ఆదివాసీలకు ఎర్రజెండా దిగులు

by Disha edit |
ఆదివాసీలకు ఎర్రజెండా దిగులు
X

ఆదివాసీలకు ఆర్థిక, రాజకీయ చైతన్యం లేకపోవడం, అమాయకత్వం,నిరక్షరాస్యత కలిగి ఉండటంతో ఏజెన్సీలో గిరిజనేతర రాజకీయ పార్టీలు చెప్పిందే వేదంగా నడుస్తున్నది. సమ్మక్క, సారక్క, సోయం గంగుల్, కొమురం భీం, బిర్సా ముండా అందించిన విప్లవ సాయుధ పోరాట రాజకీయాలను పుణికిపుచ్చుకుని ఆదివాసీలు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలి. స్వయం పాలన సాధించుకోవాలి. 'మన ఊరు-మన రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం-మా పాలన మేమే చేసుకుంటాం' అని నేడు ఆదివాసీలు గర్జిస్తున్నారు. గిరిజనేతర రాజకీయ పార్టీలను, గిరిజనేతర ఎర్రజెండా పార్టీలను, గిరిజనేతర ప్రజా సంఘాలను ఏజెన్సీ నుండి బహిష్కరించినప్పుడే నిజమైన స్వాతంత్రం ఆదివాసీలకు లభిస్తుంది.

దేశంలో గిరిజన చరిత్ర అతి పురాతనమైనది. వారి వికాసం భిన్నమైనది. ఆదివాసీలు అడవులలో అనాదిగా జీవిస్తున్నారు. తమదైన సంస్కృతీ, సంప్రదాయాలతో విలసిల్లుతున్న గిరి పుత్రుల అభివృద్దికి రాజ్యాంగ నిర్మాతలు వారి సంక్షేమంతోపాటు కొన్ని హక్కులను ప్రసాదించారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గిరిజనేతరులు ఏజెన్సీలోకి వలస వచ్చి వారి హక్కులను కాలరాస్తున్నారు. వారి చట్టాలు, సంస్కృతిని కలుషితం చేస్తున్నారు. దీంతో ఆదివాసీల అస్థిత్వం, మనుగడ ప్రమాదంలో పడింది. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలే. ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను ప్రోత్సహించడంతో, వారు చితకా వ్యాపారాలు చేస్తూ ఆదివాసీలను బానిసలలాగా చూస్తున్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టాలు నేడు గిరిజనేతర రాజకీయ పార్టీల మూలంగా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఏజెన్సీలో తీవ్ర వైరుధ్యం నెలకొంటున్నది.

రాజకీయ పార్టీల జోక్యంతో

ఆదివాసీల హక్కుల కోసం ఒకప్పుడు కమ్యూనిష్టు పార్టీలు ఎంతగానో శ్రమించాయి. ఇప్పుడు ఎర్రజెండా పార్టీలు కొన్ని తమ అజ్ఞాత దళాలను ఆదివాసీల మీదకు ఉసిగొల్పుతున్నాయి. ఇప్పటికే పాకాల, కొత్తగూడెం, వేలుబల్లిలో తమ అజ్ఞాత దళాలతో కలిసి లంబాడీలు ఆదివాసీలను విపరీతంగా కొట్టారు. ఆదివాసీలు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కొన్ని ఎర్ర జెండా పార్టీలు ఇల్లందు, బయ్యారం, గుండాల, టేకులపల్లి, ఇల్లందు ఏజెన్సీలో ఏరియాలో చాలామంది ఆదివాసీల భూములను గిరిజనేతరులకు పంచి పెట్టాయి. ఏజెన్సీలో ఏ రాజకీయ పార్టీ నడవాలన్నా, నడిపించుకోవాలన్నా పీసా చట్టం ప్రకారం గ్రామ సభ అనుమతి ఉండాలి.

మరి ఏ చట్టం ప్రకారం ఏజెన్సీలో ఆదివాసీలపై రాజకీయ పార్టీలు పెత్తనం చేస్తున్నాయి? ఏజెన్సీలో ఎన్నికలు వస్తే గిరిజనేతరులు అభ్యర్థులను ఎంపిక చేసి, డబ్బు ఖర్చుపెట్టి గెలిపించుకుంటున్నారు. దీంతో వారు ఏం చెబితే అది చేయాల్సిన పరిస్థితి దాపురించింది. 1/70 చట్టానికి విరుద్ధంగా భూ విక్రయాలు జరుగుతున్నా రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదు. పీసా చట్టం గురించి, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు జరుగుతున్న ఎన్నో వేల ఎకరాల భూమి ఆక్రమణల గురించి అడిగే నాథుడు లేడు. చివరికి న్యాయం కోసం ఆదివాసీలు కోర్టుకు వెళ్లినా 70 శాతం తీర్పులు గిరిజనేతరులకే అనుకూలంగా వచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలు గిరిజనేతరుల హక్కుల గురించి మాట్లాడుతూ ఆదివాసీల మనుగడను కాలరాస్తున్నాయి.

మావోయిస్టులతో సంబంధాలు అంటగట్టి

అగ్ర కులాలవారు ఆదివాసీల పిల్లలను పెళ్లి చేసుకుని దొంగ చాటున రిజర్వేషన్ పొందుతున్నారు. ఆదివాసీల ఉద్యోగాలను చట్ట వ్యతిరేకంగా దోచుకుంటున్నారు. ఆదివాసీల మధ్య గొడవలు వచ్చినా, భూ తగదాలు వచ్చినా పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి. ఠాణాకు వెళితే పార్టీల నాయకులే మాయమాటలు చెప్పి రాజీ చేస్తున్నారు. ఆదివాసీ సంఘాలు ఆదివాసీల హక్కుల గురించి ఉద్యమాలు చేస్తే వారికి నక్సల్స్‌తో, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఆదివాసీ ఉద్యమాలను, ఆదివాసీ హక్కులను పరోక్షంగా గిరిజనేతర రాజకీయ పార్టీలు అణిచివేస్తున్నాయి. వారి గొంతులను నొక్కుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎర్రజెండా పార్టీలు కూడా ఏజెన్సీలో గిరిజనేతరులకు పోడు భూములు కావాలని పోరాటం చేస్తున్నాయి. గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలని ధర్నాలు చేస్తున్నాయి. ఆదివాసీలపై అమానుషంగా, దారుణంగా అణచివేత, ఆధిపత్యం చెలాయిస్తున్న గిరిజనేతర పార్టీలను ఏజెన్సీ నుంచి బహిష్కరించాలని, ఆదివాసీల హక్కులు కాపాడుకోవాలని, తద్వారా ఆదివాసీ స్వయం పాలనకు సిద్ధం కావాలని ఆదివాసీ సంఘాలు పిలుపునిస్తున్నాయి.

అక్కడ అలా, ఇక్కడ ఇలా

ఏజెన్సీలో ఉన్న ఆదివాసీ చట్టాలు అమలు చేయాలి. జమ్ము-కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలలోని ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులకు ఎలాంటి ప్రవేశం ఉండదు. అక్కడ ఎలాంటి వ్యాపారాలు నిర్వహించరు. అక్కడ ఆదివాసీలు ఆరవ షెడ్యూల్ ప్రకారం స్వయం పాలన చేస్తుండగా, ఐదవ షెడ్యూల్ ఆదివాసీ భూభాగం మాత్రం ఈ గిరిజనేతర రాజకీయ పార్టీలకు బానిసలుగా మిగిలిపోతున్నారు. మన దగ్గర ఐదవ షెడ్యూల్ భూభాగంలో మొత్తం గిరిజనేతరుల ఆధిపత్యమే ఎక్కువగా నడుస్తున్నది. పాలకవర్గాల జోక్యం అత్యధికంగా ఉంటుంది.

ఆదివాసీల చట్టాలు అమలు కాక అంతరించే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదివాసీలకు ఆర్థిక, రాజకీయ చైతన్యం లేకపోవడం, అమాయకత్వం,నిరక్షరాస్యత కలిగి ఉండటంతో ఏజెన్సీలో గిరిజనేతర రాజకీయ పార్టీలు చెప్పిందే వేదంగా నడుస్తున్నది. సమ్మక్క, సారక్క, సోయం గంగుల్, కొమురం భీం, బిర్సా ముండా అందించిన విప్లవ సాయుధ పోరాట రాజకీయాలను పుణికిపుచ్చుకుని ఆదివాసీలు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలి. స్వయం పాలన సాధించుకోవాలి. 'మన ఊరు-మన రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం-మా పాలన మేమే చేసుకుంటాం' అని నేడు ఆదివాసీలు గర్జిస్తున్నారు. గిరిజనేతర రాజకీయ పార్టీలను, గిరిజనేతర ఎర్రజెండా పార్టీలను, గిరిజనేతర ప్రజా సంఘాలను ఏజెన్సీ నుండి బహిష్కరించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం ఆదివాసీలకు లభిస్తుంది.

వూకె రామకృష్ణ దొర

సీనియర్ జర్నలిస్ట్

98660 73866



Next Story