పర్యాటక మణిహారం బుద్ధవనం

by Disha edit |
పర్యాటక మణిహారం బుద్ధవనం
X

బుద్ధవనం ప్రాజెక్టు తెలంగాణను అంతర్జాతీయ చిత్రపటంలోకి తీసుకెళుతుంది. 300కు పైగా ప్రాచీన బౌద్ధ స్థావరాలతో నిండిన తెలుగు నేలపై అప్పటి వైభవ ప్రాభవాలను, బౌద్ధ నైతిక విలువలను ఈ తరానికి అందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు తెలంగాణకు గర్వకారణం. ఇది భవిష్యత్తులో బౌద్ధ విజ్ఞాన సముపార్జన కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ బౌద్ధానికి సంబంధించిన అన్ని రకాల విశేషాలను పొందుపరిచారు. ప్రముఖ బుద్ధిస్టు సంస్థలు ఆయా దేశాల సంస్కృతుల సమ్మేళనంతో ఇక్కడి నిర్మాణాలు చేపట్టాయి.

బౌద్ధ దార్శనికుడు, రెండో బుద్ధుడిగా పేరొందిన ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల, 'బుద్ధం శరణం గచ్చామి' అని మారు మోగిన ప్రాంతం. ఆగ్నేసియా దేశాలకు బౌద్ధమతాన్ని విస్తరించిన ముఖ ద్వారం విజయపురి. నాగార్జున‌సాగర్ ప్రాంతంలో, కృష్ణమ్మ ఒడ్డున ఎత్తైన కొండల పక్కన చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణంతో బుద్ధవనం ప్రాజెక్టు ఆకట్టుకుంటోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్‌‌కాలనీలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు చేయనుంది.

ఇక్కడి బుద్ధుడి శిల్పాలు, బౌద్ధ చిహ్నాలు ధ్యానాన్ని ప్రేరేపించిన అనుభూతిని కలిగిస్తాయి. బుద్ధవనం ప్రాజెక్టును 274.28 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఒకవైపు బుద్ధుని జీవిత ఘట్టాల శిల్పాలతో అలంకరించిన బుద్ధ చరితవనం, మరోవైపు సిద్ధార్థుడు భోధిసత్వుడిగా ఉన్నప్పుడు పరిపూర్ణతను సాధించడానికి ఆచరించిన పది పారమితలను ప్రతిబింబించే జాతక వనం, ఇంకొంచెం ముందుకు వెళితే ధ్యానవనం, అందులో శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన 36 అడుగుల బుద్ధుడి శిల్పం. దమ్మభూషణ వినిపించే గంట సందర్శకులను మైమరపింపజేస్తాయి. బుద్ధుడు బోధించిన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపు మరల్చనివ్వవు.

బుద్ధవనం విశేషాలు

బుద్ధవనంలోని మహాస్తూపం, దేశంలోనే అరుదైన బౌద్ధ వారసత్వ కట్టడంగా కీర్తి గడించింది. కింది అంతస్తులో ప్రాచీన బౌద్ధ శిల్ప కళాఖండాలున్న ప్రదర్శనశాల, సమావేశ మందిరం, ఆచార్య నాగార్జునుడి పంచలోహ విగ్రహం ఉన్నాయి. మొదటి అంతస్తులో అష్ట మంగళ చిహ్నాలు, సిద్ధార్థ గౌతముని అయిదు ప్రధాన జీవిత ఘట్టాలను సూచించే స్తంభాలు. వేదిక చుట్టూ అలంకరించిన అద్వితీయ బౌద్ధ శిల్ప కళాఖండాలు, వాటిలో ఆచార్య నాగార్జునుడు, ధర్మచక్ర పరివర్తన ముద్రలో బుద్ధుడు తార, మైత్రేయనాథ, భవ చక్ర శిల్పాలను ఆళ్లగడ్డ శిల్పులు తీర్చిదిద్దారు. మొత్తం 13 రకాల స్థూపాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎనిమిది విదేశాలకు చెందినవి, ఐదు భారత్‌కు చెందినవి ఉన్నాయి.

చైనా, పాకిస్థాన్‌, టిబెట్‌, థాయ్‌లాండ్‌, నేపాల్‌, మయన్మార్‌, ఆఫ్ఘనిస్థాన్‌, శ్రీలంకలో ఉండే బౌద్ధస్థూపాల నమూనాలతో పాటు మనదేశంలోని అజంతా, సారనాథ్‌, మాణిక్యాల, సాంచీ, కార్లే ప్రాంతాలలోని నమూనా స్థూపాలను ఇక్కడ నిర్మించారు. బుద్ధవనం ఆధ్యాత్మికంగానే కాదు ప్రకృతి పర్యాటకులను ఆకర్షించనుంది. ప్రధాన ద్వారం వద్ద ఘన స్వాగతం పలికే గజరాజులు, ఆ వెనకే రెండువైపులా స్తంభాలపై మృగరాజులు. తలెత్తి చూస్తే ఆకాశానికి అతుక్కుపోయినట్టు కనిపించే అశోక చక్రం. లోపలికి వెళ్లగానే బుద్ధుడు సేద తీరుతున్నట్టు కనిపించే కృష్ణశిల, ఆ పక్కనే పాదుకలు, బుద్ధుడికి సంబంధించిన జీవిత ఘట్టాలు. ఆధ్యాత్మిక గురువు దలైలామా నాటిన బోధి వృక్షం.అన్నింటికీ మించి బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలను ప్రతిబింబించే దారులు. మహా స్తూపం. ఇవీ నాగార్జునసాగర్‌ తీరాన కొలువుదీరిన బుద్ధవనం విశేషాలు.

తెలంగాణకు గర్వకారణంగా

అహో అమోఘం. ఇది బుద్ధుడు నడిచిన నేలే అన్నట్టు రూపుదిద్దుకొంటున్నది బుద్ధవనం. చెట్ల మధ్య నుంచి ఇటీవల నడక బాట వేశారు. దాని వెంట మధ్య మధ్యలో చిన్నపాటి దీవులను తలపించే కొండలు, చుట్టూ నీలి రంగు జలాలతో కృష్ణా నది అలరిస్తుంది. ఎత్తైన ప్రదేశం. రాతి బండలపై నుంచి ఎటు చూసినా కృష్ణా జలాలే. దీన్ని 'రివర్‌ వ్యూ టీ పాయింట్‌'గా అభివృద్ధి చేశారు. బుద్ధవనం ప్రాంతంలో సంచరించే మనుబోతులు, దుప్పులు, నెమళ్లు, కుందేళ్లు మరో ప్రత్యేక ఆకర్షణ. 2001లోనే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయాలనుకున్నా, అది అసంపూర్తిగా నిలిచిపోవడంతో దీన్ని పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్ల క్రితం సంకల్పించి మల్లేపల్లి లక్ష్మయ్యకు బాధ్యతలు అప్పగించి దేశీయ. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా 'బుద్ధవనం' ప్రాజెక్టును ప్రభుత్వం తీర్చిదిద్దింది.

క్రీ.శ. 1-3వ శతాబ్దం వరకు బౌద్ధం విలసిల్లిన ప్రాంతమిది. ఇక్కడికి సమీపంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. బుద్ధవనం ప్రాజెక్టు తెలంగాణను అంతర్జాతీయ చిత్రపటంలోకి తీసుకెళుతుంది. 300కు పైగా ప్రాచీన బౌద్ధ స్థావరాలతో నిండిన తెలుగు నేలపై అప్పటి వైభవ ప్రాభవాలను, బౌద్ధ నైతిక విలువలను ఈ తరానికి అందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు తెలంగాణకు గర్వకారణం. ఇది భవిష్యత్తులో బౌద్ధ విజ్ఞాన సముపార్జన కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ బౌద్ధానికి సంబంధించిన అన్ని రకాల విశేషాలను పొందుపరిచారు. ప్రముఖ బుద్ధిస్టు సంస్థలు ఆయా దేశాల సంస్కృతుల సమ్మేళనంతో ఇక్కడి నిర్మాణాలు చేపట్టాయి. ఆచార్య నాగార్జునుడు 2000 వేల సంవత్సరాల క్రితం గడిపిన ప్రదేశంగా, వారు స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, చరిత్ర ఆధారంగా బుద్ధవనం ప్రాజెక్టును రూపొందించారు.

జటావత్ హనుమ

లెక్చరర్, భూపాలపల్లి

85198 36308


Next Story

Most Viewed