గన్నులు పట్టించిన గద్దర్ పాట..

by Ravi |
గన్నులు పట్టించిన గద్దర్ పాట..
X

ద్దర్ పాట ఒక ఉప్పెన.. ఒక సునామీ.. ఒక తుఫాన్.. ఆయన పాట తుపాకులనే పట్టించింది. ఒక చైతన్య కెరటమై విప్లవానికి పాట వెన్నుదన్నుగా నిలిచింది. బాంచన్ బతుకుల విముక్తి కోసం సాయుధ పోరును నడిపించడానికి పాట సైరన్ ఊదింది. దున్నేవాడికే భూమి, నూతన ప్రజాస్వామ్య విప్లవం వర్ధిల్లాలి ఆశయసాధనలో 50 ఏళ్లుగా పీపుల్స్ వార్ పార్టీ తలపెట్టిన భారత రైతాంగ పోరాట చరిత్రలో గద్దర్ పాట ఒక బుల్లెట్ ..ఒక డైనమేట్.. ఆ పాట వేలాదిమందిని తుపాకుల బాట పట్టించింది. సమసమాజ స్థాపన కోసం ఆయన పాట ఓ పెద్ద యుద్ధాన్ని నడిపింది. నడిపిస్తూనే ఉంది. విప్లవ మార్గాన కార్యాచరణలో పాట ముందున్నది, పాట తిరుగుబాటు నేర్పింది. ఏకంగా జననాట్యమండలి దళాలను ఏర్పాటు చేసి, విముక్తి పోరాటానికి గద్దర్ పాట ఊపిరి పోసింది. మావోయిస్టు పార్టీ రహస్య ఎజెండా ద్వారా జనసభను ఏర్పాటు చేసి అసమానతలు లేని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం గద్దర్ ధూంధాం ఆట, పాట ప్రాణం పోసింది. గద్దర్ ధూమ్ ధాం కార్యక్రమాలన్నీ తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ బలపడేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇది కాదనలేని నిజం. 74 ఏళ్ల జీవితకాలంలో గద్దర్‌ను చంపడానికి రాజ్యం 100సార్లు ప్రయత్నించింది. నల్ల దండు గ్రీన్ టైగర్స్ ముఠాలు గద్దర్ శరీరంలో తూటా దించాయి. ఆ తూటాకు 25 ఏళ్లు నిండాయి, ఆయన పాటకు 50 ఏళ్లు నిండాయి. శ్రీకాకుళం సీతంపేట నుండి మొదలైన తిరుగుబాటు పాట జగిత్యాల జైత్రయాత్ర.. కల్లోల కరీంనగర్ వరకు సాగింది. నాటి దొర దౌర్జన్యాల పాట నుండి తెలంగాణ ఉద్యమంలో శాంతి యాత్ర కోసం గద్దర్ చేసిన కృషి చరిత్రలో సుస్థిరం. ఆదివారం తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి జరుపుతున్న సమయంలోనే, అంతటి మహోన్నత నాయకుడు గద్దర్ ఈ లోకం విడిచి వెళ్లారు. జయశంకర్ సార్ అక్షరాలు, గద్దర్ పాటలు అమరం.. సజీవం ..!

విప్లవకారుడిగా 40 ఏళ్లు..

గద్దర్ పేరు.. ఆయన పాడిన జననాట్యమండలి జనం పాటలు.. తెలుగు నేల కాదు యావత్తు భారతదేశం పీడిత తాడిత ప్రజలకు ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చిన పాట.. వివిధ భాషలలోనూ దొరల దౌర్జన్యాన్ని ఎదిరించడం నేర్పిన పాట. యువకులను తుపాకీ పట్టించిన పాట.. ఎత్తిన తుపాకీ దించకుండా ప్రాణం పోయేంతవరకు విప్లవాన్ని వీడకుండా.. ముందుకు నడిపించిన పీడితుల పాటకు గద్దర్ గొంతు.. చిరునామాగా మారింది. గద్దర్ తన గొంతుతో పాటలలో ఆహో... అని పలికితే సభలో ఉన్న లక్ష మంది ఓహో అంటూ శృతి కలిపిన సందర్భాలెన్నో. 20వ శతాబ్దంలో ఇలాంటి ప్రజావాగ్గేయకారుడు పుట్టలేదని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, ఒరిస్సా ఇలాంటి పేదరికం అధికంగా ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా అటవీ ప్రాంతాన్ని అనుకొని ఉన్న పల్లెల్లో గద్దర్ పేరు తెలియని వారు లేరు.

మెదక్ జిల్లాకు చెందిన గుమ్మడి విట్టల్ నక్సల్బరీ పోరాటానికి ఆకర్షితులై శ్రీకాకుళం పోరాటంలో విప్లవ రచయితల సంఘం ఏర్పాటులో జననాట్యమండలి సృష్టించిన పాటకు గద్దర్ ప్రాణం పోశారు. అక్కడినుండి మొదలైన విప్లవాన్ని పాటతో ఉరకలు పెట్టించారు. గద్దర్ పాడిన పాటకు ఉత్తేజితులై, ఆకర్షితులై వందలు, వేల సంఖ్యలో యువతీ యువకులు అడవి బాట పట్టారు. కొందరు దళ సభ్యులైతే తాము గద్దర్ పాటలకు ఆకర్షితులమై పార్టీలో చేరామని చెప్పేవారు. అదే పాట తెలంగాణ ఉద్యమంలో గద్దర్ గొంతెత్తి ధూంధాం ఆటతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. ప్రతి పల్లె కళాకారుడు ధూంధాం పేరిట గద్దర్ స్ఫూర్తిగా గోసి గొంగళి కట్టుకొని నృత్యం చేసి కోట్లాదిమంది గుండెల్లో గద్దర్ తన పాటతో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. విప్లవకారుడిగా గద్దర్ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్తానాన్ని కొనసాగించారు. అమరవీరుల బంధుమిత్రుల కమిటీలో, ప్రభుత్వంతో శాంతి చర్చల సమయంలోను గద్దర్ పోషించిన పాత్ర మరపురానిది. ఎందుకో ఆయన పీపుల్స్ వార్ పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో ప్రజలకు దగ్గరయ్యారు. తెలంగాణ సాధనలో గద్దర్ పాట ఎంతో కీలకం, తెలంగాణలో రాష్ట్ర సాధన కోసం గద్దర్ తలపెట్టిన శాంతియాత్ర విశేష ప్రాధాన్యత సంతరించుకున్నది. తెలంగాణలోని బొగ్గు గనుల ప్రాంతాన్ని కలుపుతూ గద్దర్ యాత్రను తలపెట్టారు. ఇది ఉద్యమానికి ఎంతో ఊపు ఇచ్చింది.

పాటతో విప్లవం తెచ్చి

దొరల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, సర్కార్ దౌర్జన్యం పేదల పక్షాన నిలిచిన పీపుల్స్ వార్ పార్టీకి గద్దర్ పాటగా మారారు. జననాట్య మండలి పది రాష్ట్రాలలో విస్తరించేలా గద్దర్ కృషి చేశారు. గద్దర్ గురించి ఆయన పాటల గురించి చెప్పడం అతిశయోక్తి. వందనాలు వందనాలు అంటూ వీరుల త్యాగాలను కీర్తించిన పాటలు. దొర ఏందిరా వానీ పీకుడు ఏందిరా పాటలు.. పాటతో గన్నులు పట్టేలా చేశారు. తెలుగు రాష్ట్రాలను యుద్ధభూమిగా మార్చేశారు. ఒక చైతన్య కెరటమై పాట 40 ఏళ్లు పెరిగింది. శ్రీకాకుళం పోరాటం నుండి కరీంనగర్ రైతాంగ పోరాటాల వరకు... నక్సల్బరీ స్ఫూర్తిని ప్రజల్లో నింపారు. గద్దర్ పాట 40 ఏళ్ల యుద్ధాన్ని నడిపింది. ఆ యుద్ధంలో వేలాదిమంది అమరులయ్యారు. అమరుల కోసం మళ్లీ బంధుమిత్రుల కమిటీ ఏర్పడింది. లీగల్‌గా ఏర్పడ్డ బంధుమిత్రుల కమిటీలోని కీలక పాత్ర పోషించారు. ఇలాంటి గొప్ప నాయకుడు తెలంగాణ ఉద్యమంలో ముందు నడిస్తే వేలాదిమంది ఉద్యమంతో మమేకమయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు అనుకున్న తెలంగాణ సాధించలేకపోయారని ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్లీ ఉద్యమాన్ని చేపడతామని పిలుపునిచ్చారు.

వందల సార్లు ఆయనపై హత్యాయత్నం జరిగింది. నల్ల దండు ముఠా బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ ముఠాలు ఆయనను మట్టు పెట్టేందుకు ప్రయత్నించారు. ఓసారి ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు కూడా. ఆయన ఇప్పటికీ విప్లవాన్ని విడలేదు పాటను మరవలేదు. ప్రజల పాటలే తన ప్రాణంగా చెప్పుకున్న వాగ్గేయకారుడుగా చరిత్రలో మిగిలిపోయారు.

తెలంగాణకు ఊపిరి పోసిన పాట

పాటలో ప్రశ్నించే పాట ఉంటుంది, జోల పాట ఉంటుంది, జో కొట్టే పాట ఉంటుంది. చెంచాగిరి కొట్టే పాట ఉంటుంది. కానీ గద్దర్ పాటలు ఒక విప్లవాన్ని తెచ్చాయి. సామాజిక ఆర్థిక అసమానతలపై దొర దౌర్జన్యాలపై బరిగీసి నిలిచిన పాట గద్దర్‌ది మాత్రమే. ఏ టైపు పాట అయినా, ప్రజా కళాకారులు అందరికీ గద్దర్ ఆదర్శం, ఆయన పాటలే ఆయన స్టైలే దిక్కు. తెలుగు రాష్ట్రాలలో ఆయన లక్షలాది మైళ్ళు పాటతో పాటు ప్రయాణించేశారు. పేద ప్రజల గుండెలకు ధైర్యాన్నిస్తూ, చైతన్యాన్ని కలిగిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారారు. తెలంగాణ ఉద్యమం ఒడుదుడుకుల గురైనప్పుడు పాట అందుకున్న గద్దర్ ధూంధాంతో ఊపిరి పోశారు. జీవితాంతం ఓట్ల బహిష్కరణకు కట్టుబడిన గద్దర్ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‌కు ఓటు వేయాల్సిందిగా పిలుపునిచ్చారు. బహుశా ఇప్పుడే మావోయిస్టు పార్టీకి గద్దర్ దూరం అయి ఉండొచ్చు. అప్పటినుండి ఆయన గుళ్లు, గోపురాలు తిరగడం. వివాదానికి కారణమయ్యారు. 50 ఏళ్ల విప్లవోద్యమంలో, విప్లవ కార్యాచరణలో ఎన్నో త్యాగాలకు ఓర్చి పేద ప్రజలకు నాయకుడయ్యారు. అలాంటి గద్దర్ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుండి పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. ఒక దశలో కేసీఆర్ నిర్ణయాలతో అసహనానికి గురై కేసీఆర్ పైనే పోటీ చేస్తానని హెచ్చరించారు కూడా. ఆయన కలలుగన్న విప్లవం నుండి పక్కకు తొలగి ఇప్పుడు ప్రజాస్వామ్య తెలంగాణ సాధన దిశగా ఎన్నికలను నమ్ముకోవడం మావోయిస్టు సానుభూతిపరులకు కోపాన్ని తెప్పించింది.

ఎప్పటికీ పాట సజీవమే..

మానవమాత్రుడిగా కొన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ, గద్దర్ త్యాగాలను ఎవరు కాదనలేరు. ఆయన గొప్పతనాన్ని తెలుగు ప్రజలు భారతదేశంలో పీడిత ప్రజలు గుర్తుంచుకునే ఉంటారు. కోట్లాదిమంది గుండెల్లో గుర్తుండిపోయేది గద్దర్ పాట, గద్దర్ సాహసం, తిరుగుబాటు అమరత్వం అజరామరం.. వయోభారంతో వచ్చిన వ్యాధి కారణంగా గుండెపోటుకు దారితీసి చివరకు ఆయన తన పాటను పోరాట యోధులకు వదిలి అనంత లోకాలకు వెళ్లారు. రాజ్యహింస తూటాలకు ఎదురు నిలిచిన ఆయన గుండె ఆదివారం ఆగిపోయి జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. గద్దర్ అమర్ హై, సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఈ దోపిడీ వ్యవస్థ అంతమయ్యేవరకు గద్దర్ పాట సజీవమే. ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. తెలంగాణ కళాకారులు గద్దర్ పాటపైనే పాట రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ గొంతులు ఇకముందు గద్దర్ గొంతును, పాటను అనుకరిస్తూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు..

కట్ట నరేంద్రచారి,

సీనియర్ జర్నలిస్ట్.

63030 73400

Next Story

Most Viewed