ఎంగిలి పేరు వదిలించుకోలేమా?

by Disha edit |
ఎంగిలి పేరు వదిలించుకోలేమా?
X

ఆంగ్లేయులు పెట్టిన ఇండియా అన్న ఎంగిలి పేరు వదిలించుకొని భారత్ అన్న సాంస్కృతిక నామాన్ని 76 సంవత్సరాల తరవాత ఇప్పటికైనా మనం సాధించుకోవాలి. ప్రతీదీ రాజకీయ పరంగా చూసే జాఢ్యం మనది. కానీ దేశం పేరును భారత్ అని మార్చడంలో రాజకీయ కోణం చూడనవసరం లేదు. మార్చవలసిన అత్యవసరం వుంది. ఇదే విషయాన్ని నేను మన ప్రధాన మంత్రికి, 2022 జూన్‌లో ఇచ్చిన లీగల్ నోటీసులో రాజకీయ నేరస్తులను, లంచగొండి ప్రభుత్వ ఉద్యోగులను, వ్యాపార దోపిడీదారులను నియంత్రించి, అవినీతికి అవకాశం లేని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దేశానికి కావాలని, రాజ్యాంగ ధర్మబద్ధంగా ఎలా నిర్మించాలో చెబుతూ, అదే విషయంతో పాటు భారత్ అని దేశం పేరు ఎందుకు మార్చాలో వివరంగా చెప్పాను. ఎందుకంటే తెల్ల తోలు యూరోపియన్లు తాము ఆఫ్రికా నర వానర జాతులనుండి పుట్టామని తెలిసినా, తమ జాత్యహంకారాలు వదులుకోలేక తాము దురాక్రమించిన దేశాల ప్రజలందరిని ఇండియన్స్ గానే పిలిచేవాళ్ళు. నడమంత్రపు సిరులతో, తుపాకీ బలంతో, హిందూ ఉపఖండానికి చెందిన హిందువులకు, యూరోపియన్లు పెట్టిన ఎంగిలి పేరే ఇండియన్స్. అదే పేరు శతాబ్ధాలుగా స్థిరపడిపోయింది.

ప్రాచీన చరిత్రలో.. హిందుస్థాన్!

సింధు పరీవాహక ప్రాంతానికి చెందిన దేశంగా, సింధు అన్న పదంలో ‘ఎస్’ సైలెంట్ గా మిగిలిన అక్షరాలతో బహుశా అలాగే మనం ఇండియన్స్ గా మనకి మనమే అనుకోని సరిపెట్టుకొని “we are Indians” అని పాటలు పాడుకుంటున్నాం. యూరోపియన్లు తాము పాలించిన దేశాల్లోని స్థానిక ప్రజలందరిని పిలిచినట్టే ఇండియన్ అన్న సర్వనామంతో ఒక నిక్ నేమ్‌తో వ్యవహరిస్తారని తెలుసుకోలేకపోయాం.

నిజానికి అతి ప్రాచీన గ్రీకు నాగరికత కాలంలో ప్రముఖ చరిత్రకారుడు, భూ భౌగోళిక శాస్త్రవేత్త ‘హీరోదాటస్’ క్రీస్తు పూర్వం 5 శతాబ్దంలోనే, అంటే 2700 సంవత్సరాలకు పూర్వమే, ప్రాచీన నాగరికతలతో వెలిగిపోయిన భారతదేశాన్ని ‘The Land of Hindus’ గా అభివర్ణించాడు. ఇప్పటికీ మన అతి దగ్గర రక్త సంబంధిత దేశ ప్రజలైన పాకిస్తాన్ భారతీయులు, బంగ్లాదేశ్ భారతీయులు వాళ్ళ వాళ్ళ మాతృభాషల్లో హిందూస్తాన్ గానే వ్యవహరిస్తున్నారు . చైనా మొదలైన ఆసియా ఖండ దేశాల ప్రాచీన చరిత్రల్లోనూ మన దేశాన్ని హిందూస్తాన్ గానే వ్యవహరిస్తూ వచ్చారు. అయినా మనం మాత్రం ‘ఇండియన్స్’ అన్నది ఎంగిలి పేరని, ‘నిక్ నేమ్’ అని తెలుసుకోలేక పోతున్నాం. ఇండియన్ అనేది మనకి యూరోపియన్లు తగిలించిన ఎంగిలి పేరు అని చెప్పడానికి కావలిసినంత సాక్ష్యాలు వాస్తవ ఆధారాలకి చరిత్ర పుటలు తెరిచి చూస్తే తెలుస్తుంది.

ఆ ఇండియన్స్ మనం కాదు!

యూరోపియన్ వలస వాదులు తాము ఆక్రమించి పాలించిన దేశాల్లోని స్థానిక ప్రజలందరిని ఇండియన్స్ గానే వ్యవహరిస్తూ వచ్చారు. అందుకే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల చరిత్ర పుటలు త్రవ్వి చూస్తే.... '1622 లో ఉత్తర అమెరికాలోని వర్జినీయాలో మూడోవంతు యూరోపియన్ వలస వాదులను, వూచకోత కోసిన ఇండియన్లు' అని రాసి ఉంది. అంటే... వాళ్ళు అక్కడి స్థానిక వర్జీనియా ఇండియన్లే గాని మనం కాదు. 1661లో ఉత్తర అమెరికాలోని ‘మసూసియేట్స్’ ప్రాంతంలో ఇండియన్స్‌కి యూరోపియన్లు చర్చ్ కట్టించి ఇచ్చారంటే.... అది అక్కడి ‘మసూసియేట్స్’ ఇండియన్స్ తప్ప మనం కాదు. 1728లో ‘నట్ చేద్’ ఇండియన్లు 300 వందల మంది ఫ్రెంచ్ సైనికులను, అమెరికా కాలనీ అయిన లూసియానాలో అతి కిరాతకంగా చంపేశారు అంటే.... యూరోపియన్లు పిలుచుకొనే అక్కడి లూసియానా ఇండియన్లు అనే కానీ మనం కాదు. 1740లో దక్షిణ అమెరికాలో ఇండియన్లు తమ బాణం పుల్లలకి విష-రసాయనాలు పూసి యుద్ధం చేసే వారు అంటే…. వాళ్ళు అమెజాన్ నది పరివాహక ప్రాంతానికి చెందిన ‘పురువీయన్’ ఇండియన్లు తప్ప మనం కాదు. 1745 లో ఉత్తర అమెరికాలో ఆంగ్ల వలసవాదులతో, ఫ్రెంచ్ వాళ్ళు ఇండియన్లతో కలిసి యుద్ధం చేశారు అంటే... వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లేయులు పిలుచుకొనే స్థానిక ఇండియన్లు తప్ప, హిందూ ఉపఖండంలో ఆంగ్లేయులు అంటరానివాళ్ళుగా, ఇండియన్లుగా పిలుచుకున్న మనం కాదు. 1809లో ఉత్తర అమెరికాలో ఆంగ్ల వలసవాదులను ‘మిస్సిసిపీ’ పశ్చిమ ప్రాంతానికి రాకుండా అడ్డుకున్న ఇండియన్లు అక్కడి స్థానిక ఇండియన్లు. 1854లో కెనడా రాజధానిగా వున్న ‘బైటౌన్’, స్థానిక ఇండియన్ పేరుమీద “ఒట్టావా” గా మార్చుకున్నారంటే, అది అక్కడి కెనడా స్థానిక ఇండియన్ పేరుగాని మనకి సంబంధం లేదు.

నిక్ నేమ్ 'ఇండియా' మనకొద్దు

అందుకే యూరోపియన్లు పెట్టిన నిక్ నేమ్ ఇండియా అన్న సర్వనామం మనం ఇప్పటికైనా వదిలించుకోవాలి. భారతదేశం అన్న మన దేశ సంస్కృతిని ప్రతిబింబించే నామవాచికమే ప్రపంచంలో ఏ భాషలోనైనా ప్రతిధ్వనించాలి. అప్పుడే యూరోపియన్లు పెట్టిన ఇండియన్ అన్న అనాగరిక నామం హిందూ మహా సముద్రంలో నిమజ్జనం అయిపోతుంది. 1950 జనవరి 26 నాడు మన రాజ్యాంగంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నది దేశం పేరు మార్చాక ఇకపై రిపబ్లిక్ ఆఫ్ భారత్‌గా మారిపోతుంది. మనం చెప్పుకుంటున్న అఖండ భారత దేశాన్ని పాలించిన భరతుడి పేరు మీద నిలుస్తుంది. ఆంగ్లంతో సహా ప్రపంచంలో అన్నీ భాషల్లోనూ ‘భారతీయ జనతా పార్టీ’ అని వ్యవహరిస్తున్నట్టుగానే, మన దేశంలోని మరో రెండు జాతీయ పార్టీలు ది ఆల్ భారత్ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ భారత్‌గా కమ్యూనిస్ట్ పార్టీలు వుంటే అవన్నీ, ఆ విధంగా భారత్ శబ్ధంతో పిలవబడతాయి. అందుకు ఇప్పటికైనా దేశం పేరు మార్పుపై పావులు కదిపిన బీజేపీకి, అన్నీ పార్టీలూ, ప్రజలందరూ సహకరించాలని... ఏ పార్టీకి చెందని నేను దేశ ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

వై.చంద్ర రావు,

విశాఖపట్నం

72078 78472

Next Story

Most Viewed