వివాదాల్లో తెలంగాణ పోలీసులు.

by Ravi |
వివాదాల్లో తెలంగాణ పోలీసులు.
X

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు గీత తప్పుతున్నారు. అనేకసార్లు పరిధిదాటి ప్రవర్తిస్తున్నారు. సొంత లాభం కోసం తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు. మహిళలతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రకరకాల కారణాలతో వివిధ హోదాల్లో ఉన్న పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. దీంతో నేరాలను అరికట్టాల్సిన రక్షక భటులే నిందితులుగా మారుతున్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇలాంటి ఘటనల్లో పోలీసులపై పోలీసులే కేసులు నమోదు చేస్తున్నారు. కాగా, ఇందులో కొందరు సస్పెన్షన్లు, శాఖాపరమైన చర్యలను ఎదుర్కొంటుండగా.. మరికొందరు తమ పలుకుబడి ఉపయోగించి చర్యలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది.

అసభ్య ప్రవర్తనతో..

ఆదిలాబాద్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌గా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో.. ఇటీవల మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో ఇందల్వాయిలో ఎస్ఐగా పనిచేసిన ఓ అధికారిపై అదే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. పెండ్లయి, భార్యతో విడాకులు తీసుకున్నా.. ఆ విషయాలను గోప్యంగా ఉంచి తనతో సన్నిహితంగా ఉన్నాడని ఓ యువతి అతడిపై ఫిర్యాదు చేసింది. అలాగే నిజామాబాద్ మండలంలోని ఓ గ్రామంలో నిందితురాలికి కోర్టు సమన్లు ఇవ్వడానికి వెళ్లిన రూరల్ ఠాణా కానిస్టేబుల్ 15 ఏండ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదుతో అతడ్ని సస్పెండ్ చేశారు. అలాగే భూపాలపల్లి జిల్లా వీఆర్‌లో సీఐ‌గా ఉన్న ఓ అధికారి లైంగిక ఆరోపణల్లో పోక్సో చట్టం కింద కేసు నమోదై కటకటాల్లోకి వెళ్లారు. మహిళపై అత్యాచారం చేసిన కేసులో టాస్క్‌ ఫోర్స్‌‌లో పనిచేసిన ఇన్స్‌‌పెక్టర్ సైతం సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.

సివిల్ వివాదాల్లోనూ..

మరోవైపు సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని కోర్టుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. కొందరి ఖాకీల తీరు మారడం లేదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ హెడ్ కానిస్టేబుల్ స్థల వివాదం కేసులో ఆయనకు మద్దతుగా పోలీసు ఉన్నతాధికారులు సైతం సివిల్ మ్యాటర్స్‌లో జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇతరుల స్థలాన్ని కబ్జా చేసి బౌండరీ కట్టుకున్నాడని, స్థల వివాదంపై విచారణ చేపట్టడానికి వచ్చిన మున్సిపల్ అధికారులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. సిబ్బంది విధులకు ఆటంకం కలిగించాడని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో సదరు హెడ్ కానిస్టేబుల్‌పై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల విషయంలో వచ్చిన వివాదంలో చిక్కడపల్లి మాజీ డీఐ (డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌)పై కేసు నమోదైంది. రూ. 100 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు విశ్రాంత ఉద్యోగిపై మేడ్చల్‌కు చెందిన ఓ ఎస్ఐ విష ప్రయోగం చేయడం సంచలనం సృష్టించింది. 2023లో కేవలం హైదరాబాద్ పరిధిలోనే 50 మంది పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఒకరిని డిస్మిస్ చేశారు.

ఇంకా అనేక వివాదాల్లో..

స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ)లో ఏఎస్ఐగా పనిచేసే ఓ వ్యక్తి బోగస్ పాస్ పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించాడని హైదరాబాద్ సీఐడీ ఆఫీసర్లు అతడిని అరెస్ట్ చేశారు. నకిలీ అడ్రస్‌లతో పాస్‌పోర్టుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్న వారికి హెల్ప్ చేశాడన్నది ఆయనపై అభియోగం. హైదరాబాద్ లోని ప్రజా భవన్ బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును తప్పించడానికి సహాయం చేశాడన్న ఆరోపణలపై బోధన్ సీఐ ప్రేమ్ కుమార్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు కూడా నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వంటి పోలీసు ఉన్నతాధికారులు జైలుపాలయ్యారు. ఇంకా అనేక మంది విచారణను ఎదుర్కొంటున్నారు.

సరైన చర్యలు తీసుకోకపోవడంతో..

ఖాకీ డ్రెస్సులో కొందరు పోలీసులు దౌర్జన్యాలు, దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్ తగాదాల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తలదూర్చుతున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. కొందరు పోలీసులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ సెటిల్ మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అలాంటి పోలీసులపై డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి.

-ఫిరోజ్ ఖాన్,

సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

96404 66464Next Story

Most Viewed