ఉద్యోగ పర్వం: రాష్ట్ర ప్రభుత్వం డీఏలు ఇవ్వదా!?

by Disha edit |
ఉద్యోగ పర్వం: రాష్ట్ర ప్రభుత్వం డీఏలు ఇవ్వదా!?
X

కరువు భత్యం ప్రకటించడం ప్రభుత్వాల దయగా కాకుండా, ఉద్యోగుల హక్కుగా ఉండాలి. పెరిగే ధరల కారణంగా నెల జీతాలపై ఆధారపడి ఉద్యోగవర్గాలకు కరువు భత్యాన్ని సకాలంలో ప్రకటించడమే ఏకైక మార్గం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కేంద్రం డీఏ ప్రకటించిన నెలలోపు కరువు భత్యం మంజూరు చేసే విధంగా ఒక విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. 'అడగంది అమ్మైనా అన్నం పెట్టదు కదా!' కరువు భత్యం మంజూరుకు ప్రభుత్వానికి ఉమ్మడిగా ప్రాతినిధ్యం చేసి, ఒత్తిడి తేవాల్సిన ఉద్యోగ సంఘాలు ఆ పని మాత్రం చేయడం లేదు. కొత్త సంవత్సరం, రాష్ట్రావతరణ దినోత్సవం, దసరా, దీపావళి కానుకగా సీఎం డీఏలు మంజూరు చేస్తారంటూ ఎప్పటికప్పుడు ఎదురుచూడటమే తప్ప, గట్టి ప్రయత్నమేదీ చేయడం లేదు.

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల సెగ నుంచి వేతన జీవులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను ఆదుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ధరల సెగను తట్టుకునేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరు మాసాలకు ఒకసారి కరువు భత్యం (డీఏ) ప్రకటిస్తారు. ఇది ఎంత శాతం ఇవ్వాలనేది పారిశ్రామిక వర్కర్ల వినియోగదారుల ధరల సూచి (సీపీఐఐడబ్ల్యూ) ప్రాతిపదికగా నిర్ధారిస్తారు. అయితే, మార్కెట్ వాస్తవ ధరలకు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వినియోగదారుల ధరల సూచికి సంబంధం ఎంత మేరకు ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇంచుమించు ఐదు నుంచి ఆరు శాతం వార్షిక పెరుగుదల రేటుతో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని కేంద్రం ప్రకటిస్తుంటే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగవర్గాలను చుక్కలనంటుతున్న ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మిగతా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీస్తోంది.ఈ పరిస్థితులలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను ఆదుకునేది కరువు భత్యం మాత్రమే. కేంద్రం తన ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదిలో రెండుసార్లు నిర్దిష్ట సమయాలలో డీఏ ప్రకటిస్తోంది.

జనవరి ఒకటిన సీపీఐఐడబ్ల్యూ ప్రాతిపదికగా డీఏను నిర్ధారించి మార్చి నెలాఖరులోగా మొదటి విడత, జూలై ఒకటి ప్రాతిపదికగా సెప్టెంబర్ నెలాఖరులోగా రెండో విడతను కేంద్రం ప్రకటిస్తుంది. కొవిడ్ కారణంగా జనవరి 2020- జూలై 2021 మధ్యకాలం మినహా గత మూడు దశాబ్దాలుగా డీఏ ప్రకటించడంలో కేంద్రం గడువును అతిక్రమించిన దాఖలాలు లేవు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ ఉద్యోగులకు వెంటవెంటనే కరువు భత్యం మంజూరు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం డీఏ మంజూరు చేయడం ఏలికల దయగా మారిపోయింది. డీఏ ఎప్పుడివ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక నిర్దిష్ట విధానాన్ని ప్రకటించలేదు. దసరా, దీపావళి ఇతర పండుగల సందర్భంగానైనా ప్రకటిస్తారేమోనని ఆశపడే పరిస్థితులు వచ్చాయి. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్న తీరు సగటు ఉద్యోగికి ఆవేదన కలిగించే రీతిలో ఉంటోంది. సంఘాలు కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రాకపోవడం ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. డీఏ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడడమేగానీ, శాశ్వత విధానాన్ని సాధించడం కోసం పకడ్బందీగా ప్రయత్నించిన దాఖలాలు లేవు.

మూడు డీఏలు పెండింగ్

జనవరి 2020 , జూలై 2020, జనవరి 2021 నుంచి చెల్లించాల్సిన మూడు విడతల కరువు భత్యం మొత్తం 10.01 శాతాన్ని ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇదే చివరిసారిగా మంజూరు చేసిన కరువు భత్యం. జూలై 2021 నుంచి 2.73 శాతం, జనవరి 2022 నుంచి 2.73 శాతం, జూలై 2022 నుంచి 3.64 శాతం మొత్తం 9.1 శాతం డీఏను మంజూరు చేయాల్సి ఉండగా, పెండింగులో పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు 17.29 శాతం కరువు భత్యం మాత్రమే చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించకముందే కొంత శాతం డీఏ మంజూరు చేసి, కేంద్రం ఇచ్చిన తర్వాత అవసరమైతే సర్దుబాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు 24 అక్టోబర్, 2020న పత్రికలలో వార్తలు ప్రముఖంగా వచ్చాయి. ఆ తర్వాత ఆఊసే లేదు.

కేంద్రం కంటే ముందుగా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, కేంద్రం మంజూరు చేసి నెలలు గడుస్తున్నా మూడు డీఏలు పెండింగులో పెట్టడం పట్ల ఉద్యోగవర్గాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. పైగా, గత కొన్ని నెలలుగా దేశం మొత్తం మీద అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలోనే నమోదు అవుతోంది. దీంతో నిత్యావసరాలు సహా అన్ని వస్తుసేవల ధరలు రాష్ట్రంలో రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎంతో ఎక్కువ. ఆగష్టు 2022లో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 6.79 శాతం కాగా, కేరళలో 4.8 శాతం, తమిళనాడులో 5.01 శాతం, కర్ణాటకలో 5.84 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 6.9 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం ఏకంగా 8.32 శాతంగా ఉంది. కేరళతో కంపేర్ చేస్తే, రాష్ట్రంలో దాదాపు రెట్టింపు ద్రవ్యోల్బణం నమోదు అవుతోందంటే, ధరల పెరుగుదల రేటు కూడా రెట్టింపు ఉంటోందన్నమాట.

సీఎం స్పందించాలి!

కరువు భత్యం ప్రకటించడం ప్రభుత్వాల దయగా కాకుండా, ఉద్యోగుల హక్కుగా ఉండాలి. పెరిగే ధరల కారణంగా నెల జీతాలపై ఆధారపడి ఉద్యోగవర్గాలకు కరువు భత్యాన్ని సకాలంలో ప్రకటించడమే ఏకైక మార్గం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కేంద్రం డీఏ ప్రకటించిన నెలలోపు కరువు భత్యం మంజూరు చేసే విధంగా ఒక విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి.

'అడగంది అమ్మైనా అన్నం పెట్టదు కదా!' కరువు భత్యం మంజూరుకు ప్రభుత్వానికి ఉమ్మడిగా ప్రాతినిధ్యం చేసి, ఒత్తిడి తేవాల్సిన ఉద్యోగ సంఘాలు ఆ పని మాత్రం చేయడం లేదు. కొత్త సంవత్సరం, రాష్ట్రావతరణ దినోత్సవం, దసరా, దీపావళి కానుకగా సీఎం డీఏలు మంజూరు చేస్తారంటూ ఎప్పటికప్పుడు ఎదురుచూడటమే తప్ప, గట్టి ప్రయత్నమేదీ చేయడం లేదు. కనీసం ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు స్పందించాలి. ఉద్యోగుల పక్షాన నిలబడాలి. కలసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. సీఎం వెంటనే సానుకూలంగా స్పందించాలి. జూలై 2021 నుంచి జూలై 2022 వరకు పెండింగులో ఉన్న మూడు డీఏ వాయిదాలు వెంటనే ప్రకటించాలి.


మానేటి ప్రతాపరెడ్డి

టీ‌ఆర్‌టీ‌ఎఫ్ గౌరవాధ్యక్షుడు

98484 81028

Read Disha E-paper

Next Story

Most Viewed