ఉచితాలొద్దు...అభివృద్ధి కావాలి....!

by Disha edit |
ఉచితాలొద్దు...అభివృద్ధి కావాలి....!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పీపుల్స్‌ పల్స్‌ సంస్థ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ప్రజలు ఉచితం పేరెత్తితేనే మండిపడుతున్నారు. ఇంటింటికి పలు పథకాలతో డబ్బులు చేరుతున్నాయని చెబుతున్నారే కానీ, అందుకు పదింతలు నిత్యావసరాల ధరలు పెరిగాయని వారు ఆవేదన చెందుతున్నారు. మేము కష్టపడి పనిచేస్తాం, సోమరిపోతులను చేయకండి, మాకు ఉపాధి, అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏపీలో కంటిముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అభివృద్ధి లేమి పరిస్థితుల మధ్య ఉచిత పథకాలు, హామీలంటేనే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాలపై గొంతెత్తకుండా ఆంధ్రులకు అన్యాయం చేసిన రాజకీయ పార్టీలు ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రజలను మాయమాటలతో మభ్యపెడున్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలతో కాకుండా తాత్కాలిక ఉచిత హామీలు, పథకాలతో రాష్ట్రాభివృద్ధిని తిరోగమన దిశలో నడిపిస్తున్నారు ఏపీ రాజకీయ నాయకులు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై దృష్టి సారించకుండా అధికారంలోకి వస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నాయి పార్టీలు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రాష్ట్రాభివృద్ధి కంటే, గత రెండు పర్యాయాలు ఇచ్చినట్టే ఉచిత వాగ్ధానాలతోనే ముందుకొస్తుండంతో రాష్ట్ర ప్రజలు వీరి హామీలపై కొత్తేముందని పెదవి విరుస్తున్నారు.

ఉచితం అంటేనే మండిపడుతున్నారు

పీపుల్స్‌ పల్స్‌ సంస్థ బృందం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ప్రజలు ఉచితం పేరెత్తితేనే మండిపడుతున్నారు. ఇంటింటికి పలు పథకాలతో డబ్బులు చేరుతున్నాయని చెబుతున్నారే కానీ, అందుకు పదింతలు నిత్యావసరాల ధరలు పెరిగాయని వారు ఆవేదన చెందుతున్నారు. మేము కష్టపడి పనిచేస్తాం, సోమరిపోతులను చేయకండి, మాకు ఉపాధి, అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల గతుకుల రోడ్లతో నడ్డి విరుగుతుందని ప్రయాణికులు భయపడుతున్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో సాగునీరు అందక అన్నదాతలు కన్నీరు కారుస్తున్నారు. రాష్ట్రంలో కంటిముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అభివృద్ధి లేమి పరిస్థితుల మధ్య ఉచిత పథకాలు, హామీలంటేనే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

బతుకునివ్వని ‘రేవడీ’లు

ప్రధానంగా తాత్కాలిక ఉచితాలను ప్రజలు కోరుకోవడం లేదు. వారి జీవితాలు బాగుపడడానికి శాశ్వత పరిష్కారాలను ఆశిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే చాలని వేడుకుంటున్నారు. దీనికి భిన్నంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ-జనసేన కూటమి కూడా గతంలో వైఎస్‌ఆర్‌సీపీ చేసినట్టే ఆకర్షణీయమైన పథకాలనే ప్రకటిస్తోంది. ఉచితంగా ఇచ్చే ఈ డబ్బుతోనే మా జీవితాలు గడుస్తాయా? మాకు జీవనోపాధి కల్పిస్తే గౌరవంగా బతుకుతామంటున్నారు ప్రజలు. తెలంగాణలో ఇచ్చినట్టు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడానికి బదులుగా, చార్జీలు తగ్గించి, సౌకర్యాలు కల్పిస్తే ఇంటిల్లిపాది సుఖంగా ప్రయాణం చేస్తామంటున్నారు. ఉచిత గ్యాస్‌ కంటే సిలిండర్ల రేటు తగ్గిస్తే చాలంటున్నారు.

ఉచిత హామీల బాటలో వారూవీరూ...!

ఇప్పటికే ఉచితాల ప్రకటనలో వైఎస్‌ఆర్‌సీపీనే ఛాంపియన్‌గా నెంబర్‌ 1 స్థానంలో ఉంది. అయితే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా.. అంటే నిస్సందేహంగా లేరని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. జగన్‌ సర్కారుపై ప్రజల తీవ్ర అసంతృప్తిని గుర్తించిన టీడీపీ-జనసేన కూటమి దానికి భిన్నంగా ఆలోచించకుండా మరోసారి ఉచిత హామీలను ముందుకు తెస్తోంది. అటువంటి ఉచితాలు, వరాలను వీరు కూడా మళ్లీ ప్రకటిస్తుంటే జగన్‌ బదులు మీకెందుకు ఓటేయాలి.. అని ప్రజలు టీడీపీ-జనసేన కూటమిని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పబ్బం గడుపుకొని బిచ్చమేసినట్లు ఉచితాలతో ఏపీ రాష్ట్రాభివృద్ధిని దశాబ్దకాలం వెనకకు నెడుతున్నారని ప్రజలు రాజకీయ పార్టీలపై ఆగ్రహంగా ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాకుండా ప్రజల గురించి, రాబోయే తరాల గురించి ఆలోచించాలని, ఉచితాలతో రాష్ట్రాన్ని దివాళా తీయొద్దని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. గత రెండు పర్యాయాలు ఆకాశమే హద్దుగా రాజకీయ పార్టీలిస్తున్న హామీలతో విసుగెత్తిన రాష్ట్ర ప్రజలు ఇక ఉచితాలు వద్దు రాష్ట్రాభివృద్ధి కావాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.

జనసేన హామీ ఇచ్చినట్టు ‘ప్రతి చేతికి పని’ పథకానికున్న ప్రాధాన్యతను గుర్తిస్తే ఉపాధితో పాటు వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి పథంలో కొనసాగుతుంది. యువత వారి కాళ్ల మీద వారు నిలబడేలా వారికి ఆర్థిక సాయం అందిస్తూ చిన్న వ్యాపారులను ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి పొందే విధంగా చేస్తే ఎవరో వస్తారు..ఏదో చేస్తారు.. ఏదో ఇస్తారని ఎదురు చూడకుండా సొంతంగా సంపాదించుకుంటూ సుఖంగా ఉంటారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఈ చర్యలు తీసుకుంటే నిరుద్యోగ భృతి వంటి ఆర్థిక భారమైన వరాల అవసరాలే ఉండవు.

జనసేన చెప్పినట్టు ‘ప్రతి చేనుకు నీరు’ హామీని పరిశీలిస్తే సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చు. రాష్ట్రంలోని ప్రతి చేనుకు నీరు అందేలా చూస్తే రాష్ట్రం పచ్చదనంతో నిండి అన్నదాత సంతృప్తిగా ఉంటారు. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. జనసేన ఇచ్చిన ఇలాంటి హామీలను పూర్తి స్థాయిలో అమలుచేస్తే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను పస్తులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది రాష్ట్రం నుండి వెళ్లే వలసలను ఆపవచ్చు.

రాష్ట్ర విభజనతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని ప్రజలు బాధపడుతున్నారు. ఉచితాలతో అరచేతిలో స్వర్గం చూపిస్తూ రాజకీయ నేతలు మమ్మల్ని ఇంతకాలం మాయమాటలతో వంచించారు. మీరిచ్చే తాత్కాలిక ఉచితాలొద్దు, మేమూ చెమటోడుస్తాం, పరిశ్రమలు తీసుకురండి ఉపాధితో పాటు రాష్ట్రాభివృద్ధికి చేయి చేయి కలుపుదాం అని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలనూ గతంలోనూ, ప్రస్తుతం ప్రజలు తిరస్కరించారని అధికారం కోసం ఉచితాల పేరిట జిమ్మిక్కులు చేస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలి. దీని నుండి వారు గుణపాఠాలు నేర్చుకోకుండా, దీర్ఘకాలిక ప్రణాళికలతో కాకుండా తాత్కాలిక ఉపశమనాలతోనే ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్‌ మరోసారి రాజకీయ పార్టీల చేతిలో దగా పడడంతోపాటు భావి తరాలకు కూడా తీవ్ర అన్యాయం జరగడం ఖాయం.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email [email protected]Next Story