చావులు ఎవరివి, పదవులు ఎవరికి?

by Disha edit |
చావులు ఎవరివి, పదవులు ఎవరికి?
X

‘జైబోలో తెలంగాణా గళగర్జనల జడివాన, జైబోలో తెలంగాణా నిలువెల్లా గాయాల వీణా’ అని అంటాడు ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడైన అందెశ్రీ. ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు ఉన్నటువంటి స్థితికి అద్దం పడ్తుంది అనుకుందాం. కానీ తెలంగాణ వచ్చాక కూడా ఒరిగింది ఏమిటనే ప్రశ్న ఇక్కడ ప్రజల్లో ఉత్పన్నమైంది. గాయాలకు గురైన వర్గాల ప్రజలెవరు అనే ప్రశ్న మెదళ్ళలో ఉద్భవిస్తోంది.

ఈ రాష్ట్రంకోసం త్యాగాలు చేసినది బహుజన వర్గాల విద్యార్థులే కానీ, భోగాల పదవులు మాత్రం ఆధిపత్య కులాలపాలయ్యాయి.ఈ పదేళ్ళ తెలంగాణ రాష్ట్ర పాలన సమయంలోనే ఏపూరి సోమన్న అనే తెలంగాణ ప్రముఖ వాగ్గేయ కారుని నోట ‘ఎవని పాలైయిందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నడురో తెలంగాణ’ అనే మరొకపాట ఊపిరిపోసుకున్నది. ఇలాంటి ప్రభావంతోనే సంచలమైన రాజకీయ తీర్పుతో మరొక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం అప్పజెప్పిన సంగతి మనందరికీ తెల్సినదే.!

తెలంగాణ వచ్చినా అన్యాయమేనా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత ఈ పదేళ్ళకాలంలో నియంతృత్వ ధోరణిపైన అనేక పోరాటాలు జరిగాయి.మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన ఆనాటి విద్యార్ధి నాయకులైన బోయిల్ల విద్యాసాగర్, జర్నలిస్టు తెలంగాణ విఠల్, జి.వెంకటనారాయణ, మర్రి మార్క్స్, చారగొండ వెంకటేష్, చంద్రవంశం రామకృష్ణ, బండి రమేష్, సంగెం శంకర్, మానికేష్ నగర్ యాదయ్య, కుమ్మరిపోశయ్య, రాంబాబు, వరకుప్పల. శ్రీనివాస్ వంటి వారినే మలిదశ పోరాటానికి పునాదిరాళ్ళుగా అభివర్ణించుకుంటున్నాం. మరి తెలంగాణ వచ్చాక వీళ్ళకు ఒనగూరిన ప్రయోజనం ఏమిటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధకులుగా ఇప్పుడు వాళ్ళకున్న విలువలు ఏపాటివి అనేదే నేటి ప్రశ్న? పెద్ద చదువులకై యూనివర్సిటీ బాటను పట్టినోళ్ళు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు, పీడనకు గురౌతున్న తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భవిష్యత్తును ఫణంగా పెట్టి నెలల తరబడి జైలు జీవితం గడిపిన ఈ విద్యార్ధి నాయకులకు తెలంగాణ వచ్చాక ఈ పదేళ్ళలో జరిగిన న్యాయం ఎట్టిది? ఎలాంటి న్యాయం జరగకపోగా పూర్తిస్థాయిలో అన్యాయమే జరిగిందనేందుకు కొన్నిసంఘటనలను మననం చేసుకోవాలిప్పుడు.

బంగారు పాలనలోనే గుండె ఆగింది!

2002 డిసెంబర్ 28వ తారీఖున చెంచెల్ గూడలో జైలు జీవితం గడిపిన వారిలో గద్వాల ప్రాంతం నుండి రామకృష్ణ అనే యువకుడు తెలంగాణ రాష్ట్రాన్ని శ్వాసించినవాడు. తెలంగాణకై ఎన్నో నిర్బంధాలను, దాడులను సైతం ఎదుర్కొన్నవాడు. కానీ తెలంగాణ వచ్చాక హాస్టల్లో తన తల్లి ఒక వంటమనిషి పనిచేస్తూ అనారోగ్యం పాలైన సమయంలో ఆ ఉద్యోగానికి అర్జీ చేసుకున్నాడు. ఇలా అర్జీ పెట్టుకున్న ఇతనికి తప్ప, రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ఇరవై నాలుగు మందికి ఉద్యోగం ఇదే కోవలో లభించింది. ఈ అవమానానికి కుంగిపోయిన రామకృష్ణ ఉరిపోసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఇతని చావుకు కారకులు ఎవరు? ఇతని కుటుంబానికి దిక్కెవరు? ఉద్యమనేతగా, జాతిపితగా ఉద్దెర బాకాలు ఊదించుకుంటున్న వాళ్ళైనా లేదా వీరి మంది మార్బలమైనా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సివుంది. ఎందుకంటే ఈ ఉద్యమవీరుడు అసువులు బాసింది వీరి బంగారమనే భ్రమల పాలనలోనే.

అప్పుడు జైళ్లూ, ఇప్పుడు చావులూ..

మలిదశ ఉద్యమానికి పునాదిగా నిలబడిన వారి జీవితం ఒక్కొక్కరిది ఒక్కో విచార మజిలిగానే మిగిలిపోయింది. మరొక ఉద్యమనేతగా చురుకుగా పాల్గొన్న కుమ్మరి పోశయ్య రాంబాబు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉపిరితుత్తుల వ్యాధితో బాధపడ్తూ కేవలం వైద్యానికి సరిపడ డబ్బులేకనే ఇలా చావుకు గురయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో జైలుపాలైనోళ్ళు తెలంగాణ వచ్చాకనే అనామకమైన చావులకు గురయ్యారంటే లోపం ఎవరిది? చావులు ఒకరివైతే పదవుల భోగాలు మరొకరివిగానే ఈ పదేళ్ళకాలంలో మన చూసిన వింత. ఇలాంటి నియంతృత్వ పోకడకు యావత్ తెలంగాణ ఓట్లతో బుద్దిచెప్పినంక కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపిన వారికి కొన్ని సంక్షేమ రాయితీలను తెరమీదకు తీసుకవచ్చిన వైనాన్ని ఆహ్వనించదగినది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రొ.కొందండరామ్ గారితో ఆనాటి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదిరాళ్ళుగా మారిన విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే వీరికి న్యాయం జర్గాలనే డిమాండ్‌ను నొక్కిచెప్పాల్సిన అవసరం మనపైన ఎంతోవున్నది.

వీరికి చిన్న ఉద్యోగాలూ ఇవ్వలేరా?

2002లో, 2005లోను నెలల తరబడి చంచల్ గూడ జైల్లో కఠినమైన జీవితం గడిపిన పదమూడు మందిలో రామకృష్ణ బలవ్మరణం చెందగా, రాంబాబు విగతజీవైయ్యిండు. మిగతా పదకొండుమందిలో ఒకరిద్దరు చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. ఇలా ఉద్యోగులుగా ఉన్నవారికి వెంటనే 24 గంటల జీ.వోను వర్తింపజేసి యాగ్జలరీ ప్రమోషన్స్ ప్రకటించాల్సి వున్నది. మిగతా నాయకులకు కనీసం సముచితమైన నామిటెడ్ పదవులను కట్టబెట్టవల్సిన బాధ్యత కూడ ఈనాటి ప్రభుత్వంపై ఉంది. ఆనాడు వీరంతా జి.చిన్నారెడ్డి శిష్యరికంలో పనిచేయడం ఇవ్వాళ ఆయన ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ అవ్వడం హర్షించదగిన విషయం. అయితే ఇప్పుడు ప్రభుత్వం బాకీ పడింది ఉద్యమకారుల సంక్షేమమే.! కాబట్టి భారతదేశ స్వాంతంత్ర్యోద్యమ యోధులకు లభిస్తున్న రాయితీలకు తీసిపోని విధంగానే తెలంగాణకై 2002లోనే నెలల తరబడి జైలు జీవితం గడిపిన ఈ పదమూడుమందికి హైదరాబాద్ నగరంలో 500 గజాల ఇంటిస్థలాన్ని, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగాన్ని, రాష్ట్రం, దేశమంతటా ఫ్రీ రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. ఉద్యమకారులైన వీరికి ప్రతినెలా పించన్ కింద యాభైవేల రూపాయలను చెల్లించాలి. ఎందుకంటే ఈనాటి మన తెలంగాణ రాష్ట్ర అవతరణకు ఆనాటి వీరి త్యాగమే మూలం కాబట్టి.!

(ఫొటో : ఫ్రొఫెసర్ కోదండరాం గారితో ఆనాటి ఉద్యమనాయకులు కొందరు)

వరకుమార్ గుండెపంగు

99485 41711



Next Story

Most Viewed