పల్లెకు జల కిరీటం

by Disha edit |
పల్లెకు జల కిరీటం
X

మైక్య పాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని అడుగడుగునా ఆగం పట్టించి, చెరబట్టిన సందర్భాలను అనేకం చూశాం. అన్ని రంగాలలో తెలంగాణ మీద చూపిన తీవ్ర వివక్ష కారణంగా ఈ ప్రాంతమంతా ఎడారిగా మారిన పరిస్థితులనూ అనుభవించాం. నీళ్లు అందక సాగు భూములన్నీ బీడువారిపోయి, గొంతు తడుపుకొవడానికి గుక్కెడు నీటి కోసం ఆకాశం వైపు దీనంగా చూసే దుస్థితి ఉండేది. భూమాతను నమ్ముకొని రైతన్నలు పంట సాగు చేయడానికి అప్పులు చేసి, ఎన్ని బోర్లు వేసినాచుక్క నీరు పడక ఉరితాళ్లకు వేలాడిన యెతలు అనేకం.

నిజానికి ఏ ఊరు అభివృద్ధి చెందాలన్నా చెరువులే ప్రధానం. చెరువులు నిండుగా ఉంటే ఆ గ్రామం సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుంది. పల్లెలకు చెరువులు కిరీటం లాంటివి. అవి లేని గ్రామానికి ఏదో వెలితిగా ఉంటుంది. అటువంటి పల్లెలన్నీ నేడు జలధారలు నింపుకొని దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే 'మిషన్ కాకతీయ' పేరుతో పూడిక తీయించిన చెరువుల వలనే నేడు అది సాధ్యమయిందని చెప్పవచ్చు. ఒకనాడు తలాపున గోదారి పారుతున్నా చుక్క నీరుకు నోచుకోని తెలంగాణ నేడు జలకళతో సవ్వడి చేస్తుండడంతో సబ్బండ వర్గాలవారు ఆనందపడుతున్నారు.

వాటిని పునరుద్ధరించేందుకు

తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో 'మిషన్ కాకతీయ' పథకం ప్రారంభించారు. అందులో భాగంగా, ఎప్పుడో కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి కాలక్రమంలో పూడుకుపోయాయి. సమైక్యాంధ్ర పాలకులు వాటిని అస్సలు పట్టించుకోలేదు. తెలంగాణ ఆవిర్భంవించాక సీఎం కేసీఆర్ చొరవతో 'మన ఊరు-మన చెరువు' పేరుతో పూడికతీత పనులు చేపట్టారు. దాదాపు 46 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించారు. చెరువు లోతు పెంచడం, కట్టల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లాంటి అనేక చర్యలు తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన మొదటి కార్యక్రమం ఇది. 2015 మార్చి 12న కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లోని పాత చెరువు నుంచి సీఎం కేసీఆర్ ఈ పనులను ప్రారంభించారు. కాకతీయుల కాలం తరువాత చేపడుతున్న కార్యక్రమం కావడంతో దానికి గుర్తుగా దీనికి 'మిషన్ కాకతీయ' అని పేరు పెట్టారు. దీనిని 2015 డిసెంబర్ మూడో వారంలో ప్రారంభించారు. ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని 46,531 చెరువులను 'మిషన్ కాకతీయ' ప్రాజెక్టులో భాగంగా పునరుద్ధరించారు. అన్ని చెరువులను ఎక్కువ నీటి సామర్థ్యాన్ని కలిగి ఉండేలా తీర్చిదిద్దారు. వ్యవసాయం, నీటిపారుదల, పశువులు, మంచినీటి అవసరాలకు నీటిని అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలి వరదలకు తెలంగాణ ప్రజానీకానికి నష్టం జరిగినా, ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. చెరువులు ఉంటే పంటలు పండుతాయి. పశువులకు మేత దొరుకుతుంది. మత్స్యసంపద అభివృద్ధి చెందుతుంది. ఉద్యమ నాయకుడి దూరదృష్టితో ప్రారంభించిన ఈ పథకాన్ని కేంద్ర మంత్రులు సైతం ప్రశంసించారు. అటు పచ్చని పంటల మణిహారంతో పాటు నిండుకుండల్లా నిండిన చెరువులు గ్రామాలకు తలమానికంగా నిలుస్తున్నాయి.

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

కామారెడ్డి, 78933 03516

Next Story

Most Viewed