అధ్యక్ష పాలన వైపు ట్యూనీషియా!

by Disha edit |
అధ్యక్ష పాలన వైపు ట్యూనీషియా!
X

ట్యునీషియా ఇకనుంచి అధ్యక్ష పాలనలోకి జారుకుంటుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి. అయితే, అంతర్జాతీయ న్యాయకోవిదులు మాత్రం భవిష్యత్తులో ట్యునీషియా నియంత పాలనకు ప్రతీకగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు మాత్రం ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి. ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యం, విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలి. ప్రజాస్వామ్య లౌకిక విధానాలతో పారదర్శకంగా పాలన అందించటమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. లేకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని గ్రహించాలి.

టీవల ట్యునీషియాలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) ద్వారా సుమారు 94.6 శాతం మంది నూతన రాజ్యాంగ రచనకు అనుకూలంగా తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.‌ ప్రస్తుతం అధ్యక్షుడు 'కైస్ సయీద్' పదవిలో కొనసాగుతూ ప్రభుత్వాధినేతగా అధిక అధికారాలతో దేశాన్ని పాలించనున్నారు.‌ ప్రతిపక్ష పార్టీలు ఈ రిఫరెండం పట్ల వ్యతిరేకంగా ఉన్నాయి.‌ దేశంలో నియంత పోకడలు పెరిగిపోతాయని అవి ఆందోళన వ్యక్తం చేశాయి. 'అరబ్ వసంతం' ద్వారా వచ్చిన ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు వదులుతారని భయపడుతున్నాయి.

2011లో 'అరబ్ వసంతం' ద్వారా అనేక అరబ్ దేశాలు ఈజిప్టు, లిబియా, బెహెరైన్, యెమెన్, సిరియా వంటి వాటిలో 'సివిల్‌వార్' ద్వారా నియంతలు గద్దె దిగారు. ట్యునీషియాలో మాత్రం సామరస్యంగా అధికారం, ప్రజాస్వామ్య బాట పట్టింది. 2014లో ట్యునీషియాలో అధ్యక్షుడికి, పార్లమెంటుకు వివిధ అధికారాలను ఆ దేశ రాజ్యాంగం ప్రసాదించింది. రాష్ట్రపతికి సైనిక, విదేశీ వ్యవహారాలు, ప్రధానమంత్రికి రోజువారీ పాలన అంశాలు దాఖలు చేసింది. అయితే, అధికారంలో ఉన్న 'ఇస్లామిస్ట్ ఎన్నహదా పార్టీ' పాన్ ఇస్లామిక్ ముస్లిం బ్రదర్ హుడ్ భావాలు కలిగి ఉండుటచే, సెక్యులర్ భావాలు కలిగిన వారి నుంచి వ్యతిరేకత కూడగట్టుకుంది.‌

ఈ మార్పుల కారణంగానే

ఇటువంటి పరిస్థితులలో 2011-2021 వరకు ఈ దశాబ్ద కాలంలో అక్కడ తొమ్మది ప్రభుత్వాలు మారాయి.‌ పాలనలో అస్థిరత్వం వలన దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించడం మొదలైంది. ఈ రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా అనేక మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. అధికార పార్టీ ఆఫీసు వద్ద ఆందోళనలు, నిరసనలతో దేశం దద్దరిల్లింది.‌ ఈ పరిణామాత నేపథ్యంలో దేశ అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేసి, అన్ని అధికారాలను చేపట్టారు.‌

2014 రాజ్యాంగం ప్రకారం ఇటువంటి పరిస్థితులలో రాజ్యాంగపరమైన కోర్టులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అయితే, నేటి వరకు ఈ రకమైన న్యాయ వ్యవస్థ ఏర్పడక పోవడంతో, అధ్యక్షుడే వివిధ డిక్రీలు జారీ చేస్తూ, పాలన చేపట్టారు.‌ చివరికి దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు.‌ తాను ఏర్పాటు చేసిన ప్రధానమంత్రితో పాలన సాగిస్తూ, కొత్త రాజ్యాంగం రచనకు ఉపక్రమించారు.

ఇక అధ్యక్షుడిదే అధికారం

'కొత్త రాజ్యాంగం ద్వారా దేశంలో 'పోస్ట్ రివల్యూషనరీ పార్లమెంటరీ' సిస్టం రావాలి. అందరికీ 'బ్రెడ్-ఫ్రీడం-డిగినిటీ' అందాలి. పార్లమెంట్ మంత్రుల బృందాన్ని అధ్యక్షుడే నామినేట్ చేయాలి. న్యాయమూర్తులను, ఇతర పదవులను రాష్ట్రపతి నామినేట్ చేయాలి. అన్నింటి కంటే ముఖ్యంగా అధ్యక్షుడిని తొలగించే అధికారం న్యాయమూర్తులకు ఉండకూడదు' అనే అంశాలు కొత్త రాజ్యాంగంలో చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం సభ్యులను పార్లమెంటు నియమిస్తూ ఉండగా, తాజాగా ఈ నియామకాలు అధ్యక్షుడి చేతిలోకి వచ్చాయి. దీంతో దేశ పాలన, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ మొత్తం అధ్యక్షుడి చేతులలోనే ఉంటుంది. అరబ్ దేశాలలో ప్రజాస్వామ్య దేశంగా పలువురి ప్రశంసలు పొందిన ట్యునీషియా ఇకనుంచి అధ్యక్ష పాలనలోకి జారుకుంటుంది.భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి.

అయితే, అంతర్జాతీయ న్యాయకోవిదులు మాత్రం భవిష్యత్తులో ట్యునీషియా నియంత పాలనకు ప్రతీకగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు మాత్రం ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి. ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యం, విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలి. ప్రజాస్వామ్య లౌకిక విధానాలతో పారదర్శకంగా పాలన అందించటమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. లేకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని గ్రహించాలి. దీనికి తాజా ఉదాహరణ మనముందు కదలాడుతున్న శ్రీలంక. గాడి తప్పుతున్న అనేక దేశాలకు, రాష్ట్రాలకు హెచ్చరికగా కనపడుతుంది. బహుపరాక్.

ఐ.ప్రసాదరావు

63056 82733



Next Story

Most Viewed