సామాన్యుడికి దూరమవుతున్న రైలు బండి

by Disha edit |
సామాన్యుడికి దూరమవుతున్న రైలు బండి
X

మునుపెన్నడూ లేని విధంగా భారత రైల్వే వ్యవస్థ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. స్వదేశీ గడ్డ మీద తయారైన వందే భారత్ రైళ్లను పట్టాల మీద పరుగులు పెట్టించడం డెబ్భై ఐదేళ్ల స్వతంత్ర భారతానికి గర్వకారణం. భారత రైల్వే వ్యవస్థని స్పృశించకుండా ఆధునిక భారతదేశ చరిత్రని సంపూర్తిగా తెలుసుకోలేం. సామాన్యుడి రథం గా ముద్ర పడిన రైలు బండి సంస్కరణ దిశగా పయనిస్తున్నప్పటికీ అది సామాన్యుడికి అందనంత దూరంగా వెళ్తుంది అన్నది నేటి చేదు వాస్తవం.

విడదీయరాని అనుబంధం

బ్రిటిష్ వారి దోపిడీ కార్యక్రమం కోసం రైళ్లను ఆరంభించినప్పటికి కాలక్రమేణా రైలు భారత సామాన్యుడి జీవనానికి ఊతంగా నిలిచింది. నామమాత్రపు రుసుములతో సుదూరపు ప్రయాణాలకు సైతం రైలు ద్వారా సులభమైంది. నేడు రోడ్లపై ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. నెత్తురోడుతున్న రోడ్లు వాహన చోదకుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలో జరిగే 10 రోడ్డు ప్రమాదాల్లో ఒకటి మన దేశంలో జరుగుతోంది అంటే మన దేశంలో రోడ్డు భద్రత ఎంత దీన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంక్లిష్ట స్థితిలో రైల్వే వ్యవస్థ సురక్షిత ప్రయాణానికి ఊతంగా నిలిచింది. ఇటీవల రైల్వేశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రైల్వే 2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి 25% వృద్ధిని నమోదు చేసింది. ఇవి రైల్వే శాఖ ఎదుగుదల సూచిస్తున్నప్పటికి ప్యాసింజర్ రైళ్లు, సిబ్బంది నియామక ప్రక్రియ తదితర విషయాల్లో మాత్రం తీవ్ర నిరాశను కలిగిస్తుంది.

ప్యాసింజర్ రైళ్లు కనుమరుగు

నామమాత్రపు రుసుముతో సామాన్య ప్రయాణికులకు ఆసరాగా నిలిచిన ప్యాసింజర్ రైళ్లు కోవిడ్ కారణంగా ఇప్పుడు వాటిల్లో ప్రయాణించాలి అంటే ఎక్స్‌ప్రెస్ రైలు రుసుము చెల్లించాల్సిందే. క్లుప్తంగా చెప్పాలి అంటే నాటి ప్యాసింజర్ రైళ్లు నేడు కనుమరుగయ్యాయి. తీవ్ర ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న వారికి ఈ నిర్ణయం గొడ్డలి పెట్టులాంటిది. ఒక సగటు ప్యాసింజర్ రైలు ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తుంది. తినుబండారాలు అమ్మేవారు, నిత్యం పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లే కార్మికులు మొదలైనవారితో కూడిన అసంఘటిత రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. అలాంటి సామాన్యుడి రైలు నేడు కనుమరుగు అవ్వడంతో వారి జీవనోపాధి మీద తీవ్ర ప్రభావం చూపుతోంది.

గంటలకొద్దీ ఆలస్యం

రైలు ప్రయాణ రుసుములు పెరిగినప్పటికీ ప్యాసింజర్ రైలులో ప్రయాణించే వారికి క్రాసింగ్ ఇబ్బందులు తప్పట్లేదు. ప్రత్యేక రైళ్లు, సూపర్ ఫాస్ట్ తదితర రైళ్ల మార్గం కోసం స్టేషన్లలోనే నిలిపేస్తున్నారు. ఒక్కసారి ఆగితే మళ్ళీ బండి ముందుకు ఎప్పుడు కదిలిద్దో లేదో తెలీని పరిస్థితి. నిర్ణీత సమయానికి ప్యాసింజర్ రైళ్లు చేరుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. గంటలకొలది ఆలస్యంతో పాటు ఒక్కోసారి ముందస్తు సమాచారం లేకుండా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం మొదలగునవి వీటి పట్ల పాలకులకు అధికారులకు ఉన్న శ్రద్ధాసక్తులను ప్రతిబింబిస్తుంది.

ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్‌లో రద్దీ నియంత్రణ లక్ష్యంగా రైల్వేశాఖ ప్లాట్‌ఫారం టికెట్ ధరలు అమాంతం పెంచింది. ఇది ఒకింత మంచి చేస్తున్నప్పటికీ వృద్ధులు, దివ్యాంగుల సహాయార్థం స్టేషన్‌కి వచ్చే వారికి ఇది భారంగా మారింది. ప్రయాణ టికెట్ కన్నా ప్లాట్‌ఫారం టికెట్ ధర ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికులు నిట్టూర్పు విడిచే పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు కోవిడ్‌కి ముందు ఉన్న రాయితీలు సైతం ఇప్పుడు లేకపోవడం వృద్ధులకు అదనపు భారంగా మారింది. ఇటీవల రైల్వే స్థాయి సంఘం సీనియర్ సిటిజన్స్‌కి ఇచ్చే రాయితీని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని అని సిఫార్సు చేసినప్పటికీ రైల్వేశాఖ దానికి తిరస్కరిస్తూ ఇప్పటికే అన్ని వర్గాల ప్రయాణికులకు 50% పైగా రాయితీ ఇస్తున్నాం కాబట్టి అదనంగా రాయితీలు ఏం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ రాయితీ నిలుపుదల ఆయా వర్గాల ప్రజలకు పెను భారమే.

ప్రజా ప్రయోజనాలకు ప్రాముఖ్యత

భారీ రుసుములతో ఒక వైపు ప్రజల నడ్డి విరుస్తూ మరో వైపు ఎన్ని కోట్లు ఆదాయం అర్జించిన లాభమేమి! పేద, మధ్య తరగతి ప్రజలకోసం రైల్వేశాఖ లాభాపేక్ష పక్కనపెట్టి రుసుములు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రచించాలి. రైల్వేశాఖకు భారీగా ఆదాయాన్ని సమకూర్చే సరుకు రవాణా విభాగం మీద ఖర్చు భారం పెంచి పాసెంజర్ విభాగంలో రుసుములు చౌకగా ఉండేలా విధానాలు రూపొందించాలి. వృద్దులకు రాయితీని పునరుద్ధరించాలి. తృతీయ స్థాయి ఆరోగ్య సేవల కొరకు పల్లెల నుంచి మెట్రో నగరాలకు వచ్చేవారికి ప్రయాణాల్లో రాయితీలు ఉంటే వారికి ఉపశమనం కలుగుతుంది.

హైదరాబాద్ మెట్రో లాంటి విజయవంతంగా నిర్వహించబడుతున్న మెట్రోల నుంచి రైల్వేశాఖ వారు స్ఫూర్తి పొందాలి. మెట్రో రైలులోకి టికెట్ లేకుండా ప్రవేశించడం అసాధ్యం. అటువంటి పటిష్ట వ్యవస్థల్ని భారత రైల్వే శాఖ అవలంభించాలి. తద్వారా అధిక రుసుములు వడ్డించకుండానే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారు కోకొల్లలు. కొన్ని రాష్ట్రాల్లో టికెట్ అడిగితే ఎక్కడ దాడి చేస్తారో అని సిబ్బంది భయపడే పరిస్థితి ఉంది. ఇటువంటి వాటిల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాలి. టెక్నాలజీని అందిపుచ్చుకుని టికెట్ లేని ప్రయాణానికి అడ్డుకట్ట వేయాలి. వందేభారత్, బులెట్ రైళ్లు ఆహ్వానించదగ్గవి ఐనప్పటికి వాటి మోజులో పడి ప్రస్తుతం ఉన్న రైళ్ళని విస్మరించవద్దు. రైల్వే వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు వచ్చినా, ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా రైలు ప్రయాణం అందరికీ అందుబాటులో ఉంటేనే అసలు లక్ష్యం నెరవేరుతుంది.

జి.వి.సాయికుమార్ గుంత

93911 42989

Next Story