అధికార దుర్వినియోగంతో గెలుపు

by Disha edit |
అధికార దుర్వినియోగంతో గెలుపు
X

తూరు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులు నిలబెట్టుకున్న అభ్యర్థులు ఓడిపోయారు. దీనికి కారణాలు ఎన్నో. ప్రైవేట్ ఓట్లను నోట్లు కొల్లగొట్టాయి. ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఉపాధ్యాయుల విజ్ఞత పరీక్షకు నిలిచింది. ఇద్దరు డీఈఓలు గడ్డి కరిచారు. గెలవడమే ప్రామాణికంగా పెద్దయెత్తున ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న వారిని ఓటర్లుగా చేర్చడం ఒక పెద్ద మలుపు. వీటన్నింటికింటే మిన్నగా ఉపాధ్యాయుల సంఘాల స్వయంకృతాపరాధం వ్యతిరేకంగా పనిచేసింది. సంఘాల మధ్య చీలిన ఓట్లు అధికార పార్టీ అభ్యర్థులకు విజయం కట్టబెట్టాయి. ఇదొక చేదు అనుభవం. ఉపాధ్యాయులలో కనువిప్పు కలిగేందుకు వచ్చిన తొలి అవకాశంగానే ఈ ఓటమిని చూడాలి.

బ్రిటిష్ వారు భారతదేశాన్ని వందేళ్లు పరిపాలించగలిగారంటే కారణం వారి బలం కాదు. స్వదేశీ ద్రోహులు అందించిన సహకారం. కర్ణుడి చావుకు వంద కారణాలు, శతాధిక శాపాలు, రాచరికపు దుర్నీతి వెరసి కౌరవ సామ్రాజ్యాన్ని కూల్చివేశాయి. ఇదే కర్ణుడి అంతాన్ని చూసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే ముగిసిన ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులు నిలబెట్టుకున్న అభ్యర్థులు అధికార వైసీపీ చేతిలో ఓడిపోయిన ఘటన మరోసారి ఈ ఉదంతాన్ని చాటి చెప్పింది.

అసలు విషయానికి వస్తే....

తూరు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులు నిలబెట్టుకున్న అభ్యర్థులు ఓడిపోయారు. ఈ ఓటమి పరిశీలకులు ముందుగా ఊహించిందే! అభ్యర్థులు గెలవలేకపోవచ్చు. కానీ అది గౌరవ ప్రదమైన ఓటమి అనే చెప్పాలి.. శాసనమండలి పునరుద్ధరణ తర్వాత నుంచి జరిగిన మూడు దఫాల ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థుల అప్రతిహత విజయయాత్రను అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డి అడ్డుకుంది. అర్ధ శతాబ్దపు యూటీఎఫ్ గోడలను పడగొట్టింది. సంఘాల మధ్య చీలిన ఓట్లు అధికార పార్టీ అభ్యర్థులకు విజయం కట్టబెట్టాయి. ఇదొక చేదు అనుభవం. ఉపాధ్యాయులలో కనువిప్పు కలిగేందుకు వచ్చిన తొలి అవకాశంగానే ఈ ఓటమిని చూడాలి.

ఎన్నికల పరంపరను పరిశీలిస్తే...

తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల తరపున పోటీ చేసే అభ్యర్థులు తొలి నుంచీ సునాయాసంగా గెలిచే పరిస్థితి వుండేది. కానీ దాన్ని సంఘాల ఆధిపత్య ధోరణితో చేజేతులా జారవిడుచుకోవడం జాలి కలిగిస్తున్నది. మాదే పెద్ద సంఘం, మేమే ఎమ్మెల్సీలుగా ఉండాలి అని ఒంటెద్దు పోకడలు ఇపుడు ఉపాధ్యాయ సంఘాలకు వెగటు పుట్టించాయి. గెలిచినవారు కూడా ఉపాధ్యాయులతో మమేకమైన సందర్భాలు కూడా తక్కువే. అలాగే ఉపాధ్యాయ, విద్యారంగం పలుదఫాలుగా కుదుపులకు గురైనా అండగా నిలబడడంలో, ప్రభుత్వాన్నీ ఎదుర్కోవడంలో ఉదాసీనంగా వ్యవహరించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును పిడిఎఫ్ కూటమి కనీసంగా నిలువరించలేకపోయారు. పలు జిల్లాల్లో ఉమ్మడి కార్యాచరణకు బదులు సొంత అజెండాతో ముందుకెళ్లిన వైనంతో యూటీఎఫ్ యేతర సంఘాలు అప్రమత్తమయ్యాయి. యూటీఎఫ్ కింది స్థాయి కేడర్లోనూ ఏర్పడిన ఒకింత వ్యతిరేకత ప్రస్తుత ఎన్నికల్లో ఓటింగ్‌ను ప్రభావితం చేశాయి. ఆ సంఘంలోని ఒక వర్గం పూర్తిగా బాబురెడ్డికి వ్యతిరేకంగా పనిచేసింది.

గడిచిన మూడు ఎన్నికల్లోనూ యూటీఎఫ్ ఒక వర్గ నాయకులనే అభ్యర్థులుగా ఎంపిక చేస్తుండడం కేడర్‌ని నిరుత్సాహానికి గురి చేసింది. అభ్యర్థిని ప్రకటించిన రోజే వారు బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అదే అదనుగా కొన్ని సంఘాలు ప్రతిగా తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. 30కి పైగా చిన్నాచితకా సంఘాలు యూటీఎఫ్ వ్యతిరేక అభ్యర్థికి మద్దతు ఇవ్వడం, తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా ప్రచారం చేయడం కొంత కలిసొచ్చింది. దరిమిలా ప్రభుత్వ రంగానికి చెందిన ఉపాధ్యాయులు మూడున్నర వేల ఓట్లు పొందడం, రెండో ఓటును అధికార పార్టీకి బదలాయించడం జరిగింది. అంతేకాదు ప్రచారంలోనూ యూటీఎఫ్ వారు వెనకబడ్డారు. మూడు దఫాలుగా ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తులు ముఖం చాటేసి అంటీఅంటనట్లు వ్యవహరించడంతో కొన్ని వర్గాలు ప్రచారానికి దూరమయ్యాయి. చట్టం రాజ్యాంగ బద్దంగా వ్యవహరించి వున్నట్లైతే అధికార పార్టీ అభ్యర్థికి కనీస డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదు.

మితిమీరిన విశ్వాసం దెబ్బతీసింది

గెలవడమే ప్రామాణికంగా పెద్దయెత్తున ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న వారిని ఓటర్లుగా చేర్చడం ఒక పెద్ద మలుపు. వాస్తవానికి ప్రైవేటు విద్యాసంస్థల్లో 40 శాతం మందికి కూడా ఓటర్లుగా నమోదయ్యేందుకు అర్హతలు లేవు. అయినా తూర్పు, పశ్చిమ రాయలసీమల్లోని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఒక పెద్ద తప్పు చేశారు. ఒత్తిడికి లొంగని ఇద్దరు అధికారులు శామ్యూల్, రమేష్‌లపై రాత్రికి రాత్రే బదిలీ వేటు వేశారు. ఈ ఉపద్రవంపై ఉద్యమించడంలోనూ పిడిఎఫ్ చతికిలపడింది. మొత్తం 18 వేలకు పైబడి ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు గంపగుత్తగా ఓట్లు తమకే గుమ్మరిస్తారనే మితిమీరిన విశ్వాసంతోపాటు, వివిధ సంఘాలు ఉమ్మడిగా నిలబెట్టిన అభ్యర్థి పెద్దగా ఓట్లు చీల్చలేరనే భ్రమలోనూ ఉండిపోయారు. ఫలితమే ఈ పరాజయం.

రాష్ట్ర ఉపాధ్యాయ యవనికపై ఒక పెద్ద సంఘంగా ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలకు, వేధింపులకు దిగుతున్న ప్రభుత్వాలను ఎదుర్కోవడానికి సంఘాలను ఉపాధ్యాయులను ఐక్యతా పధంలో నిలపాల్సిన యూటీఎఫ్ తన స్వార్ధానికి బలైంది. పేరులో ఉన్న యునైటెడ్ ఆచరణలో చూపలేకపోయింది. తూర్పున ఉదయించిన అరుణకాంతులు తాత్కాలికంగా ఉడాయించి పడమటి కొండల్లో దుప్పటి కప్పుకున్నప్పటికీ రేపటి సూర్యోదయం కోసం మెలుకువతో వేచి చూద్దాం!

అధికారపార్టీకి ఎదురుగాలి

అంతేకాదు... తూర్పు, పశ్చిమ రాయలసీమల్లో ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనే కాకుండా వాటితో పాటు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికలలో మొత్తంగా అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది. అంటే తొమ్మిది పూర్వపు జిల్లాల్లోని వందకు పైబడిన శాసనసభ నియోజకవర్గాల్లో ఓటర్ల నాడిని బహిర్గతం చేసింది. అధికార పార్టీ పట్టభద్రుల ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఓటర్లు తమ విజ్ఞతను చాటారనే చెప్పాలి. ప్రత్యర్థి బలహీనత ఆధారంగా గెలుపొందిన అధికార వైసీపీకి ఇది హెచ్చరికగానే భావించాలి.

-మోహన్ దాస్

ఏపిటిఎఫ్ 1938.

94908 09909

Next Story

Most Viewed