ఉత్సవాలు కాదు విజయాలు కావాలి!

by Ravi |
ఉత్సవాలు కాదు విజయాలు కావాలి!
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల రెండవ తేదీ నుండి 23వ తేదీ వరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏర్పాట్లు బాగానే ఉన్నా, గత పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కారు ఏం సాధించిందో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా నిధులు, నియామకాలు, అంటూ ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ నిధులు ఏమయ్యాయో, నాటి ధనిక రాష్ట్రం నేడు ఎందుకు అప్పుల పాలయ్యిందో సమాధానం చెప్పాలి! ఇంటికో ఉద్యోగం అంటూ నాడు ఇచ్చిన హామీ నేడు ఏమయ్యిందో నిరుద్యోగులకు వివరించాల్సిన అవసరం కూడా ఉంది. వీఆర్ఏలను, జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేశామని ప్రకటించడానికే ఈ దశాబ్ది వేడుకల్ని వాడుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కులవృత్తులకు లక్ష రూపాయల చొప్పున అంటూ బీసీ బంధు పేరిట మరో ఓటు పథకాన్ని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి తప్ప, ప్రస్తుతం ఖాళీ అయిన ఖజానాని నింపే సంస్కరణలు మాత్రం కనిపించడం లేదు. మధ్యాహ్న భోజన కార్మికులకి ఇచ్చే నెలకు వెయ్యి రూపాయలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదంటే నాటి ధనిక రాష్ట్రం నేడు ఎంతగా దివాళా తీసిందో అర్థమవుతోంది.

దళిత బంధులో అక్రమాలు నిజమేనని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకుంటారు కానీ తప్పు చేసినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పరు. ఆసరా పథకంలో అనర్హుల గూర్చి తెలిసినా, ఓట్ల కోసం ఎలాంటి విచారణ చేయడం లేదు. రైతుబంధుతో రోజురోజుకు ఖజానా ఖాళీ అవుతున్నా, సీఎం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు తప్ప, నివారణ చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఒక పక్క ప్రజల్ని సంక్షేమ పథకాల మత్తులో దించిన సర్కారు అన్ని రంగాల్లో నిత్యావసర ధరల్ని విపరీతంగా పెంచేసింది. హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్, తిరిగి అధికారం కోసం కాంగ్రెస్, డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీలు తెలంగాణలో అధికారం కోసం తప్ప అభివృద్ధి కోసం మాత్రం ప్రయత్నించడం లేదు. కనీసం ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఓట్ల జాతర కోసం కాకుండా గత పదేళ్ళలో సాధించిన విజయాలు ఏంటి, వైఫల్యాలు ఏంటి... మిగిలిన లక్ష్యాలు ఏంటి అంటూ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఖజానాని దృష్టిలో పెట్టుకుని శ్రీలంక, పాకిస్తాన్ లాగా రాష్ట్రం దివాలా తీయకముందే రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పసునూరి శ్రీనివాస్,

అడ్వకేట్

8801800222

Also Read: ఎన్నికలే టార్గెట్‌.. దశాబ్ది వేడుకల్లో ఆ స్కీం వాడుకునేలా సీఎం కేసీఆర్ బిగ్ స్కెచ్!

Next Story

Most Viewed