వరల్డ్ వాక్: మార్పునకు గుర్తు షింజో అబే

by Disha edit |
వరల్డ్ వాక్: మార్పునకు గుర్తు షింజో అబే
X

రెండవ ప్రపంచ యుద్ధానంతరం జన్మించి, తన దేశాన్ని అన్ని రకాలుగా అవగాహన చేసుకొని, జపాన్ అభివృద్ధికి తన పదవీ కాలం, జీవితాన్ని అంకితం చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు. అదే సమయంలో మనలాంటి దేశాలకు అనేక రకాలుగా తన పదవీ కాలంలో సహాయసహకారాలు అందించి, చేదోడువాదోడుగా ఉన్న షింజో అబే శుక్రవారం తన 67 సంవత్సరాల వయస్సులో అకస్మాత్తుగా కాల్పులలో మరణించుట మనకు, ప్రపంచ దేశాలకు, అంతకు మించి జపాన్ దేశానికి ప్రజలకు తీరనిలోటు అని తెలుపుట అతిశయోక్తి కాదు. ఆయన మరణవేదన నుంచి జపాన్ అతిత్వరలో బయటపడి ఆయన ఆశయాల సాధనలో ఈనాటి పాలకులు పయనిస్తారని ఆశించుటయే షింజో అబే కు మనం ఇచ్చే ఘన నివాళి.

పాన్​లోని ఒక ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించిన 'షింజో అబే'అతి చిన్న వయసులోనే జపాన్ ప్రధాని పదవిని చేపట్టారు. ఎక్కువ కాలం దేశానికి ప్రధానిగా సేవలు అందించారు. 2006లో ఒకసారి, తరువాత 2012 నుంచి 2020 వరకూ ప్రధాని పదవిలో కొనసాగారు.‌ అనారోగ్య కారణాల రీత్యా రాజీనామా చేసిన షింజోను గత శుక్రవారం ఆగంతుకుడి తుపాకీ కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోవడంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యింది. మన దేశ రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక మిత్రుడిని, స్నేహశీలిని కోల్పోయామని సంతాపం వ్యక్తం చేశారు.‌ ఆయన మీద ఉన్న ప్రత్యేక గౌరవంతో మన దేశంలో శనివారం (9-7-22) ఒక రోజు సంతాపదినం ప్రకటించారు. ఒక దేశ మాజీ ప్రధాని జపాన్​లో ఇలా కాల్పులలో మరణించడం కలకలం సృష్టించింది. కారణం అమెరికాలో లాగ , జపాన్​లో అందరి చేతులలో తుపాకీ ఉండదు.‌ గన్ కల్చర్ తక్కువ. చిన్న తుపాకీ వాడకానికి కూడా పలు ఆంక్షలు ఉంటాయి.‌ త్వరలో జపాన్ పార్లమెంటుకు (డైట్) జరిగే ఎన్నికలలో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థికి అనుకూలంగా క్యాంపైన్ నిర్వహిస్తున్న 'నారా'ప్రాంతంలో ప్రసంగిస్తుండగా అబే హత్యకు గురయ్యారు.

‌అంచెలంచెలుగా ఎదిగి

1993లో మొదటిసారిగా లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అబే పార్లమెంట్​కు ఎన్నికయ్యారు.‌ 2005లో చీఫ్ కేబినెట్ సెక్రటరీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ‌తరువాత సంవత్సరం 2006లో అతి చిన్న వయసులోనే జపాన్ ప్రధాని పదవి చేపట్టారు. అయితే, అనారోగ్యంతో కేవలం ఒక సంవత్సరం కాలంలోనే దిగిపోయారు. అనూహ్యంగా తిరిగి 2012లో ప్రధాని పదవి చేపట్టి 2020వరకూ నిరాకాటంగా కొనసాగి జపాన్ పరిపాలనలో పలు మార్పులు చేశారు. మార్పునకు గుర్తుగా పేరు సంపాదించుకున్నారు.‌ ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానంలో తనదైన ముద్ర వేశారు.‌ దక్షిణ కొరియా పట్ల కఠినంగా, అమెరికాతో మరింత స్నేహంగా మెలిగారు.

అమెరికా సహాకారంలేని, సైనిక శక్తి జపాన్ కలిగి ఉండాలని పరితపించారు. ముఖ్యంగా 'అబెనామిక్స్'పేరుతో ఆయన ప్రవేశపెట్టిన నూతన విధానాలు జపాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసాయని పలువురు పేర్కొన్నారు. ఆయన పదవి చేపట్టడానికి ముందు జపాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడి ఉండుట గమనార్హం.‌ అయితే, ఈయన ప్రవేశపెట్టిన అబెనామిక్స్ విధానాలు జపాన్ దేశాన్ని ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా సుమారు 600 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా నిలబడేటట్లు చేసింది.‌ ఈయన పదవి దిగే సమయంలో కోవిడ్ కాలంలో మరల జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ప్రధాన అంశాలలో

అబెనామిక్స్ విధానంలో మూడు ప్రధాన మార్పులు చేసారు.‌ ఒకటి 'మానిటరీ పాలసీ'అనగా వ్యక్తులకు, సంస్థలకు సులభంగా ఋణం దొరికే ఏర్పాటు. రెండవది 'ఫిస్కల్ స్టిమ్యులేషన్'అనగా పారిశ్రామిక రంగాలకు పన్ను రాయితీలు, మౌలిక సదుపాయాలు పెద్ద పీట. ఇక మూడవది 'స్ట్రక్చరల్ రిఫార్మ్స్'అనగా కార్పొరేట్ సంస్కరణలు. వర్క్ ఫోర్స్ లో మహిళలకు అధిక అవకాశాలు కల్పించుట, లేబర్ లిబరలైజేషన్, వలసలు ప్రోత్సహించుట, ఆర్థిక రంగం బలోపేతం చేయడానికి పలు సంస్కరణలు అమలు చేశారు. జపాన్ రాజ్యాంగానికి పలు సవరణలు చేసి అమలు చేసారు.‌ ఈ విధంగా జపాన్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

మనతో సన్నిహిత సంబంధాలు

ఇక మనదేశానికి జపాన్ దేశానికి మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరచడానికి షింజో అబే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మనదేశంలో 2017 సెప్టెంబర్ నెలలో పర్యటించారు. సబర్మతి ఆశ్రమం దర్శించారు. ముఖ్యంగా మనదేశంలో 'బుల్లెట్ ట్రైన్'నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.‌ అనేక రంగాలలో మనదేశానికి సహకారం అందించారు. అందుచేతనే మనదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్'షింజో అబేకు గత సంవత్సరం 2021లో ప్రదానం చేశారు.‌ ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధానంతరం జన్మించి, తన దేశాన్ని అన్ని రకాలుగా అవగాహన చేసుకొని, జపాన్ అభివృద్ధికి తన పదవీ కాలం, జీవితాన్ని అంకితం చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు.

అదే సమయంలో మన లాంటి దేశాలకు అనేక రకాలుగా తన పదవీ కాలంలో సహాయసహకారాలు అందించి, చేదోడువాదోడుగా ఉన్న షింజో అబే శుక్రవారం తన 67 సంవత్సరాల వయస్సులో అకస్మాత్తుగా కాల్పులలో మరణించుట మనకు, ప్రపంచ దేశాలకు, అంతకు మించి జపాన్ దేశానికి ప్రజలకు తీరనిలోటు అని తెలుపుట అతిశయోక్తి కాదు. ఆయన మరణవేదన నుంచి జపాన్ అతిత్వరలో బయటపడి ఆయన ఆశయాల సాధనలో ఈనాటి పాలకులు పయనిస్తారని ఆశించుటయే షింజో అబే కు మనం ఇచ్చే ఘన నివాళి.

ఐ.ప్రసాదరావు

99482 72919

Next Story