్ద తీరరేఖ ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో దాన్ని రాష్ట్రాభివృద్ధికి కోసం వినియోగించలేకపోతుంది ప్రభుత్వం. చాలీచాలని జీతాలతో ఇతర రాష్ట్రాలకు వలస వెళుతోంది యువత. మూలధన పెట్టుబడిని విస్మరించి సంక్షేమం చుట్టూనే ప్రభుత్వం ప్రదక్షిణ చేస్తుండడం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లి ఆదాయ మార్గాలు లేక రోజు గడవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. పైగా ప్రభుత్వం బటన్ నొక్కి ఎప్పుడు తమ ఖాతాలో డబ్బులు వేస్తారా అని ఎదురుచూసే పరిస్థితికి ప్రజలను తీసుకొచ్చారు.

అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం పట్టభద్రులు ఇచ్చిన తీర్పును గౌరవించి తాను ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీని నెరవేర్చాలి. ఇప్పుడు కూడా తమ తప్పుని ప్రభుత్వం తెలుసుకోకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు మరోసారి తమ తీర్పుని చూపిస్తారని మర్చిపోవద్దు. అప్పులు చేసి, కుటుంబానికి దూరంగా ఉంటూ తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బుని పొదుపుగా వాడుకుంటూ నోటిఫికేషన్లు వస్తాయి అన్న ఆశతో లక్షలాది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు వయస్సు రోజు రోజుకు పెరుగుతుంది. వారి ఆశలపై నీళ్లు చల్లోద్దు. వారి ఉసురు తీసుకోవద్దు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇకపై కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల శీతకన్ను ప్రదర్శిస్తే రాబోవు ఎన్నికల్లో నిరుద్యోగులు కన్నెర్ర చేయడం తప్పదు.

జి.వి.సాయికుమార్ గుంత

93911 42989



Next Story

Most Viewed