పాటతో.. ప్రశ్నించే గొంతు

by Ravi |
పాటతో.. ప్రశ్నించే గొంతు
X

పాట, మాట అయి పాలకులను ప్రశ్నించే ఆ గళం ఊపిరి విడిచింది. భారతదేశంలోనే ఉద్యమాలు, పోరాటాలలో ప్రత్యేక గొంతుగా ప్రజల పక్షంలో నిలబడి అయిదు దశాబ్దాల పాటు పోరాడిన గద్దర్ చివరి ఊపిరి వదిలారు. ప్రజా యుద్ధనౌక గళం మూగబోయింది. పొడుస్తున్న పొద్దు మీద అనే పాట పాడిన ఆ గొంతు మూగబోయింది. 'మా భూమి' చిత్రంలో బండెనక బండి కట్టి.... పదహారు బండ్లు కట్టి అనే పాట.. అమ్మ తెలంగాణమా! అని నినదించిన ఆ గొంతు ఇప్పుడు మనకు వినబడదు. కనబడదు. అపోలో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న తరువాత అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన మృత్యువుతో పోరాడి, పోరాడి అలసిపోయారు. 1997 ఏప్రిల్ 6న ఖమ్మంలో గద్దర్‌పై పోలీసుల కాల్పులు జరిగాయి. అప్పుడు ప్రాణాపాయంతో బయటపడినప్పటికి ఆయన శరీరంలో బుల్లెట్ మాత్రం.. ఆయన ఊపిరి వదిలే వరకు ఆయన వెంటే ఉంది. శరీరంలో బుల్లెట్ ఉంచుకొనే ఆయన 26 ఏళ్లు జనం కోసం బతికారు.

ఆశయం ఫలించకుండానే

1975లో కెనరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తూ ప్రజా ఉద్యమంలోకి వచ్చిన గద్దర్ 1980లలో జననాట్యమండలిలో చేరారు. 1949లో మెదక్ జిల్లా తూప్రాన్ లోని లచ్చమ్మ-శేషయ్య దంపతులకు జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్రావు. ఆయనను అలుపెరగని విప్లవోద్యమ నాయకుడు, కళాకారుడు, రచయిత, మానవతావాదిగా పేర్కొనవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల తెలుగు ప్రజలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌‌గడ్, జార్ఖండ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలకు గుర్తెరిగిన మడమతిప్పని నాయకుడు. 1987లో కారంచేడులో దళితుల హత్యోదంతంపై నిర్విరామంగా పోరాటం చేశాడు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాటతో పాటు, అమ్మ తెలంగాణమా అనే పాటలను తన గొంతుతో ఆయన ఎక్కడికి వచ్చినా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అలసటగా ఉన్నా.. పాడే వారు, కదం తొక్కే వారు. గోచి, గొంగడి, చేతిలో కర్రకు ఎర్ర జెండా పెట్టుకొని ఆటా పాటలతో కనిపించే గద్దర్‌ను అనుకరించే కళాకారులు వేలాది మంది ఉన్నారు. గద్దర్ శిష్యులకు లెక్కేలేదు. అచ్చం గద్దరన్న గొంతు నీది అంటే మురిసిపోయే వేల కళాకారులు నేడు కంటతడి పెడుతున్నారు.

1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంతో పాటు, 1990 తర్వాత స్వరాష్ట్రం సాధించే వరకు జరిగిన ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకంగా పేర్కొనవచ్చు. ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆ తదుపరి కూడా పలు మార్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని గద్దర్ కలిశారు. పలు సభల్లోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడడం, పాటలు పాడడం జరిగింది. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన ఇటీవల ఢిల్లీలో పేర్కొన్నారు. దాని ద్వారా ఎన్నికల్లోకి రావాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ ఆశయం ఫలించకుండానే గద్దరన్న మనల్ని వీడిపోయారు. ప్రభుత్వం నుంచి నంది అవార్డును సైతం తిరస్కరించిన గద్దరన్న మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటుగా పేర్కొనవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలను ధారాళంగా మాట్లాడగలిగే, డ్రాఫ్ట్ చేయగలిగే, పాటలు రాసి పాడగలిగే కవి, గాయకుడు గద్దర్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివారు. విద్యాభ్యాసం నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో పూర్తయింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంటూ వచ్చింది. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలున్నారు.

నల్ల నేలంటే ఇష్టం

74 సంవత్సరాల వయసులో ఊపిరి విడిచిన గద్దరన్నకు సింగరేణి ప్రాంతంలోని నల్ల నేలంటే ప్రాణం నల్ల నేలలో గోలేటి నుంచి మందమర్రి, బెల్లంపల్లి, గోదావరిఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు వరకు రెండు దశాబ్దాల క్రితమే గద్దర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిని కాపాడుకునే లక్ష్యంతో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంతో పాటు సింగరేణి ప్రాంతంలో కార్మికులను విప్లవకారులను రాత్రికి రాత్రి ఇంటి నుంచి పట్టుకెళ్లి పోలీసులు నకిలీ ఎన్ కౌంటర్ల కింద కాల్చి చంపిన సందర్భంలో స్వయంగా రంగంలో దిగి నకిలీ ఎన్ కౌంటర్లను గద్దర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఓపెన్ కాస్ట్ బొగ్గు బావులను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగినప్పుడల్లా నల్లనేలకు చేరుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. ఓపెన్ కాస్ట్ బొగ్గుబావుల్లో తెలంగాణ ప్రాంతం గ్రామాలు, వ్యవసాయ భూములు బొందల గడ్డలుగా మారుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు పౌరహక్కుల నేతలు, కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో అక్కడికి వచ్చి కార్మిక వర్గానికి మద్దతు పలికారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు తలపెట్టిన సింగరేణి వ్యాప్త ర్యాలీలు, సభల్లో తెలంగాణకు మద్దతునిచ్చిన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పాలుపంచుకున్నారు. నల్లనేలలోని బొగ్గుగని కార్మికుల, కళాకారుల ఇండ్లలో గదర్‌తో దిగిన ఫోటోలు ఇప్పటికి దర్శనం ఇస్తాయి. ఇక్కడి కళాకారులకు ఆయన ఒక స్పూర్తిదాతగా పేర్కొనవచ్చు.

ఆ గళంలో గద్దర్..

ఇటీవలనే ధూంధాం కళాకారుడు, ధూంధాం నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించిన అంతడుపుల నాగరాజు చెల్లి వివాహానికి గద్దరన్న జూన్ 8న మందమర్రి, మంచిర్యాలకు వచ్చి వెళ్లారు. ఆ సందర్భంగా నేను ఆయనతో చాలా సేపు మాట్లాడడం, గడపడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాలపై చర్చించారు. తెలంగాణ పోరాడి తెచ్చుకున్నప్పటికి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దరన్నతో వ్యక్తిగతంగా ఒక జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాల విడదీయలేని అనుబంధం ఉంది. మొత్తంగా ఈ దేశానికి, తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు, సింగరేణి ప్రాంతానికి గద్దర్ ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. తన జీవితం మొత్తంగా రాష్ట్రంలోని ప్రతి ప్రాంత వ్యక్తులను తమ కుటుంబంగా భావించేవారు. ఎక్కడికి వచ్చినా ఆయన ఎలా ఉన్నా తప్పనిసరిగా కనిపిస్తే చాలు కౌగిలించుకొని యోగక్షేమాలు అడిగే వారు. ఇప్పుడు ఆ గొంతు మూగబోయింది. విద్యుత్‌లా ఊహించే ఆ ఊహా తరంగాలు నిజం మాట్లాడే ఆ ప్రజల గొంతు ఇక మనకు వినిపించదు. కనిపించదు. అయితే రికార్డులలోనే మనం ఆయనను చూసుకుంటాం.. వింటాం. గద్దరన్న దేశ్ కే దిల్మే అభి జిందాహై....పాడే, ప్రశ్నించే, నిలదీసే గళంలో గద్దర్ అన్న బతికే ఉంటాడు... అమర్ రహే గద్దరన్న! ఈ, మీ నల్ల నేల జర్నలిస్ట్ శిరస్సు వంచి మీకు నివాళులు అర్పిస్తున్నాడు. నల్ల నేలలో మీరు చిరస్మరణీయులు!

(ప్రజా గాయకుడు గద్దర్‌కు అశ్రు నివాళి)

ఎండీ మునీర్,

సీనియర్ జర్నలిస్ట్

99518 65223

Next Story

Most Viewed