దేశానికి.. నోబెల్ అందని ద్రాక్షేనా?

by Disha edit |
దేశానికి.. నోబెల్ అందని ద్రాక్షేనా?
X

గత 93 ఏళ్లుగా నోబెల్ కోసం ఎదురుచూస్తున్న అఖండ భారతావనికి ఈ సారి కూడా నిరాశే ఎదురయ్యింది. 2023కి గాను ప్రకటించిన ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల్లో భారత్‌కు చోటు దక్కలేదు.142 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఎందుకు నోబెల్ బహుమతులు సాధించలేకపోతున్నారనేది అందరిని కలవరపెడుతున్న అంశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం. లోపం ఎక్కడుంది, దానిని ఎలా అధిగమించాలో ఆలోచించి ప్రణాళికలు రూపొందించాలి. ఎప్పుడో 1930లో భౌతిక శాస్త్రంలో సర్ సి.వి.రామన్ ఈ ఘనత సాధించారు. హరగోబింద్ ఖరోనా, చంద్రశేఖర్ వెంకట్ రామన్‌లు ఈ పురస్కారం పొందినప్పటికీ వీరు విదేశాల్లో స్థిరపడిన భారతీయులు.

ఎక్కడుంది లోపం

భారత్‌తో పోలిస్తే చిన్నచిన్న దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఇజ్రాయిల్ వంటి దేశాలు ఇప్పటికే భారత్ కన్నా అధిక సంఖ్యలో పురస్కారాలు సాధించాయి. ఆ దేశాలు పాఠశాల స్థాయి నుంచే ప్రయోగ విద్యకు ప్రాధాన్యతనిచ్చి విద్యార్ధుల్లోని నైపుణ్యాలకు సానబట్టి ఇతోధిక నిధులను కేటాయించడం వల్లనే ఆయా దేశాలు నోబెల్ పురస్కారాలు సాధిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. చదువు కేవలం మంచి ఉద్యోగం సంపాదించడానికో, ఐదంకెల సంపాదనకో కాదన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు మాత్రమే చదవాలని పిల్లల మీద ఒత్తిడి పెంచడం కూడా సరైన విధానం కాదు. పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి. వారికి సైన్స్ రంగంలో ఉన్న ఆసక్తిని ప్రోత్సహించాలి.

పరిశోధక రంగానికి అండదండలు అందివ్వని రాజకీయ నేతలపై ప్రముఖ శాస్త్రవేత్త సి.ఎస్.రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. సైన్సు పరిశోధనలకు నామమాత్రపు నిధులు కేటాయిస్తూ ఫలితాలు ఆశించడం సరైన విధానం కాదన్నారు. సైన్సు పరిశోధనలకు పెట్టిన పెట్టుబడులతో తక్షణ ఫలితాలు రాకపోవచ్చును కానీ దీర్ఘకాలికంగా నైనా అటువంటి పెట్టుబడులు దేశాభివృద్ధికి తోడ్పడతాయి. పరిశోధనలకు జీడీపీలో 3 శాతం నిధులు కేటాయించాలని 2003లోనే తీర్మానం చేసినా నేటికి మన దేశం చేసిన ఖర్చు ఒక శాతానికి మించపోవడం శోచనీయం. పరిశోధకులకు ప్రోత్సాహం కల్పించాలి. భారత్‌తో పోలిస్తే ఇతర చిన్నచిన్న దేశాలలో సగటున 8 వేలకు పైగా పరిశోధకులు ఉన్నారు. వారికి అయా దేశాలు కల్పిస్తున్న సౌకర్యాలు అక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రయోగశాలల స్థితి మొదలగు అంశాలు కూడా నోబెల్ పురస్కారాలు పొందుటకు అసలైన కారణంగా భావించవచ్చును.

నామమాత్రంగా సైన్స్ ఫెయిర్‌లు

విజ్ఞానశాస్త్రంలో నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించాలనే ఆశయంతో సైన్స్‌పై ఆసక్తిని పెంచి బాల్యం నుంచే సృజనాత్మకతను వెలికితీసే ప్రయోగాల వైపు ఆకర్షించేందుకు హైస్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టిన ‘ఇన్‌స్పైర్’, సైన్సు కాంగ్రెసు వంటి వినూత్న కార్యక్రమాలు కూడా నామమాత్రంగా కొనసాగుతున్నాయనడంలో సందేహమే లేదు. చాలా పాఠశాలలు ‘ఇన్‌స్పైర్’ నమోదుకు ఆసక్తి చూపడంలేదు. ముందు మనదేశంలో పరిశోధనలకు నిధులు కేటాయించడం పెంచాలి. ఈ విషయంలో భారత్ ప్రపంచం మొత్తంలో అట్టడుగు స్థానంలో ఉంది. జీడీపీలో పరిశోధనలకు అధిక నిధులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవో కొన్ని పాఠశాలలలో అటల్ ల్యాబ్‌ల పేరుతో సైన్స్‌కు పెద్దపీట వేస్తున్నా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే విధమైన సౌకర్యాలు కల్పించిననాడే మరోసారి భారత్ నోబెల్ బరిలో నిలబడగలదు.

-సుధాకర్.ఏ.వి.

అసోసియేట్ అధ్యక్షులు STUTS

90006 74747



Next Story

Most Viewed