మార్పు వచ్చింది.. కాంగ్రెస్ వస్తోంది

by Disha edit |
మార్పు వచ్చింది.. కాంగ్రెస్ వస్తోంది
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు పరిస్థితులు ఒక్కసారిగా ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా మారడంతో హ్యాట్రిక్‌ విజయంపై ధీమా పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. పీపుల్స్‌పల్స్‌ సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ప్రకారం ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య కంటే బీఆర్‌ఎస్‌ వర్సెస్ ప్రజల మధ్యనే జరిగాయని చెప్పవచ్చు. రెండు మార్లు బీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చాం, ఇప్పుడు మార్పు కోరుకుంటున్నామని ఓటర్లు సర్వేలో చెప్పారు. కాంగ్రెస్‌కు ఆరు గ్యారెంటీల కంటే ప్రభుత్వ వ్యతిరేకతే కలిసివచ్చింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా మరింత బలంగా గాలివీస్తే ఆ పార్టీకి మరిన్ని సీట్లు పెరిగే అవకాశాలున్నాయి.

మెజార్టీ స్థానాలతో..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో తెలంగాణ ఓటరు ఈసారి కాంగ్రెస్‌కు పట్టం కడుతున్నట్లు వెల్లడయింది. దాని ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 62-72, బీఆర్‌ఎస్‌ 35-46, బీజేపీ 3-8, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ 42.7 శాతం, బీఆర్‌ఎస్‌ 37.8, బీజేపీ 13.2, ఎంఐఎం 2.5 శాతం ఓట్లు సాధించే అవకాశముంది. కాంగ్రెస్‌ పార్టీ 4.9 శాతం ఓట్లతో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీపై ఆధిక్యం సాధించనుంది. పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా 5 వేల సాంపిల్స్‌తో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్‌ నిర్వహించింది. దీని ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాల్లో కాంగ్రెస్‌పార్టీ 21 జిల్లాలో, బీఆర్‌ఎస్‌ 11 జిల్లాల్లో ఓట్ల శాతం ప్రకారం ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ కేవలం నిర్మల్‌ జిల్లాలో మాత్రమే ఓట్ల శాతం ప్రకారం తన ఆధిక్యత కొనసాగించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో మెజార్టీకి కావాల్సిన స్థానాలు 60. కాగా, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశముందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గాలి మరింత బలంగా వీస్తే మరిన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని నివేదించింది.

బీఆర్‌ఎస్‌ ఆశలు గల్లంతేనా?

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. 2018 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత నెల నుంచే ప్రజలు కారుకు బ్రేకులు వేయడం మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనే శక్తి ఉన్న పార్టీనే గెలిపిస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 46.9 శాతం ఓట్లతో 88 సీట్లను గెలుచుకుంది. ఇంత భారీ విజయం సాధించిన తర్వాత కూడా కేసీఆర్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవడం ప్రజలకు నచ్చలేదు. అందుకే ఈ ఎన్నికల తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే వచ్చిన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డిని గెలిపించారు. ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ‘కారు... సారు... పదహారు’ నినాదంతో ముందుకొచ్చిన బీఆర్‌ఎస్‌ 9 సీట్లతో సరిపెట్టుకుంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సుమారు 19 శాతం ఓట్లు కోల్పోయింది. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కీలకనేత పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అతికష్టంగా తీన్మార్‌ మల్లన్నపై గెలిచారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు భంగపాటే ఎదురయ్యింది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో గెలిచినా ఓట్ల శాతం మాత్రం పెరగలేదు. వామపక్షాల సహకారంతో మునుగోడు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలిచి అనంతరం వారిని దూరం పెట్టారు. ఇలా ప్రతి ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతున్నా కేసీఆర్‌ దిద్దుబాటుకు ప్రయత్నించకుండా తనకు ఎదురే లేదన్నట్టు వ్యవహరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో తమ ఎజెండా ఇంకా పూర్తి కాలేదని ‘గుడ్‌ టు గ్రేట్‌’ నినాదంతో బీఆర్‌ఎస్‌ ప్రచారం సాగించింది. మరోవైపు ఆశించినట్టుగా పీఆర్సీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, సమ్మె చేసిన సమయంలో కేసీఆర్‌ చేసిన అవమానాన్ని మర్చిపోలేని ఆర్టీసీ కార్మికులు ‘ఇక చాలు... మార్పు కావాలి’ అని ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సైలెంట్‌ ప్రచారం మొదలుపెట్టారు.

మైనార్టీల్లోనూ వ్యతిరేకతే..

ఈ సర్వేలో బీసీ సామాజిక వర్గంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు సమాన మద్దతు లభించడం గమనార్హం. ఎస్సీ ఓటర్లలో, ఎస్టీ ఓటర్లలో కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యత కనిపిస్తోంది. దళిత బంధు చాలా మందికి అందకపోవడంతో పాటు పోడు భూముల పట్టాల పంపిణీ అసంపూర్తిగా మిగిలిపోవడమే దీనికి ప్రధాన కారణమని సర్వేలో తేలింది. 15 శాతానికి పైగా ముస్లింలున్న నియోజకవర్గాలు రాష్ట్రంలో 24 ఉన్నాయి. వీరు ఎక్కువగా బీఆర్‌ఎస్‌ వైపే నిలబడినా గత రెండు ఎన్నికలతో పోలిస్తే మాత్రం మద్దతు తగ్గిందని సర్వేలో తేలింది. కేంద్రంలో బీజేపీకి బీఆర్‌ఎస్‌, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ పరోక్షంగా మద్దతిచ్చుకునేలా రెండు పార్టీలు అంతర్గత అవగాహనకు వచ్చాయని మైనార్టీలు భావించడమే దీనికి కారణం.

ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణాలు..

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా, కేసీఆర్‌ అతివిశ్వాసంతో రెండు నెలల ముందే దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం బీఆర్‌ఎస్‌కి నష్టం చేకూర్చే అవకాశాలున్నట్లు ఈ సర్వేలో తేలింది. గ్రేటర్‌ ఎన్నికల్లో సిట్టింగ్‌ కార్పొరేటర్లకు తిరిగి టికెట్లు ఇచ్చి చేతులు కాల్చుకున్న కేసీఆర్‌ అదే పొరపాటును ప్రస్తుత ఎన్నికల్లోనూ చేస్తూ సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇచ్చారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, దళిత బంధు అందరికీ అందకపోవడం, బీసీ బంధు కొన్ని కులాలకే పరిమితం కావడం, నూతన రేషన్‌ కార్డులు ఇవ్వకపోవడం, నిరుద్యోగం, పంటకు కనీస మద్దతు ధర లభించకపోవడం, అవినీతి అంశాలు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రభావితం చూపించాయి. డబుల్‌ బెడ్రూం ఇండ్లు పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత రెట్టింపయ్యింది. దళితబంధు అందరికీ ఇవ్వకపోవడం, ఇచ్చిన కొంతమందిలోనూ పార్టీ కార్యకర్తలే అధికంగా ఉండటం, వీటికి ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకున్నారని ఆరోపణలు బీఆర్‌ఎస్‌కు తీవ్రం నష్టం చేసినట్టు సర్వేలో వెల్లడయ్యింది.

కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేసి..

లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్‌ పలు సందర్భాల్లో లెక్కలు చెప్పినప్పటికీ ఉద్యోగాలు రాలేదనే తీవ్ర అసంతృప్తి యువతలో నెలకొంది. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని గతంలో చెప్పిన కేసీఆర్‌ మాట తప్పడమే కాకుండా, టీఎస్పీఎస్సీ కుంభకోణంతో యువత ఆగ్రహం రెట్టింపయ్యింది. రాష్ట్రంలో 35 ఏళ్లలోపు ఉన్న 90 లక్షల యువ ఓటర్లలో అధిక శాతం బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేసినట్టు సర్వేలో తేలింది. రైతుబంధు ఇస్తున్నప్పటికీ రైతు రుణమాఫీ జరగలేదనే అసంతృప్తి రైతుల్లో ఉంది. రైతు రుణాల వడ్డీలు రెట్టింపు కావడంతో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్‌ వైపే రైతులు మొగ్గు చూపారు. బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య గ్యాప్‌ ఏర్పడడం కూడా పార్టీకి నష్టం చేకూర్చిందని సర్వేలో వెల్లడయ్యింది. ఉద్యమ కాలం నుండి పార్టీలో ఉన్న వారిని కాదని అధినాయకత్వానికి భజన చేసే ‘బీటీ’ (బంగారు తెలంగాణ) టీమ్‌కు పార్టీలో ప్రాధాన్యత పెరిగిందనే భావన బీఆర్‌ఎస్‌లో ఏర్పడిరది. కాంగ్రెస్‌లోని నేతలను చేర్చుకొని ఆ పార్టీని బలహీనపర్చవచ్చని బీఆర్‌ఎస్‌ భావించింది. కానీ, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ గురించి తక్కువ అంచనా వేసింది. మునుగోడులో విజయానికి బీఆర్‌ఎస్‌కు సాయపడిన కమ్యూనిస్టులతో సయోధ్యగా ఉండి ఉంటే, బీజేపీకి బీఆర్‌ఎస్‌ ‘బీ’ టీమ్‌ అనే మచ్చ వచ్చేది కాదు. ఈ విధంగా జరిగుంటే అసెంబ్లీ ఎన్నికల్లో లౌకికవాదులు కూడా పార్టీ పక్షానే ఉండేవారు.

ఇవి కలిసొస్తాయనుకున్నా..

కేసీఆర్‌ మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరనే ప్రచారంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపించాయి. వీరిని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం చేశారనే విమర్శలు సర్వేలో వినిపించాయి. రోడ్లు, వీధిదీపాలు, పట్టణీకరణ పనులు తమను గెలిపిస్తాయని బీఆర్‌ఎస్‌ భావించగా, వీటిని అభివృద్ధి కోణం కంటే పార్టీ నేతల రియల్‌ ఎస్టేట్‌కే ఉపయోగపడ్డాయనే భావనతో ప్రజలు చూశారు. కేసీఆర్‌ ముచ్చటపడి కట్టించుకున్న నూతన సచివాలయానికి కూడా ఆయన రాకపోవడంతో కేసీఆర్‌కు ఫాంహౌస్‌ ముఖ్యమంత్రి అనే పేరు నిలిచిపోయింది. భారీ అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక కట్టడాలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణలో బాగుపడింది కేసీఆర్‌ కుటుంబం మాత్రమే అని ప్రతిపక్షాల ఆరోపణలు బీఆర్‌ఎస్‌కు నెగెటివ్‌గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం ఇబ్బందులను రెట్టింపు చేసినట్లు సర్వే పరిశీలనలో తేలింది. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కలహాలుంటాయనే భావనతో కేసీఆర్‌ పప్పులో కాలేశారు. ఆ పార్టీలో అరడజన్‌కుపైగా సీఎం అభ్యర్థులున్నారని, టికెట్లు రానివారు రెబల్స్‌గా పోటీ చేస్తారని ఈ పరిణామాలు అనుకూలిస్తాయని కేసీఆర్‌ భావించగా, పది సంవత్సరాలకుపైగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలకు జ్ఞానోదయమై అధికారమే లక్ష్యంగా అంతర్గత గొడవలను పక్కన పెట్టి పని చేసినట్టు సర్వే సందర్భంగా కనిపించింది.

తప్పులు చేసిన బీజేపీ..

రాహుల్‌ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర, కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో పెను మార్పులొచ్చాయి. భారత్‌ జోడో యాత్రకు ముందు తెలంగాణలో కాంగ్రెస్‌ మూడో స్థానంలో, బీజేపీ రెండో స్థానంలో ఉండేవి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో పార్టీ గ్రామ స్థాయి వరకూ విస్తరించింది. ఒకానొక సమయంలో రాష్ట్రంలో బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌తో జట్ట కట్టాల్సిన అవసరం ఉందనే ప్రచారం కూడా జరిగింది. కానీ, కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు, మునుగోడులో బీజేపీ ఓటమితో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోయింది. ఈ పరిణామాలతో తాము గెలవకున్నా ఫర్వాలేదు గానీ, దక్షిణాదిలో కాంగ్రెస్‌ బలపడకూడదనే ఉద్దేశంతో బీజేపీ తప్పుల మీద తప్పులు చేసింది. ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. వీటికి తోడు కర్ణాటకలో గెలుపు తెలంగాణ కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు రాష్ట్రంలో రెండో స్థానానికి ఎదగడానికి తోడ్పడ్డాయి. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ పాలనపై ఏర్పడిన వ్యతిరేక ఓట్లు అధిక శాతం కాంగ్రెస్‌ ఖాతాలో జమ అయ్యాయని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో తేలింది.

కాంగ్రెస్‌ను నమ్మడానికి కారణాలు..

ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏదో జరుగుతుందని కలలు గన్న ప్రజల్లో ఆ లక్ష్యాలకు రాష్ట్రం చేరుకోలేదనే భావన పెరిగింది. గతంలో కాంగ్రెస్‌ని విడిచి బీజేపీ, బీఆర్‌ఎస్‌లో చేరిన అనేకమంది నాయకులు ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చింది. రెడ్డి సామాజికవర్గం కూడా కాంగ్రెస్‌ కోసం మునుపెన్నడూ లేని విధంగా పార్టీ విజయం కోసం కృషి చేసింది. వీటికి తోడు కేసీఆర్‌ భరోసా పథకాలను, కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు దీటుగా ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడంలో ఈ గ్యారెంటీలు విజయం సాధించడంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ రోజురోజుకు పెరిగింది. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టు ఉంది. ప్రధాని మోదీ ప్రకటించిన ఎస్సీ వర్గీకరణ, బీజేపీ బీసీ సీఎం ప్రభావం ఎన్నికల్లో చూపలేదని సర్వేలో తేలింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలవబోతుందనే అంచనాకు వచ్చిన బీజేపీ అధిష్టానం చివరి దశలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు లబ్ది చేకూర్చాలని ప్రయాత్నాలు చేసినా కాంగ్రెస్‌ వైపు వీచిన గాలిలో ఇవన్నీ కొట్టుకుపోయాయని పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో తేలింది.

ఎంఐఎం ప్రస్తుతమున్న ఏడు సీట్లను తిరిగి గెలిచే అవకాశాలున్నాయి. సీపీఐ, సీపీఎం ఉనికి కోసం పోరాడుతున్నాయి. తెలంగాణలో మొదటి నుండి కమ్యూనిస్టులు, నక్సల్స్‌ ప్రభావం ఉండటం, టీజేఎస్‌, జాగో తెలంగాణ వంటి సంస్థలతో పాటు పలు ప్రజా సంఘాలు క్రియాశీలకంగా ఉండడంతో బీజేపీ ఆశించినట్టు ఉత్తరాది రాష్ట్రాల వలే హిందూ ముస్లిం ప్రాతిపదికన ఎన్నికలు జరగలేదని సర్వేలో తేలింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్‌ వ్యూహాలు కూడా ఆ పార్టీ విజయానికి దోహదపడుతున్నాయని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వెల్లడైంది.

బీజేపీపై ఆధిపత్యం..

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టనున్నట్లు పీపుల్స్‌పల్స్‌ - డాటాలోక్‌ పోస్ట్‌ పోల్‌ సర్వే చెబుతోంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ 117 - 139, బీజేపీ 91-113 , ఇతరులు 0-8 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 230 స్థానాలున్న రాష్ట్రంలో అధికారానికి కావాల్సిన మెజార్టీ సంఖ్య 116 సీట్లను కాంగ్రెస్‌ పొందే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి 43.1, బీజేపీకి 38.8, ఇతరులు 18.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. కాంగ్రెస్‌ - బీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 4.3 శాతంగా ఉంటోంది.

రాష్ట్రంలో ఎన్నికలు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా జరగగా కాంగ్రెస్‌ స్పష్టంగానే బీజేపీపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. బుందేల్‌ఖండ్‌, మహాకౌషల్‌, వింధ్యా మూడు ప్రాంతాలు బీజేపీకి అనుకూలంగా వున్నాయి. చంబల్‌, ఉత్తర మాల్వా, మాల్వా-తిమార్‌-నిమార్‌ మూడు ప్రాంతాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వున్నాయి. మధ్య భారత్‌ ప్రాంతంలో రెండు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. ఈ ప్రాంతాలలోని ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్‌ 79-97 శాతం ఓట్లు సాధించవచ్చు. 8 స్థానాలు పొందే అవకాశమున్న ఇండిపెండెంట్లు, బీఎస్పీ, ఎస్పీ పార్టీలు ఓట్ల శాతాన్ని అధికంగా పొందవచ్చు. మహిళా ఓటర్లు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు సమాన స్థాయిలో ప్రాధాన్యతివ్వగా, పురుషులు మాత్రం బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్రంలో 18 శాతమున్న అగ్రవర్ణాల ఓటర్ల సరళిని పరిశీలిస్తే వారు కాంగ్రెస్‌ కంటే బీజేపీకి 3.8 శాతం ఎక్కువ అనుకూలంగా ఉన్నారు. ఓబీసీలలో రెండు పార్టీలకు ప్రాధాన్యత లభించింది. అయితే ఎస్సీ, ఎస్టీలలో కాంగ్రెస్‌కు లభించిన భారీ ఆధిక్యత ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

హస్తానికే మరోసారి అధికారం

ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా అని పీపుల్స్‌పల్స్‌ పోస్ట్ పోల్ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు తిరిగి కాంగ్రెస్‌కే పట్టం కట్టనున్నారు. కాంగ్రెస్‌ 54-64, బీజేపీ 29-39 స్థానాలు, బీఎస్పీ 0-2 స్థానాలు పొందే అవకాశాలున్నాయి. 90 స్థానాలున్న రాష్ట్రంలో అధికారానికి కావాల్సిన మెజార్టీ సంఖ్య 46 సీట్లను కాంగ్రెస్‌ పొందే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి 47, బీజేపీకి 42, ఇతరులకు 11 శాతం ఓట్లు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా పంటకు మద్దతు ధర, మహిళలకు ప్రతినెల నగదు సహాయం వంటి ఎన్నికల హామీలను ప్రకటించినా ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన ఉన్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎండగట్టడంలో ప్రతిపక్ష బీజేపీ విఫలమైందని ఈ సర్వే తెలిపింది. మతమార్పిడి, లిక్కర్‌స్కాం, పీఎస్‌సీ స్కామ్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉన్న ఆరోపణలను బీజేపీ ఎన్నికల్లో అనుకూలంగా మల్చుకోలేకపోయింది. పంట సేకరణ, రైతులకు రుణాలు, ఉచిత విద్యుత్‌, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అంశాలను కాంగ్రెస్‌ అనుకూలంగా మల్చుకోగలిగింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆచరించే సంప్రదాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రాంతీయ ఉత్సవాలతో పాటు ఫుడ్‌ ఫెస్టివెల్స్‌ను నిర్వహించడంతో ఆ సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి. బీజేపీలో అగ్రవర్ణ నేతల ఆధిపత్యం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. రాష్ట్రంలో జేసీసీ, బీఎస్పీ, నూతనంగా ఆవిర్భవించిన హమారా రాజ్‌ పార్టీలు పెద్ద ప్రభావం చూపలేకపోయాయి.

సంప్రాదాయాన్ని కొనసాగించిన రాజస్థాన్

రాజస్థాన్‌ ప్రజలు ప్రభుత్వ మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి బీజేపీకి పట్టం కట్టనున్నారు పీపుల్స్‌పల్స్‌ - డాటాలోక్‌ పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం బీజేపీ 95-115, కాంగ్రెస్‌ 73-95, సీపీఐఎం 1-3, ఆర్‌ఎల్పీ & ఆర్‌ఎస్పీ 2-6, ఇతరులు 5-12 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 200 స్థానాలున్న రాష్ట్రంలో అధికారానికి కావాల్సిన మెజార్టీ సంఖ్య 101 సీట్లను కాంగ్రెస్‌ పొందే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి 40, బీజేపీకి 41, ఇతరులకు19 శాతం ఓట్లు వచ్చే అవకాశం. కాంగ్రెస్‌ - బీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం ఒక శాతమే. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 39.3 శాతం ఓట్లతో 100 స్థానాలు, బీజేపీ 38.8 ఓట్ల శాతంతో 73 స్థానాలు గెలిచాయి. కేవలం 0.5 ఓట్ల వ్యత్యాసంతో కాంగ్రెస్‌ 27 స్థానాలు అధికంగా సాధించింది. రాష్ట్రంలో ఎన్నికలు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా జరగగా బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలున్నాయని సర్వే నివేదించింది. గతానికి భిన్నంగా ఈ సారి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం తక్కువగా కనిపించడం విశేషం. సీఎం అశోక్‌ గెహ్లాత్‌కు ఆదరణ ఉన్నా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్‌ ఎస్టీ, జాట్స్‌, ముస్లింలు, మాలి, మీనా సామాజికవర్గాల్లో పట్టు నిలుపుకోగా, ప్రత్యేకించి తూర్పు రాజస్థాన్‌లో గుర్జర్ల వర్గంలో ఓటింగ్‌ను కోల్పోయింది. బీజేపీకి అగ్రవర్ణాలలో ప్రత్యేకించి రాజ్‌పుత్‌లలో మంచి పట్టు ఉంది. మరోవైపు కుమావత్‌, ప్రజాపతి, గుర్జర్‌ వంటి ఓబీసీలలో కూడా పార్టీకి పట్టు ఉంది. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు ప్రభుత్వ పథకాలపట్ల దిగువ తరగతి ప్రజలు కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా ఉన్నారు.

హంగ్‌ దిశగా మిజోరం

మిజోరం రాష్ట్రంలో ఎమ్‌ఎన్‌ఎఫ్‌ 16-20, జెడ్‌పీఎమ్‌ 10-14, కాంగ్రెస్‌ 6-10, బీజేపీ 2-3 స్థానాలు పొందే అవకాశాలున్నాయని పీపుల్స్‌పల్స్‌ సంస్థ పేర్కొంది. ఎమ్‌ఎన్‌ఎఫ్‌ అధిక స్థానాలతో పెద్దపార్టీగా ఆవిర్భవించే అవకాశాలున్నాయి. 40 స్థానాలున్న రాష్ట్రంలో అధికారానికి కావాల్సిన మెజారిటీ సంఖ్య 21. ఎమ్‌ఎన్‌ఎఫ్‌ 33, జెడ్‌పీఎమ్‌ 24, కాంగ్రెస్‌ 29, ఇతరులు 14 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి పోస్ట్ పోల్ సర్వే తెలిపింది.

- జి.మురళీకృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

[email protected]


Next Story

Most Viewed