టెలి కమ్యూనికేషన్‌ ముఖ్యమైనప్పటికీ..

by Ravi |
టెలి కమ్యూనికేషన్‌ ముఖ్యమైనప్పటికీ..
X

ఈ బిజీ ప్రపంచంలో.. మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాల్లో ఒకటి కమ్యూనికేషన్‌. ప్రజలు దీని ద్వారా సులభంగా కనెక్ట్‌ అవుతున్నారు. ఈ రోజుల్లో టెలికామ్యూనికేషన్‌ వ్యవస్థ ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా సమయంలో, లాక్‌డౌన్‌ల సమయాలలో ప్రజలు తమ స్నేహితులతో, బంధువులతో ఎక్కువగా కనెక్ట్‌ అయ్యారు. ప్రస్తుతం కమ్యూనికేషన్‌ జీవితంలో భాగమయిపోయింది. అందుకు అనుగుణంగా భారతదేశం 6 లక్షలకు పైగా గ్రామాల్లో 4జీ, 2 లక్షల గ్రామ పంచాయతీలను ఆర్టికల్‌ ఫైబర్‌లో అనుసంధానించబడి డిజిటల్‌ చేరికను తీసుకువచ్చాయి. అలాగే 680 జిల్లాలకు పైగా 5జి సేవలను కలిగి ఉంది.

ఇది డిజిటల్‌ యుగం, టెలికమ్యూనికేషన్‌ పరిణామం లేకుండా జీవితం ఎలా ఉండేదో ఊహించుకోలేం. టెలికాం విప్లవం ఒక పేద దేశంలో ఒక విప్లవం, ఇది మనదేశ ఇమేజ్‌ను మార్చేసింది. ఈ విప్లవం దేశ ఆర్థిక శ్రేయస్సుకు, మానవుని సంక్షేమానికి ఎంతో దోహద పడింది. 2జి, 3జి, 4జి, 5జి టెక్నాలజీపై స్వారీ చేస్తున్న భారత్‌ వేగంగా దూసుకుపోతుంది. ఈ కమ్యూనికేషన్‌తోనే.. భారతదేశంలో ఈనాడు రైతులు హైటెక్‌ పరిజ్ఞానాన్ని పొందుతున్నారు. విద్యార్థులకు, యువకులకు సాంకేతిక పరిజ్ఞానం చేరువవుతుంది. కమ్యూనికేషన్‌కి ఇంతటి ప్రాముఖ్యం ఉండటం చేతనే.. ఐక్యరాజ్య సమితి మే 17ని ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం ధీమ్‌ ‘సస్ట్రేనబుల్‌ డెవలప్‌మెంట్‌ కోసం డిజిటల్‌ ఇన్నోవేషన్‌’ ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సొసైటీ డే 2024 రోజు ప్రధాన లక్ష్యం ప్రజల కనెక్షన్‌ యొక్క ప్రాముఖ్యతను సురక్షితంగా ప్రదర్శించడం సాంకేతిక ద్వారా సామాజిక సంక్షేమం పొందేలా ప్రజల్లో అవగాహన కల్పించడం.

2 - 4 గంటలు స్క్రీన్‌కి అతుక్కుపోయి..

అయితే, సాంకేతికత ఎంతో పెరిగినప్పటికీ.. ప్రజలలో సరైన క్రమశిక్షణ లేకపోవడం వలన కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. సైబర్‌ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.

ఈ టెక్నాలజీ మానవ జీవితాన్ని సౌకర్యవంతం చేస్తూనే.. కొంత హాని కలుగజేస్తుంది. బాల్య, కౌమార, యుక్త వయస్కుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందరో పిల్లలు స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కుపోవడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యూకే ప్రభుత్వం ఇంగ్లాండ్‌ అంతటా పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్‌ల వాడకం నిషేదించింది. రష్యా, స్వీడన్‌, ఫ్రాన్స్‌, నెధర్లాండ్స్‌, ఫిన్లాండ్‌, ఇజ్రాయిల్‌, గ్రీస్‌ మొదలైన దేశాలలో చరవాణులపై నిషేదాజ్ఞలను అమలు పరుస్తున్నారు.

మనదేశంలోని 12 ఏండ్ల లోపు పిల్లలు 42% శాతం వరకు ప్రతిరోజు 2 నుండి 4 గంటలు ఫోన్‌స్క్రీన్‌‌కే అతుక్కుపోతున్నారని ఇటీవల ‘హ్యాపీనెట్జ్‌’ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆ మధ్య లక్నోలో ‘పబ్జీ’ ఆడుకోనివ్వడం లేదన్న అక్కసుతో 16 ఏళ్ల కుర్రాడు, కన్నతల్లిని తుపాకీతో కాల్చి పారేశారు. ఇంటర్‌నెట్‌కు అలువాటు పడిన పిల్లలు గంటల తరబడి అంతర్జాల వీక్షణానికి బానిసలైపోయి, దుర్బల మనస్కులై నేరాల ఊబిలో దిగబడిపోతున్నారు. 10 ఏళ్ళ వయస్సులో స్మార్ట్‌ఫోన్స్‌కు అలవాటు పడ్డ అమ్మాయిల్లో సగం మంది యుక్తవయస్సుకు వచ్చేసరికి వివిధ మానసిక రుగ్మతల బారిన పడుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కుటుంబ, మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ ద్వారా జరిగే నేరాలను అరికట్టడానికి, సోషల్‌ మీడియాపై పోలీసుల నియంత్రణ ఉండాలి. మైనర్లకు రోజుకు రెండు గంటలకు స్మార్ట్‌ఫోన్‌ను పరిమితం చేయడం. ఆరోగ్యకరమైన వ్యాపకాలు, క్రీడల వైపు పిల్లల మనస్సు మళ్ళించడం. ఖాళీ సమయంలో పిల్లలను ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బదులుగా ఆరుబయట ఆడేలా, వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాబ్‌లకు అతుక్కుపోకుండా పుస్తక పఠనాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులపై మరియు ఉపాధ్యాయులపై ఎంతో ఉన్నది. బంగారు భవిష్యత్‌ను ఛిద్రం చేస్తున్న స్మార్ట్‌ఫోన్ల ఉచ్చులో చిక్కుకోవడం ఆత్మహత్య సదృశమని ప్రజలకు జనచేతన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేయాలి.

(నేడు ప్రపంచ టెలికమ్యూనికేషన్‌ దినోత్సవం)

- సి.వి.వి. ప్రసాద్‌

విశ్రాంత ప్రధానాచార్యులు

8019608475

Next Story