ఆరెకటికలకు ఇంత అన్యాయమా?

by Disha edit |
ఆరెకటికలకు ఇంత అన్యాయమా?
X

తెలంగాణ రాష్ట్రంలో అరెకటికలు 20 లక్షల మంది ఉంటారని అంచనా. నాయకులు వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని పార్టీ కార్యకర్తలుగానే చూస్తూ, అవసరానికి వాడుకునే బానిసలుగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆధిపత్యానికి ఎదురుతిరిగి బయటకు వచ్చినట్లయితే ఆధిపత్య కులాల చేతులలోని నాయకత్వాలు తోక ముడుచుకుని పోవాల్సిందే. ఆరెకటిక వర్గాలు రాజ్యాధికారంలో వాటా, వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకై ఎప్పటి నుంచో పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రంలో ఇంత వివక్ష చూపడం సరికాదు.

జనాభా ఎంతో తెలియదు..

ఇప్పటికే ఆరికటికల విద్య కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హస్టల్స్ కాలగర్భంలో కలిసిపోయాయి. అలాగే యాటలు మండీల నుంచి తెచ్చే సమయంలో ప్రమాదానికి గురైతే వాటికి నష్టపరిహారం అందించడం లేదు. ఇప్పటికే హక్కుల కోసం రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఎన్నో చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మా జనాభా ఎంతో అధికారికంగా బహిర్గతం చేయలేదు. ఈ విషయమై ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం శూన్యం. చదువు కోసం సామాజిక న్యాయం కోసం అరెకటికల వర్గాల ఆత్మగౌరవం కోసం తలపెట్టిన బస్సు యాత్ర, అసెంబ్లీ ముట్టడి, ధర్నాలు చేయడంతో పాటు సరూర్‌నగర్‌లో రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టి ప్రభుత్వం ముందు ఎన్నో డిమాండ్లు ఉంచాము అయినా వాటికి న్యాయం జరగడం లేదు. ప్రభుత్వం ఆరెకటిక ప్రజలకు రాజ్యాంగ ఫలాలు దక్కాలంటే వారికి విద్యా, వైద్యం ఆర్థికంగా ఉండేటట్లు చూసుకోవాలి. బీసీ ఆత్మగౌరవ భవనాలు అందరి కులాలకు ఇచ్చినట్లుగానే ఇచ్చారు కానీ ఆర్థిక రాజకీయాలకు సంబంధించి మాత్రం మా జాతిని తుంగలో తొక్కారు. అధునాతన మటన్ మార్కెట్ భవనాలు, స్లాటర్ హౌస్ నిర్మించడానికి నిధుల కొరత ఉందని దాటవేసే ధోరణిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి... ప్రగతి భవన్‌లు, ఇతర భవనాలు నిర్మించడానికి నిధులు ఎక్కడివి? కొత్త సచివాలయం నిర్మించడానికి సుమారు 650 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం, మా భవనాలు మంజూరు చేయకుండా తాత్సరం చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి? మా డిమాండ్స్‌కి ఇతర సంఘాలు ఆరెకటిక కులానికి మద్దతు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టించుకునే బాధ్యత లేదా?

మేమెంతో మాకంతా

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాలకు, సంక్షేమ హాస్టళ్ళకు మటన్ సప్లై చేసే కాంట్రాక్టును ఎలాంటి రుసుము లేకుండా జీఓ తెచ్చి అరెకటికలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ టెండర్‌ను కులవృత్తులకు సంబంధం లేని వారికి కేటాయించడం న్యాయమా? ఇదేనా అరె కటికల అభివృద్ధి అంటే. రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు పెంచిన చరిత్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఇంతవరకు అరె కటికలకు సహాయం చేసిన చరిత్ర మాత్రం లేదు. రాజ్యాధికారంలో వాటా కోసం ప్రతీ పార్టీలో మెజారిటీ కార్యకర్తలు ఆరెకటిక వర్గానికి చెందిన వారు ఉన్నా, వారు గెలిచే స్థానంలో వారిని నియమించడం లేదు. ఇప్పటికైనా ప్రతి రాజకీయ పార్టీ అరెకటికలకు స్పష్టమైనటువంటి రాజకీయ విధానం ప్రకటించాలి లేకుంటే రాజకీయ పార్టీలను, పాలకవర్గాలను ఏకాకి చేయడానికి ఆరెకటికలు వెనుకాడరని పార్టీలు గుర్తించుకోవాలి. మేమెంతో మాకు అంత అనే నినాదం ప్రకారం ఎవరెవరి వాటా వారికి అందినప్పుడు ఈ రకమైన సమస్యలు రావు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు కూడా లేవు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరెకటిక కుల గణన చేసి మా లెక్కను బహిర్గతం చేయాలి. అలాగే మాకు ఉపాధి కల్పించే దిశగా మటన్ టెండర్లు కేటాయించాలని, అలాగే వైన్ షాపులో రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

మల్ల్కేడికార్ కొండల్

తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక ట్రస్టు సభ్యులు

9010779981

Also Read...

తిరుపతి లడ్డు గిఫ్ట్ ప్యాక్ చేయాలి



Next Story