కోల్పోయిన వైభవం తిరిగొచ్చేనా?

by Disha edit |
కోల్పోయిన వైభవం తిరిగొచ్చేనా?
X

స్వరాష్ట్రం వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల బతుకులు బాగుపడతాయి అనుకుంటే వారి ఆశలు అడియాశలు అయ్యాయి. దీంతో ఎంతో మనోవేదనకు గురయ్యింది తెలంగాణ ఉపాధ్యాయ వర్గం. రాష్ట్ర ఆవిర్భావం అయి ఉద్యమ నేత ముఖ్యమంత్రి కాగానే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు తలుపులు మూసివేయబడ్డాయి. అణచివేత అధికమైపోయింది. ధర్నా చౌక్ తీసేసి ప్రజాస్వామ్య శాంతియుత నిరసనలకు అవకాశం లేకుండా చేశారు. ధర్నాలు, నిరసనలు అంటే అరెస్టుల పర్వం కొనసాగింది. మేధావులకు.. సంఘాలకు అపాయింట్మెంట్ లేదు. ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లు అన్ని ఎన్నికలతో ముడి పెట్టి ఉప ఎన్నికలో లేదా శాసన మండలి ఎన్నికలో వస్తేనే నెరవేరుస్తాం అన్న చందంగా సీట్లు, ఓట్లు అనే కొత్త సంస్కృతికి తెరలేపారు..

ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూనే..

మాజీ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఐదు శాతం ఐఆర్ సమస్త ఉపాధ్యాయ, ఉద్యోగ లోకాన్ని తీవ్ర ఆశ్చర్యం నిరాశ నిస్పృహలకు గురిచేసింది. ఇంత తక్కువ శాతం మధ్యంతర భృతి ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ఒకవైపు ధనిక రాష్ట్రం అంటూనే ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణలో తీవ్ర అన్యాయం చేశారు. పలుమార్లు వారే మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టే ఆ ప్రగతి సాధ్యమైందని, వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, దేశం ఆశ్చర్యపోయే విధంగా వేతన సవరణ చేస్తామని ప్రకటించారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. పైకి ఉద్యోగ ఫ్రెండ్లీ అని చెబుతూనే లోపల ఎనిమీ లాగా వ్యవహరించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 శాతం వేతనాలు పెంచాం అని ప్రకటించుకున్న వారు తెలుసుకోవాల్సిందేందంటే అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 39 శాతం ఫిట్మెంట్ నిర్థారించింది. ఆ వేతన సవరణే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేశారు. అప్పుడు ఉన్న సుమారు రెండు సంవత్సరాల బకాయిలు ఎగ్గొట్టారు. ఫలితంగా ఇచ్చిన 43% నికరంగా చూసుకుంటే 27 శాతమే అవుతుంది. కానీ దేశంలోనే అధిక వేతనాలు ఇస్తున్నామని గత పదేళ్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఇచ్చిన ఐ.ఆర్‌కు అదనంగా నాలుగు శాతం కలిపి 43% ఫిట్‌మెంట్ ప్రకటించి 18 నెలల బకాయిలు విడతల వారీగా చెల్లించి నూతన సంస్కృతికి తెరలేపారు.

ఆ తర్వాత 2018లో రాష్ట్రంలో వేసిన వేతన సవరణ కమిటీ మూడు సంవత్సరాలు కాలయాపన చేసి మధ్యంతర భృతి లేకుండా, మూడేళ్ల బకాయిలు ఇవ్వకుండా సంఘాలతో సరైన చర్చలు జరపకుండా 30% ఫిట్మెంట్ ప్రకటించింది. ఇది పేరుకి 30 శాతం ఇచ్చినప్పటికి 3 సంవత్సరాల బకాయిలు ఇవ్వకపోయేసరికి అది కూడా నికరంగా 15 శాతానికి మాత్రమే సమానం అవుతుంది. ఒక సంవత్సరం బకాయిలు పదవీ విరమణ అనంతరం లేదా ఉద్యోగి చనిపోయినప్పుడు ఇస్తామనడం హాస్యాస్పదం. ఇది దేశంలో ఎక్కడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేతనాలు మొదటి తేదీనే జమ అయ్యేవి. మెడికల్ ఇతర రకాల బిల్స్ అన్నీ ఖజానా శాఖ నుండి బ్యాంకుకు వెళ్లిన రేజే జమ అయ్యేవి. కానీ గత ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు జమ అవుతాయో కూడా తెలియని పరిస్థితి. రాష్ట్రంలో వీరికి సంబంధించి ఏ బిల్లు అయినా కొద్దిరోజులు ఉమ్మడి జిల్లా మొత్తం, కొద్దిరోజుల తర్వాత నూతన జిల్లాల వారీగా, ఇప్పుడు ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ వారీగా జమవుతున్నాయి. ఒకే డిపార్టుమెంటులో వివిధ రోజుల్లో వేతనాలు జమ కావడం దేశంలో ఎక్కడా లేదు. అదేవిధంగా ఒకే జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగులకు వివిధ తేదీల్లో వేతనాలు జమ కావడం దేశంలో ఎక్కడా లేదు.

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని..

ఇక ఉపాధ్యాయుల సరెండర్ లీవ్, పార్ట్ ఫైనల్ పేమెంట్, జిపిఎఫ్ లోన్స్, పదవీ విరమణ బకాయిలు ఎప్పుడూ జమవుతాయో ఆ భగవంతుడికే తెలియాలి. అలాగే పెన్షనర్లకు పెన్షన్లు కూడా సకాలంలో జమకావడం లేదు. సకాలంలో వేతనాలు జమ కాక వ్యక్తిగత రుణాలు, ఇంటి రుణాలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏదైనా అనివార్య కారణాలవల్ల ఉపాధ్యాయులు సెలవు పెట్టుకున్నట్లయితే, దానికి సప్లమెంటరీ బిల్ అంటున్నారు. అది ఎప్పుడు పడుతుందో చెప్పడం ట్రెజరీ ఆఫీసర్ల వల్ల కూడా కావట్లేదు. వివిధ అవసరాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్మును తిరిగి తీసుకోవడానికి సంవత్సరం కాలం పైగా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొనడం దారుణం.

పదేళ్ళకాలంలో విద్యాశాఖ పైన ఒక్క సమీక్ష లేదు, సంఘాలతో సంప్రదింపులు లేనే లేవు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, సంఘాలకు కనీసం సమయం కేటాయించకుండా, చర్చలు జరపకుండా సంఘాలకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించకుండా ఎన్నో రకాల తీవ్ర వేధింపులకు గురి చేయడం జరిగింది. ప్రభుత్వానికి అవసరం అనుకున్నప్పుడే కొందరిని మాత్రమే పిలిపించుకొని ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటించి బలవంతంగా రుద్దడం మాత్రమే జరిగింది. అలాగే 8 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వర్గం పదోన్నతులు లేకుండా పదవీ విరమణ చెందారు. అలాగే బీఈడీ, డైట్ చేసిన ఎందరో నిరుద్యోగులు టీచర్ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ పదేళ్ల కాలంలో కేవలం ఒకే ఒక్క డీఎస్సీ నిర్వహించి దానిని మూడేళ్లపాటు భర్తీ చేశారు. ఇబ్బడి ముబ్బడిగా గురుకులాలను పెంచి, వాటిని అరకొర వసతుల మధ్య నడిపిస్తూ గ్రామాల్లో నెలకొన్న పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. కేవలం నాలుగు లక్షల మంది విద్యార్థులను చూపించి 20 లక్షలకు పైగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం విద్యను దూరం చేయడం జరిగింది.

స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలి..

ఉద్యోగ ఉపాధ్యాయుల మీద అసత్య ప్రచారాలను ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మార్పు కోరుకొని ప్రభావితం చేయడం జరిగింది. ఇకనైనా కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ ఆకాంక్షలు అర్థం చేసుకుని మొదటి వారంలో వేతనాలు జమ చేస్తూ అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. కరువు భత్యం ఎప్పటికప్పుడు ప్రకటించాలి. నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరించి సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపైన చర్చలు జరపాలి. అన్ని కార్పొరేట్ హాస్పిటల్‌లో అమలయ్యేలా నూతన ఆరోగ్య పాలసీ రూపొందించాలి. 317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగు నింపాలి. 317 జీవో సమీక్షించి దశలవారిగా ఉద్యోగ ఉపాధ్యాయులను స్థానిక జిల్లాలకు పంపిస్తూ చర్యలు చేపట్టేలా సంఘాలతో చర్చలు జరిపి ఉపశమనం కలిగించాలి. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పదోన్నతులు బదిలీలు నిర్వహించాలి. కోర్ట్‌లలో ఉన్న న్యాయపరమైన సమస్యలను అధిగమించే విధంగా చర్యలు తీసుకొని వ్యవస్థల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా కృషి చేయాలి. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్ రద్దు, ఆరు నెలల లోపు కొత్త పీఆర్సీ అమలు చేయాలి. సప్లిమెంటరీ బిల్లులు 15 రోజుల్లో క్లియర్ చేయాలి. కొత్త ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులతో స్నేహపూర్వక ప్రభుత్వం అని నిరూపించుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా సంఘాలను సంప్రదిస్తూ, సమయం ఇస్తూ దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తే ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం, మద్దతు ఇస్తూనే ఉంటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మంచి రోజులు వస్తాయని, మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని స్వర్ణయుగం ప్రారంభమవుతుందని ఈ ప్రభుత్వం మీద విశ్వాసంతో ఉన్నారు.

ఆళ్ల రాజేందర్

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం.

77023 24308

Next Story

Most Viewed