బాలల చిత్రాలు ఏవి?

by Ravi |
బాలల చిత్రాలు ఏవి?
X

ప్రణాళికాబద్ధంగా తీయగలిగితే బాలల చిత్రాలు నిర్మాతకు లాభాలనార్జించి పెడతాయి. ‘పెద్ద నటీనటుల కన్నా అద్భుతంగా ఒక్కొక్కసారి బాలనటులు సన్నివేశానికి తగిన విధంగా నటిస్తారు’ అనేవారు ప్రముఖ పౌరాణిక దర్శక దిగ్గజం కమలాకర కామేశ్వరరావు. ఆయన తీసిన ‘బాలభారతం’, ‘యశోద కృష్ణ’ వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బాలల చిత్రాలకు జాతీయ స్థాయి పురస్కారాలు వచ్చాయి. ‘పాపం పసివాడు’ వంటి చిత్రాలు ‘న భూతో..’ అనేటటువంటి రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టాయి. మరి నేడేందుకు బాలల చిత్రాలు రావడం లేదు? ‘బాల రామాయణం’, ‘అంజలి’, ‘అమృత’ ‘లిటిల్ సోల్జర్స్’ వంటి కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు వచ్చాయి. కానీ...ఆ చిత్రాల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం చేత నిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు.

బాపు, రమణలు ‘బాలరాజు కథ’ను తీశారు. ఆ తరువాత ‘బాలమిత్రుల కథ’ (గున్నమామిడి కొమ్మమీద అనే పాట) వచ్చింది. మంచి విజయాలు అందుకున్నాయి. అత్యధిక పారితోషికం తీసుకునే ‘బాలనటులు’ ఆనాటి చిత్ర సీమలో ఉండేవారు. మాస్టారు రాము, బేబీ రాణి, శ్రీదేవి వంటి వారు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రీదేవి, కమల్ హాసన్, నాగరాజు, రేఖ, నాగార్జున వంటి వారు బాల నటులుగా చిత్రరంగంలో ప్రవేశించి తర్వాత కాలంలో గొప్ప నటులుగా కీర్తిని పొందారు. ఇది చరిత్ర.

ఇప్పుడు బాలల చిత్రాలు గురించిన చర్చ వెనుక ఒక విశేషం ఉంది. ఈ మధ్యకాలంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లిల్లీ’ అనే పాన్ ఇండియా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘సిసింద్రీ’ పంపిణీ తరువాత ఈ చిత్రం పైన కూడా నాకు ఇష్టమేర్పడిందని ఆయన అన్నారు. బాలల చిత్రాలు నిర్మాణం చేయాలని ఆ ప్రెస్ మీట్‌లో దర్శకుడు శివం అనటం గమనించదగ్గది. గోపురం స్టూడియోస్ పతాకంపై కె. బాబు రెడ్డి, జి. సతీష్ కుమార్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘నేహ’ ప్రధాన పాత్ర గల ఈ బాలల చిత్రం తర్వాత మరిన్ని బాలల చిత్రాలు రావాలనేది ఈ సమీక్ష ఆంతర్యం.

బాలల సినిమాలు..

బాలల చిత్రాలు ప్రారంభానికి ఆరున్నర దశాబ్దాలు చరిత్ర ఉంది. 1958లో పూర్తి రంగులతో లలితా శివజ్యోతి వారు ‘లవకుశ’ను ప్రారంభించారు. కానీ సుదీర్ఘమైన అవాంతరాల నడుమ 1963లో విడుదలై చరిత్ర సృష్టించింది. ఇందులో లవకుశలుగా మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం నటించారు. ఈ చిత్రం ఓ చరిత్రగా మిగిలింది. దీని తర్వాత 1966లో ‘లేత మనసులు’ను ఏవీఎం వారు తీశారు. బేబీ పద్మిని చేసిన ద్విపాత్రాభినయం అద్భుతం. ‘పిల్లలు దేవుడు చల్లనివారే’, ‘కోడి ఒక కోనలో’ అంటూ పద్మిని నటించిన పాటలు ఆనాడే కాదు, ఈనాడూ ఆనందింపజేస్తాయి. 1968లో స్టంట్ మాస్టర్ సాంబశివరావు కుమార్తె బేబీ రాణి ‘పాపకోసం’ లో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ ‘బాలనటి’ పురస్కారం పొందింది. 1967లో ఏవీఎం రంగుల్లో చిత్రించిన చిత్రం ‘భక్త ప్రహ్లాద’. రోజారమణి ప్రహ్లాదుడిగా నటించారు. ఎస్.వి.రంగారావు, అంజలీదేవి వంటి దిగ్గజాల సరసన మెడలో పామును ధరించి ధైర్యంగా ఆమె నటించిన తీరుకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. సుశీల పద్యాలకు, పోతన భాషకు ఆ చిన్న పాప పలికించిన భావాలు మరపురానివి. 1970లో మాస్టర్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో బాపు దర్శకత్వంలో ‘బాలరాజు కథ’ నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. ప్రభాకర్ నటన, మహదేవన్ సంగీతం, ఆరుద్ర రచించిన ‘మహాబలిపురం..’ అనేటటువంటి పాటలు ‘బాలరాజు కథ’ను నిలబెట్టేసాయి.

1973లో మాస్టర్ దేవానంద్, మాస్టర్ సురేంద్ర ప్రధాన పాత్రలుగా జగ్గయ్య, నాగభూషణం, రాజబాబు వంటి వారితో ‘బాలమిత్రుల కథ’ విడుదలైంది. ‘గున్నమామిడి కొమ్మమీద’ అనే గీతం నేటికీ అజరామరం. 1972 లో వీనస్.మహిజ వారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ‘బాలభారతం’ చిత్రం నిర్మించారు. గుమ్మడి, ఎస్. వి. ఆర్, అంజలి, కాంతారావు, హరినాథ్ వంటి ఉద్దండులైన నటుల మధ్య ‘బాలలు’ అద్భుతంగా నటించి చిత్రాన్ని ‘ఓ చరిత్ర’గా మిగిల్చారు. ‘నారాయణ నీ లీల నవరసభరితం’, ‘మానవుడే మహనీయుడు’ వంటి పాటలు నేటికీ స్ఫూర్తి మంత్రాలు గానే వినిపిస్తాయి. ‘బాలభారతం’ తర్వాత సేమ్ యూనిట్‌తో తయారైన చిత్రం ‘యశోదకృష్ణ’. 1975లో విడుదలైంది. కానీ.. నిర్మాతలకు నిరాశను మిగిల్చింది. ఈ సినిమాలో బాలకృష్ణుడుగా బేబీ డాలి, బేబీ రోహిణి, బేబీ శ్రీదేవిలు నటించారు. ఆ తర్వాత కాలంలో వీరంతా మంచి నటులుగా ఎన్నో చిత్రాలు నటించారు. ముఖ్యంగా శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

మూడు దశాబ్దాల్లో వచ్చినవి అరకొరే!

‘బడిపంతులు’ చిత్రంలో ఎన్టీఆర్ మనవరాలుగా శ్రీదేవి చేసిన అల్లరి, ‘బూచాడమ్మా బూచాడు’ అనే పాటకు ఆమె అభినయం మరువలేనివి. తర్వాత కాలంలో ‘వేటగాడు’లో ఎన్టీఆర్ జోడిగా ఆమె చేసిన ‘నయగారాలు’ మరుపుకురానివే..! అసలు పెద్దవాళ్లే లేకుండా తీసిన సినిమాలుగా ‘భక్త ధ్రువ మార్కండేయ’(1982), ‘బాల రామాయణం’ (1996), ‘బాలానందం’(1954), ‘పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం’ (1960), జూ.ఎన్టీఆర్ నటించిన ‘బాల రామాయణం’ను దర్శకుడు గుణశేఖర్ నిజంగా దృశ్య కావ్యంగానే మలిచారు. సీతగా నటించిన ‘స్మితా మాధవ్’ సీతగా చక్కని అభినయంను ప్రదర్శించింది. 1972లో మాస్టర్ రాము ప్రధాన పాత్రలో సి. రామచంద్రరావు దర్శకత్వంలో విడుదలైన ‘పాపం పసివాడు’ చరిత్ర సృష్టించింది. థార్ ఎడారి లాంటి ప్రాంతంలో చిత్రించిన ఈ చిత్రంలో ‘అమ్మ చూడాలి.. నిన్ను నాన్నని చూడాలి..’ అనే సుశీల గీతం, ‘అయ్యో పాపం పసివాడు’ అనే ఘంటశాల ఆర్ద్ర గీతం ఆనాటి ప్రేక్షకులను మైమరిపింపచేసాయి.

బాలల చిత్రాలు కాకపోయినా ‘బాలలు’ ప్రధాన పాత్రలుగా కలిగిన సినిమాలలో 1954లో బి.ఏ.ఎస్ వారు తీసిన ‘రాజు-పేద’ (ఈ చిత్ర సమీక్ష ఇదే పేజీలో వచ్చింది) చిత్రంలో మాస్టర్ సుధాకర్ ద్విపాత్రాభినయం చేసి అబ్బురపరిచాడు. రేలంగి, ఎన్టీఆర్ వంటి నటులు ఇందులో నటించారు. సుధాకర్ నటనే ఈ చిత్రానికి హైలెట్ అని ఆనాటి విమర్శకులు చెప్పుకున్నారు. ‘రాము’, ‘మూగనోము’, ‘శ్రీ కృష్ణావతారం’, ‘తల్లా పెళ్లామా’ వంటి చిత్రాల జాబితా కూడా పెద్దదే... విజయనిర్మల, శ్రీదేవి, రేఖ, రోజా రమణి, బాలనటులుగా వచ్చి ప్రసిద్ధ నటీమణులుగా ఎదిగారు. ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే జయసుధ తల్లి ‘జోగాబాయి’ ‘బాలానందం’ శీర్షిక కింద తీసిన ‘బూరెల మూకుడు’, ‘రాజయోగం’, ‘కొంటె కృష్ణయ్య’ అనే గంట నిడివి చిత్రాలలో నటించారు. బేబీ జోగాబాయిగా ఆమె ఆనాడు సుపరిచితులు. నాటి ప్రముఖ హాస్యనటుడు రేలంగి కొడుకు రేలంగి సత్యనారాయణ కూడా ఈ చిత్రాల్లో నటించడం విశేషం. లతా మంగేష్కర్ తొలిసారిగా పాడిన ‘నిద్రపోరా తమ్ముడా’ అనే పాటకు గొప్పగా హావభావ ప్రకటన చేసినది ‘తుర్లపాటి విజయలక్ష్మి’ ఈమె సహితం తరువాత చాలా సినిమాల్లో నటించారు. బాలల చిత్రాలు, బాలలు గొప్పగా నటించిన చిత్రాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవ ప్రస్థానంలో తమకంటూ ఓ మైలురాయిని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఒకటి, అర తప్ప గొప్ప బాలల చిత్రాలు రాలేదు. ‘లిల్లీ’ మరల ఆ దిశగా దర్శక నిర్మాతలకు ప్రేరణ ఇస్తుందేమో చూడాలి.

-భమిడిపాటి గౌరీశంకర్

94928 58395Next Story

Most Viewed