రజాకార్ ఫైల్స్ లక్ష్యం ఏమిటి?

by Disha edit |
రజాకార్ ఫైల్స్ లక్ష్యం ఏమిటి?
X

"చరిత్రను విస్మరించేవారు చరిత్రను నిర్మించలేరని" డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. చరిత్రను విస్మరించటమే కాదు, వక్రీకరించడం, చరిత్ర చెరిపివేయాలని చూడటం కూడా దుర్మార్గపు చర్య అవుతుంది. ఇలాంటి దుర్మార్గపు చర్యకు రజాకార్ ఫైల్స్ సినిమా మేకర్స్ పూనుకున్నారు. ఇది అసత్యాలను చెప్పి చరిత్రను వక్రీకరించింది. బ్రిటిష్‌కి వ్యతిరేకంగా రాంజీగోండు నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు (1836-60)ను, మత మార్పిడీలకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించారు. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండును నిజాం పోరాటంలో చేర్చారు.

ప్రపంచ చరిత్రలోనే అరుదైన పోరాటంగా పేరొందిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేవలం ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు పోరాడారని, రెండు మతాల మధ్య జరిగిన పోరాటంగా ముస్లీం పీడన నుండి హిందూ ప్రజలు తమ మతం కోసం చేసిన పోరాటంగా చిత్రీకరించారు." ఈ సినిమాలో ఈ డైలాగ్స్ చేర్చి హైదరాబాద్ సంస్థానంలో 88% హిందూ ప్రజలే. వారు పాకిస్తాన్‌లో కలవకూడదు. అఖండ భారత్ ఇప్పటికే రెండు ముక్కలైంది. హైద్రాబాద్ భారత్‌కు నడ్డిబోడు లాంటిది. నేను దానిని వదలను" అనే డైలాగ్‌లతో అసత్యాలను చేర్చి సినిమాను చూపారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ను హీరో చేసి కథంతా ఆయన చూట్టునే తిప్పారు. భారత్ సైన్యాలే రజాకార్లను మట్టుబెట్టి ఈప్రాంతం ప్రజలను నిజాం, రజాకార్ల పీడన నుండి విముక్తి చేశాయనే అభూత కల్పనలు, వక్రీకరణలు ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

బందూక్ పట్టింది మత రక్షణకా?

ఈ సినిమాలో చూపించిన నిజాం వ్యతిరేక పోరాటం అంతా కేవలం హిందువులు అయినందున మీరు మతం మారాలని, మతం మారితే రజాకార్లు కావచ్చునని హిందువులుగా ఉండి బానిసలైతారో లేక మతం మారి మాలిక్‌లు అవుతారో తేల్చుకోండి అని చెబుతూ ఈ పోరాటం అంతా కేవలం మతమార్పిడీల కోసం మాత్రమే జరిగిందనే కోణం తెచ్చి ఇదే అసలైన చరిత్ర అంటూ లేని చరిత్రను ప్రచారం చేస్తున్నారు. ప్రజలు బందూకు పట్టింది కేవలం తమ మతాన్ని రక్షించుకోవడానికి అన్నట్లు చిత్రీకరించి వక్రీకరణలు చేశారు. అసలైన చరిత్ర అయిన మాతృ భాష కోసం, భూమి కోసం, భుక్తి కోసం, మట్టిమనుషులు చేసిన తిరుగుబాటు "బాంచన్ దోర నీ కాల్మొక్త" అన్న వెట్టి మనిషి" దొర ఏందిరో నీ దొర తనం ఎంటిరో" అంటూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన బందూకు పట్టిన విషయాన్ని మరుగున పెట్టారు. అసలు ఈ సినిమా మొత్తం ఎక్కడ కూడా కమ్యూనిస్టు నాయకులు గానీ, ఆంధ్రమహాసభ నాయకత్వాన జరిగిన పోరాటాలను గానీ చూపించే ప్రయత్నం లేదు.

దేశభక్తి అంటే ఇదేనా?

నిజాం వ్యతిరేక పోరాటం అంటే మతాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించడానికి గ్రామాల్లో ప్రజలు తిరుగుబాటు చేశారనే అబద్ధాలు చెప్పారు. కావాలనే ఒక వర్గం పట్ల వ్యతిరేక నినాదాలు చేర్చి ఈ సినిమాలో చూపించారు. "మనుషులను చంపగలరు. కానీ మా మతాన్ని, హిందువులను చంపలేరు."అనే డైలాగులతోనే వివాదం చేస్తున్నారు. ఆనాడు ప్రజలు సాధారణంగా ఆంధ్ర మహాసభ జిందాబాద్ అన్నారు. కానీ కనీస ప్రస్తావన లేని ‘వైదిక మతం జిందాబాద్’ అనే నినాదాలు గ్రామాలలో ఇచ్చినట్లు ఈ సినిమాలో చూపించారు. మత కోణంలోనే ఈ పోరాటం జరిగితే విస్నూర్ రాంచంద్ర రెడ్డి గుండాలు చంపిన షేక్ బందగీ, రజాకార్లు చంపిన ముస్లిం జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ ఎవరో చెబుతారా? గ్రామాల్లో ఆరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రజాకార్ల సైన్యానికి అధ్యక్షుడు ఖాసిం రజ్వీ అయితే, ఉపాధ్యక్షుడు విస్నూరు రామచంద్రారెడ్డి అనేది తెలియదా? ప్రజలపై దాడులు చేయించిన, ప్రజలను పీడించిన రజాకార్లకు విడిది ఈ దొరల గడీలే అన్న సంగతి తెలియదా? అన్నదమ్ములాగ కలసి అన్ని మతాల, కులాల వారు చేసిన వీరోచిత పోరాటానికి మతం రంగు పులిమే ఎవరైనా దేశ భక్తులు ఎలా అవుతారు.?

త్యాగాల చరిత్రను వక్రీకరించొద్దు!

అశేష త్యాగాలు చేసిన కమ్యూనిస్టుల త్యాగాల గురించి ఈ సినిమాలో ఎక్కడా కనిపించవు. కమ్యూనిస్టుల నాయకత్వంలోనే ప్రజలు గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోని పోలీసు, రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. గెరిల్లా దళాలు ఏర్పాటు చేసి బందూకు శిక్షణ నేర్పింది కమ్యూనిస్టులే. ఈ దెబ్బతో దొరలు గ్రామాల నుండి పారిపోయారు. కమ్యూనిస్టులు భూసంస్కరణలు అమలు జరిపి 12 లక్షల ఎకరాల భూమి పంచారు. వెట్టిచాకిరి, బానిస విధానం రద్దైంది. రుణాలు, రుణ పత్రాలు, అప్పులు, వడ్డీలు రద్దయ్యాయి. స్త్రీలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి. అంటరానితనం పోయి, కుల, మత వివక్షత లేకుండా కలిసికట్టుగా దొరలపై పోరాటం చేశారు. కమ్యూనిస్టు పోరాటం వలన గ్రామాల్లో పీడన, బానిసత్వం నుండి విముక్తి పోందారు."దున్నేవాడికే భూమి" అనే నినాదం ఇచ్చారు. దోపిడీకి వ్యతిరేకంగా భూస్వాములపై ఎర్రజెండా నీడలో పోరాడారు. గడీలు బద్దలు కొట్టి ప్రజలంతా కుల, మతాలకతీతంగా నిజాంపై పోరాడారు. ఈ మట్టి మనుషుల త్యాగాల చరిత్ర వక్రీకరించడం, కేవలం మతకోణంలో ఈ పోరాటాన్ని చూపడం దుర్మాగపు చర్య. పీడనకు వ్యతిరేకంగా పీడితులు చేసిన గొప్ప పోరాటం నేటి మన తరాలకు ఆదర్శం. అసలైన చరిత్ర పేరుతో ఈ వక్రీకరణలను చేస్తున్న కుట్రలను తిప్పికొడదాం.

టి. నాగరాజు

ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

94900 98292

Next Story