దళితులు, గిరిజనుల సంక్షేమమేదీ?

by Disha edit |
దళితులు, గిరిజనుల సంక్షేమమేదీ?
X

2014 నుండి 2019 వరకు ఎస్సీ కార్వొరేషన్‌ రుణాల కోసం 5,33,800 మంది దరఖాస్తు చేసుకున్నారు. 4,17, 011 మంది రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. దళిత, గిరిజన యువతీ యువకులు స్వయంశక్తితో ఎదగడాన్ని సహించలేకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణాల మంజూరులో అలసత్వం ప్రదర్శిస్తున్నది. అనేక గిరిజన జిల్లాలలో సరైన వైద్య సౌకర్యాలు లేవు. మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలతో వందలాది మంది గిరిజనులు చనిపోతున్నరు. మారుమూల గూడాలకు సరైన రవాణా సౌకర్యాలు లేక ఆస్పత్రులకు పోవాలంటే ఇప్పటికీ 'డోలె' ను ఆశ్రయించాల్సిన దుస్థితి. కరెంటు సౌకర్యం లేదు. తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడవాలే. లేకపోతే చెలమలలో ఊరే నీటినే తాగాలే. దీంతో గిరిజనులు రోగాల బారిన పడుతున్నరు.

ప్రజా సంగ్రామ‌యాత్రలో న‌డిచిన ప్రతిదారిలో, క‌లిసిన ప్రతి ఊరిలో ద‌ళితులూ, గిరిజ‌నులూ కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసాల‌ను క‌థ‌లు క‌థ‌లుగా వినిపించిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న క‌ష్టాల‌ను చెప్పుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నరు. కేసీఆర్ త‌నకు మాత్రమే సాధ్యమైన క‌ట్టుక‌థ‌లూ, పిట్ట క‌థ‌ల‌తో, హామీల‌తో అర‌చేతిలో వైకుంఠం చూపించిన్రు. అధికారం అనే ఒడ్డు చేరిన త‌ర్వాత వ‌రుస‌గా రెండుసార్లు తెప్ప త‌గిలేశిన్రు. ఆయ‌న ద‌ళితులు, గిరిజ‌నుల‌ను మోసం చేసిన తీరును ఎండగ‌ట్టాలంటే ఈ ఒక్క వ్యాసం స‌రిపోదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితుల అభివృద్ధిని పాలకులు ఉద్దేశ్యపూరితంగానే విస్మరించారని, దీంతో వారి మరీ అద్వానంగా తయారైందని టీఆర్‌ఎస్‌ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో వివరించింది. దళితులకు, గిరిజనులకు బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, వాళ్ల అభివృద్ధికి కృషి చేస్తమని 2014, 2018లో జరిగిన ఎన్నికలలో హామీలు గుప్పించిన్రు.

గడిచిన ఎనిమిది ఏండ్ల కాలంలో హామీలను గాలికొదిలి, దళితులను, గిరిజనులను టీఆర్‌ఎస్ నిలువునా మోసం చేసింది. తెలంగాణ కల సాకారం కాగానే దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతాడంటూ నమ్మబలికిన్రు. లేకపోతే త‌న మెడ‌ కోసుకుంటాన‌ని డాంభికాలు పలికిన్రు. కేసీఆర్‌ మాటలు నమ్మిన దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు 2014 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు అధికారాన్ని క‌ట్టబెట్టిన్రు. ఎన్నికల ఫలితాలు రాగానే కేసీఆర్‌ చుట్టూ ఉండే భజనపరులంతా కేసీఆర్‌ తెలంగాణకు ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం ఆగం ఆగం అయిత‌ద‌ని ప‌థ‌కం ప్రకారం కేసీఆర్‌ను గద్దెనెక్కించిన్రు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ భజన బృందం చేసిన ప్రచారం ముమ్మాటికీ యావత్‌ దళిత సమాజాన్ని అవమానించడమే. చివరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న దళితుడిని సైతం తొలగించి కేసీఆర్‌ తన అహంకారాన్ని, దళితులపై ఉన్న అక్కసును వెళ్లగక్కిన్రు.

నెరవేరని హామీలు

ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి మూడెకరాల సాగుభూమి ఇస్తామని, పంట ఖర్చులు భరించడంతోపాటు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని టీఆర్‌ఎస్ ప‌క్కన‌బెట్టింది. రాష్ట్రంలో తొమ్మిది లక్షల దళిత కుటుంబాలు ఉంటే, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న కుటుంబాలు ఆరు లక్షలు ఉన్నయ్. వీరితో 3.5 లక్షల కుటుంబాలకు సెంటుభూమి కూడా లేదు. 2014-15 లో తప్ప భూపంపిణీ కోసం బడ్జెట్‌లో పైసా విదల్చలేదు. దళితులకు, గిరిజనులకు ఎందుకు భూమి పంచ‌డం లేద‌ని నిల‌దీస్తే, ప్రభుత్వ భూములు లేవంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో వారి జిల్లా కార్యాలయానికి 100 కోట్ల విలువైన భూమిని కేటాయించింది. కార్పొరేట్‌ సంస్థలకు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఉదారంగా లక్షల ఎకరాల భూములు కేటాయిస్తోంది. ద‌ళితుల‌కు అనగానే భూమి లేద‌నే నాట‌కాన్ని తెర మీద‌కు తెస్తోంది.

గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూములను సైతం బలవంతంగా గుంజుకుంటున్నది. ఈ భూములలో ప్రభుత్వం వెంచర్లు వేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ప్రణాళిక‌లు ర‌చిస్తున్నది. తమ భూములు ఇవ్వబోమని రైతులు ఎదురు తిరిగితే అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నరు. పోడు చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు ఇస్తామని కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన్రు. తాను కుర్చీ వేసుకుని మరీ కూర్చుని సమస్య పరిష్కరిస్తాన‌ని ఆర్భాటం చేసిన్రు. పోడు భూములకు పట్టాలు ఇయ్యకపోగా ఫారెస్టు, రెవెన్యూ అధికారులను గిరిజనులపైకి ఎగదోసి ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నది. అక్రమకేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నది. తెలంగాణలోని 24 జిల్లాలలో 7 లక్షల ఎకరాలలో పోడు భూముల సమస్య ఉన్నది. హక్కు పత్రాలకోసం ప్రభుత్వానికి 2.5 లక్షల అప్లికేషన్లు వచ్చిన‌య్. గైడ్‌లైన్స్‌ రాకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ఫారెస్టు రైట్స్‌ కమిటీ (ఎఫ్‌‌ఆర్‌సీ) సిఫార్సుల ఆధారంగా పట్టాలివ్వకపోతే శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశం ఉంది.

నిధులు పక్కదారి

దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్చలు చేపట్టేందుకు, వారికి చేయూతనిచ్చి సమాజంలో సమాన అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ రూపొందించారు‌. దీనికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, అవి సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గడిచిన ఎనిమిదేండ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లుతున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుడ్లప్పగించి చూసింది. ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వమే ఎత్తులు వేసింది. సబ్‌ప్లాన్‌ చట్టాన్ని స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌గా పేరు మార్చడంతోనే ప్రభుత్వ కుట్ర బయటపడింది. పేరు మార్చి సబ్‌ప్లాన్‌ చట్టంలోని (సెక్షన్‌-3) 11 డి లో పేర్కొన్న మౌలిక వసతుల అభివృద్ధికి 7 శాతం నిధులు వాడుకోవచ్చు అన్న క్లాజును ఉపయోగించుకుని సబ్‌ప్లాన్‌ నిధులను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు దారి మళ్లించింది.

ఈ ఎనిమిదేండ్లలో దళితులకు, గిరిజనులకు కేటాయించిన 40 వేల కోట్ల నిధులు దారి మళ్లాయి. (సెక్షన్‌- 3) 11 డి ని తొలగించి సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గిరిజనులు జనాభా నిష్పత్తికి అనుగుణంగా తమకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నరు. ఆర్డినెన్స్‌ తీసుకురావడం ద్వారా ఈ డిమాండ్ తీర్చే అవకాశం ఉన్నా టీఆర్‌ఎస్‌ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. దీంతో గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలలో తీవ్ర నష్టం జరుగుతున్నది. ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అసెంబ్లీ తీర్మానానికి మద్దతు ప్రకటించింది. 'తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి'' అన్నట్లు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన పని అయిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంది. పదులసార్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రి అసెంబ్లీ తీర్మానంపై కేంద్రంతో చర్చలు జరిపిన పాపాన పోలేదు. సమస్యను నాన్చడం ద్వారా రాజకీయ లబ్దిపొందాలన్న టీఆర్‌ఎస్‌ దురాశే ఇందుకు ప్రధాన కారణం.

వారి కలలు తీర్చేందుకు

2014 నుండి 2019 వరకు ఎస్సీ కార్వొరేషన్‌ రుణాల కోసం 5,33,800 మంది దరఖాస్తు చేసుకోగా, 4,17, 011 మంది రుణాల కోసం ఎదురుచూస్తున్నరు. దళిత, గిరిజన యువతీ యువకులు స్వయంశక్తితో ఎదగడాన్ని సహించలేకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణాల మంజూరులో అలసత్వం ప్రదర్శిస్తున్నది. అనేక గిరిజన జిల్లాలలో సరైన వైద్య సౌకర్యాలు లేవు. మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలతో వందలాది మంది గిరిజనులు చనిపోతున్నరు. మారుమూల గూడాలకు సరైన రవాణా సౌకర్యాలు లేక ఆస్పత్రులకు పోవాలంటే ఇప్పటికీ 'డోలె' ను ఆశ్రయించాల్సిన దుస్థితి. కరెంటు సౌకర్యం లేదు. తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడవాలే. లేకపోతే చెలమలలో ఊరే నీటినే తాగాలే. దీంతో గిరిజనులు రోగాల బారిన పడుతున్నరు. మిషన్‌ భగీరథ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ నాయ‌కులు గిరిజన ప్రాంతాలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని అసమర్థ పాలన చేస్తున్నరు.

రాజ్యాంగాన్నే మార్చేయాలంటూ అహంకారం ప్రదర్శించిన ముఖ్యమంత్రికి డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పట్ల కూడా కనీసం గౌరవం లేదు. ట్యాంక్‌బండ్‌ సమీపంలో 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించేందుకు, లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో 15 అంతస్తుల అంబేద్కర్‌ టవర్‌ నిర్మాణానికి 2016 ఏప్రిల్‌ 14న ముఖ్యమంత్రే స్వయంగా భూమిపూజ చేసిన్రు. నూతన సచివాలయం నిర్మాణ పనులను స్వయంగా సమీక్ష చేసే ముఖ్యమంత్రికి, పక్కనే ఉన్న అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించే తీరిక మాత్రం ఉండ‌దు. ఆగమేఘాల మీద రాజప్రసాదం లాంటి ప్రగతిభవన్‌‌ను నిర్మించుకున్న కేసీఆర్‌కు విగ్రహం, టవర్ గురించి పట్టింపు ఉండదు. ప్రగతి‌భవన్‌ దాటి బయటకు వచ్చి అంబేద్కర్‌ జయంతినాడు నివాళి అర్పించాలన్న సోయి ముఖ్యమంత్రికి ఉంటే కదా! దళితుల అభ్యున్నతి గురించి ఆలోచించేది. గార‌డీ మాట‌ల‌తో, ఝూటా హామీల‌తో ప‌రిపాల‌న సాగిస్తున్న దొర‌ గ‌డీల‌కు, నియంతృత్వ కుటుంబ పాల‌న‌కు బుద్ధి చెప్పే రోజులు ద‌గ్గర‌ప‌డ్డయ్. రాబోయే ప్రజాతీర్పు ఈ రాచ‌రిక పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడుత‌ది. పేద‌ల పార్టీ, బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ద‌ళితులు, గిరిజ‌నుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరుస్తాం. ద‌గాపడిన ద‌ళిత, గిరిజ‌న బిడ్డల బిడ్డల దు:ఖ్కాన్ని తీరుస్తాం. స‌క‌ల జ‌నులు క‌ల‌లు క‌న్న తెలంగాణ‌ను పున‌ర్ నిర్మిస్తాం.

బండి సంజయ్‌‌కుమార్‌

ఎంపీ, కరీంనగర్‌,

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు


Next Story