పేదలకు ఉచితాలు ఆవశ్యం!

by Disha edit |
పేదలకు ఉచితాలు ఆవశ్యం!
X

కొన్ని విషయాలు సూటిగా మాట్లాడుకోవాలి. దేశం అభివృద్ధి చెందినదని చెబుతున్నప్పటికీ మన దేశం ప్రపంచ పోషక ఆహార సూచీలో 111 వ స్థానంలో ఉంది. కాబట్టే పేదల కోసం పెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని వ్యతిరేకించేవారితో సూటిగా మాట్లాడుకోవడం అవసరం. వాటికి తోడు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఎందుకు వ్యతిరేకిస్తుంటారో అర్థం చేసుకోవాలి. కొత్తగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి తేవడం మహిళా లోకాన్ని మునుపెన్నడూ లేనంతగా ఆకర్షించింది. దీనివల్ల ఏటా ఆర్టీసీ కలిగే 2500 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చింది.

వారికే ఈ కడుపుమంట

ఈ దేశంలో సబ్సిడీలు రెండు రకాలు. పేదలకిచ్చేవి. పెద్దలకిచ్చేవి. పెద్దలకిచ్చే సబ్సిడీల మీద నోరెత్తరు. చర్చ వుండదు. పేదలకిస్తే మాత్రం వ్యతిరేకిస్తారు. పేదలకిచ్చే ఉచితాలను వ్యతిరేకించేవారు రైతు రుణమాఫీని, రైతు బంధును వ్యతిరేకించడం లేదు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కావాలంటారు. బ్యాంకుల్లో తాము చేసిన అప్పులను ప్రభుత్వాలు

రుణమాఫీ పథకం పెట్టుకొని వేల కోట్ల ఖజానా లూటీ చేసినా ఎవరికీ అభ్యంతరం అనిపించ లేదు. అవి కొన్ని సామాజిక వర్గాలకు అందుతాయి కనుక ఏటా అప్పులు చేస్తారు. ఏటా రుణమాఫీ అడుగుతారు. అలాగే లక్షలకోట్లు బ్యాంకులను, ప్రభుత్వాలను ముంచిన వారిని ఏమైనా చేసారా? వేల కోట్ల రూపాయిల విలువైన కరెంటును సబ్సిడీ ఇస్తున్నారు. దీనివల్ల 86 వేల కోట్ల అప్పులు పెరిగాయి. ఇవన్నీ వ్యవసాయం ఉన్నవారికే! వ్యవసాయం లేని వారికి ఏమిస్తున్నారు, ఎంతిస్తున్నారు స్టేట్ ఫైనాన్సును 56 వేల కోట్ల అప్పులతో ముంచారు. పేదలకు పథకాలు లేకపోతే అరాచకంతో అంతర్యుద్దమైనా జరుగుతుంది. లక్షలాదిమంది ఆకలి చావులకు, వేశ్యా వృత్తి, దోపిడీ దొంగతనాలు హత్యలతో సమాజం అల్లకల్లోలం అవుతుంది. ఎవరికీ శాంతి ఉండదు. భద్రత ఉండదు.

ఉచితాలపై విమర్శ కడుపునిండిన వారి మాట. కడుపు ఎండిన వారి కోసం పెట్టే పథకాలను వారే వ్యతిరేకిస్తున్నారు. ఉచితాలు అని చెప్తున్న సంక్షేమ పథకాలతో బహుళ ప్రయోజనాలున్నాయి. ఐక్య రాజ్య సమితి ఆహార, ఆరోగ్య భద్రత, ఆధునిక విద్య ప్రభుత్వం అందించాలని పేర్కొంది. అందుకు సంబంధించిన చట్టాలు కూడా రూపొందించారు. ఆహార భద్రతలో భాగంగా బియ్యం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, సంక్షేమం కోసం నగదు అందిస్తున్నారు. నగదు తిరిగి మార్కెట్లో సరుకు కొనుగోలుకు వెచ్చిస్తారు. అలా మార్కెట్‌లో చలామణి, తద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇలా డబ్బు రొటేషన్ అవుతూ ఉంటుంది.

దీనికి సమాధానం చెబుతారా?

భారతదేశంలో మెజారిటీ ప్రజల కనీస అవసరాలు తీరాలి. సొంత ఇల్లు. స్థిర నివాసం. ఉన్నవూళ్లో గౌరవప్రదమైన ఉపాధి. ఉచిత విద్య వైద్యంతో పాటు అందరికి ఉపాధి కల్పించడం, నైపుణ్యాలు పెంచడం, మానవ వనరులను సద్వినియోగం చేయడం, సైన్స్, టెక్నాలజీ నిరంతర అభివృద్ధి కోసం పరిశోధనలు జరపడం నేటి ప్రభుత్వాల కర్తవ్యం. ప్రతి ఒక్కరూ సుఖంగా, ఆనందంగా జీవించాలి. 8 గంటల పనికి కనీస జీవన ప్రమాణాల ప్రకారం కూలి కట్టి ఇస్తే ఈ దేశంలో పేదరికమంటూ ఎందుకు ఉంటుంది? ఆధునిక అభివృద్ధి నిరుద్యోగాన్ని సృష్టిస్తున్నది. దానికి సరియైన పరిష్కారం ఆధునిక అభివృద్ధి అందుకుంటున్న వాళ్ళే సూచించాలి.

సాగునీటి ప్రాజెక్టులు, రవాణా సౌకర్యాలు, బొగ్గు గనులు, ఉక్కు గనులు, ఖనిజాల వెలికితీత, అడవుల నరికివేత, పులుల వనరక్షణ మొదలైన వాటి ద్వారా కోట్లాది ప్రజలు నిర్వాసితులయ్యారు. ఆధునిక యంత్రాలు పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల, గ్రామాల్లో పట్టణాల్లో పాత వృత్తుల అవసరం లేకుండా పోయింది. వీరికి మరో రంగంలో సరైన శిక్షణ నైపుణ్యం ఉపాధి కల్పన చేపట్టే యంత్రాంగం లేదు. వ్యవసాయ వృత్తులు కుల వృత్తుల నుండి సగానికి పైగా వృత్తులను చేపట్టేవారు నిరాశ్రయులయ్యారు. ప్రతి ఊరిలో సగం జనాభా నిరుద్యోగులయ్యారు. దాంతో ఉన్నవూరు వదిలి ఇతర ప్రాంతాలకు పట్టణాలకు నగరాలకు వలసపోతున్నారు. వారికి అభివృద్ధి అందడం లేదు. వారి కోసం చేపట్టాల్సిన పథకాలు, ప్రణాళికలు సరిగా అమలు జరగడం లేదు.

ఇదే మధ్యస్థ ఏర్పాటు..

దేశ మంతటా ఈ రోడ్లను వేస్తున్నదెవరు ఈ మురికి కాలువలను తీస్తున్నదెవరు రోడ్లను ఊడుస్తున్నది ఎవరు ఇండ్లల్లో పని చేస్తున్నదెవరు వారందరికీ సరియైన కూలి, జీతం యిస్తే వారు పేదలుగా ఎందుకు ఉంటారు అమెరికాలో పనిమనిషిని పెట్టుకోలేరు. డ్రైవర్‌ని పెట్టుకోలేరు ఎందువల్ల ఎందుకంటే వాళ్ళ జీతాలు కూడా ఇంజినీర్ల జీతాలతో సమానంగా ఉంటాయి. జీతం పెట్టుకుంటే సగం కన్నా ఎక్కువ జీతం వారికే పోతుంది. అందుకోసం తమ పని తాము చేసుకుంటారు. ఇక్కడ అలా అంత స్థాయి జీతాలు ఇచ్చినప్పుడు పేదల పేదరికం అంతమవుతుంది. వారికి అంతంత ఇప్పించలేకనే మన ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం ఇలా మధ్యస్థ ఏర్పాటు చేస్తున్నాయి. సమాజం శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వాలు తమ వంతు కృషి చేయడంలో భాగమే ఈ ఉచిత పథకాలు అని గ్రహించడం అవసరం.

- బి ఎస్ రాములు

తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్

83319 66987

Next Story

Most Viewed