మేం చదువు చెప్పొద్దా?

by Disha edit |
మేం చదువు చెప్పొద్దా?
X

నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని ఉపాధ్యాయులకు కుంటిసాకులతో ఛార్జి మెమోలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో, కొన్ని పత్రికలలో ప్రచురితమైన వ్యాసంతో విభేదించిన కొందరు నన్ను టార్గెట్ చేయడం జరిగింది. అలాంటి టార్గెట్లకు, విమర్శలకు తోకముడిచే తత్వం నా రక్తంలో లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా అభిప్రాయాలను విశ్లేషించడం ద్వారానూ, ఏకీభవించడం ద్వారానూ, విమర్శించడం ద్వారానూ పంచుకున్న మిత్రులకు ధన్యవాదాలు. ఏది ఏమైనా ఆయా వ్యక్తుల వ్యాఖ్యలకు, వ్యాఖ్యానాలకు ఈ సందర్భంగా సంక్షిప్తంగా సమాధానం ఇవ్వదలచుకున్నా.

ఇన్ని డ్యూటీలా?

ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత ఏంటి? చదువు చెప్పడం. ఆ ఒక్కపనికి ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నవో ఒకసారి గమనించాల్సిన అవసరం ప్రతి పౌరుడిపైనా ఉంది. చదువు చెప్పడం కోసం ఉన్న సమయంలో ఇతరత్రా పనులు ఎలా అడ్డంకిగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి!

1. పాఠశాలకు వెళ్ళగానే బాత్రూంస్ ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి 2. ఉపాధ్యాయులు హాజరు వేయాలి 3. విద్యార్థుల హాజరు వేయాలి. ఆన్లైన్ చేయాలి 4. మధ్యాహ్న భోజనం కోసం బియ్యం, కోడిగుడ్డు జమాఖర్చులు రాయాలి 5. పిల్లలకు వైద్య పరీక్షలు చేయించాలి. 6. పిల్లల నమోదుకు ప్రోగ్రాం. 7. గైర్హాజరైన పిల్లల ఇళ్లకు వెళ్లడం 8. వివిధ రకాల శిక్షణలకు హాజరు కావాలి. 9. కార్యాలయంలో జరిగే సమావేశాలకు హాజరు కావాలి 10. రోజువారీగా అడిగే సమాచారాన్ని కార్యాలయానికి అందజేయాలి. 11.షూ కొలతలు తీయాలి 12. మధ్యాహ్న భోజనం బిల్లులు చేయాలి 13. నాడు నేడు పర్యవేక్షణ 14. సిమెంట్, స్టీలు ఇటుకలు కొనుగోలు స్టాక్ నమోదు 15. ఇసుక లెక్క 16. పనులు పూర్తి చేయించడం 17. చెక్కులపై పేరెంట్ మేనేజ్మెంట్ సంతకాల కోసం తిరగడం 18. పనుల ప్రగతి నివేదికలు ఆన్లైన్ చేయడం 19. యూనిఫామ్ కుట్టించడం 20. పాఠ్యపుస్తకాలు తెచ్చుకోవడం 21. జగనన్న కిట్ల పంపిణీ లెక్కలు రాయడం 22. తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం. 23. ఎన్నికల శిక్షణలకు హాజరు కావడం 24. ఎన్నికల నిర్వహణ 25. కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ అయ్యే కార్యక్రమాలు చేపట్టడం 26. అపుడప్పుడూ ర్యాలీలు 27. ప్రతినెలా సబ్జెక్ట్ టీచర్స్ ట్రైనింగ్‌కు వెళ్లడం 28. ఎమ్మార్సీ నుంచి 4 ఎఫ్.ఎలు, 2 ఎస్.ఏ ల ప్రశ్నాపత్రం తయారి 29. పత్రాలను తెచ్చుకోవడం 30. యూ డైజ్ పూర్తి చేయడం 31. వార్షిక ప్రణాళికలు తయారు చేయడం 32. పాఠ్య ప్రణాళికలు రాయడం 33. నోటు పుస్తకాలు దిద్దడం 34. వర్క్ బుక్ పూర్తి చేయించడం 35. డైరీ రాయడం 36. నోట్స్ తయారు చేసుకోవడం 37. పరీక్షల నిర్వహణ 38. మూల్యాంకనం 39. మార్కులు ఆన్లైన్ చేయడం 40. ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం 41. రకరాల అకౌంట్స్ నిర్వహణ 42. వివిధ రకాల రికార్డుల నిర్వహణ 43. అమ్మ దీవెన నగదు పంపిణీ రికార్డు 44. పోలియో మందు పంపిణీ 45. కంటి పరీక్షలు 46. అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ 47. శానిటరీ నాప్కిన్స్ పంపిణీ 48. వాట్సాప్ గ్రూపుల నిర్వహణ 49. ఎగ్జిబిషన్లు 50. స్కూల్ గేమ్స్ 51. జాతీయ పండుగల నిర్వహణ.

చదువు చెబుతాం...కానీ సమయమెక్కడ?

వీటికి తోడు వానొచ్చినా, బందులు జరిగినా నేరుగా బడిమూత. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు బస్సు, ఇతర వాహనాల్లో వచ్చే రవాణా సౌలభ్యం ఉండదు. ఇలా చెబుతూ పోతే ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు పట్టని నిశీధి రాత్రులెన్నో! చదువు చెప్పలేక, చెప్పడం చేతకాక కాదు. చెప్పే సమయం తమ చేతుల్లో లేక. చెప్పేందుకు స్వేచ్ఛ లేక. ప్రయివేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు బోధన తప్ప మరి ఇంత పని వుంటుందా? ఉన్నత పాఠశాలలో కొన్ని ఇబ్బందులు ఉంటే ప్రైమరి సూళ్ళల్లో మరెన్నో అవస్థలు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు మరో పాఠశాలకు డెప్యుటేషన్‌పై వెళ్ళాలి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనేతర పనుల ఒత్తిడి అంతా ఇంతా కాదు. బండెడు పనులతో బడికి వెళ్ళాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇవన్నీ తెలియని పెద్దమనుషులు, వ్యవస్థల ఉద్దారకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. గత ఏడాది విడుదలైన జీవో 117, జీఓ 128 ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని ఛిద్రం చేశాయి. పెద్దయెత్తున డ్రాపౌట్లకు కారణమయ్యాయి. ఉపాధ్యాయ పోస్టుల రెట్రెంచ్మెంట్‌కు కారణమయ్యాయి. పసిపిల్లల తీయని గొంతుకలతో పరిఢవిల్లుతున్న పాఠశాలలు మూతపడడానికి హేతువులయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల నుండి లక్షలాదిగా విద్యార్థులు ప్రైవేటు వైపుకు తరలి వెళ్లేందుకు దోహదపడ్డాయి. అమ్మఒడి డబ్బు ప్రైవేట్ స్కూళ్లకు రాజయోగం పట్టిస్తోంది. ఈ దృగ్గోచర సత్యాన్ని ధృవీకరించిన సంఘాలు అణిచివేతకు గురయ్యాయి. అణకువగా మసలుకున్న వారికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం బహుమానంగా అందించారు.

అధికారులే విషం గక్కితే ఎలా?

గడిచిన నాలుగేళ్లుగా టీచర్లు ఆర్థిక దిగ్బంధానికి గురయ్యారు. మెడికల్ రెఎంబర్స్మెంట్, ఆర్జిత సెలవు ఎన్‌క్యాష్‌మెంట్, పీఎఫ్ రుణాలు, ఎపిజిల్‌ఐ అడ్వాన్సులు, డిఎ బకాయిల రద్దు, మంజూరులో జాప్యం, పిఆర్సీ బకాయిలు ఇవన్నీ వున్నా ఇప్పుడు వాటి ప్రస్తావన నా అభిప్రాయంలో లేదు. మాట్లాడేది జీతాల పెంపు, ఆర్థిక వెసులుబాటు గురించీ కాదు. కేవలం ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్ధకం చేస్తున్న ప్రభుత్వ విధివిధానాల గురించి. విలువైన బోధనా సమయం హరించుకుపోతుంటే ఆర్తితో రాశా. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పనిలో అనవసర జోక్యం గురించి. ప్రభుత్వ పాఠశాలలపై విషం కక్కుతున్న అధికారుల గురించే నా బాధ అంతా!

స్కూళ్లలో వసతులు భేష్.. కానీ

అంతిమంగా ...రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎన్నో మెరుగులు దిద్దింది. రంగులు, ఇతర నగిషీలు చేసింది. పిల్లలకు గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వమూ చేయనంత మేలు ఒనగూర్చింది. ఇందులో అనుమానం, అతిశయోక్తి లేదు. అయితే అందులో పిల్లలు ఉండాలి కదా! టీచర్లుండాలి కదా! ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆకాశం నుంచి ఊడిపడిన వారు కారు. ప్రజల్లో నుంచి వచ్చిన వారే. ఇవాళ్టి రోజున ప్రభుత్వ పాఠశాల మూతపడితే రేపటిరోజున ప్రజల బిడ్డలు లక్షలాదిమంది ఉపాధ్యాయ శిక్షణ పొంది నిరుద్యోగంతో బతుకులీడుస్తున్నారు. సమకాలీన ఉపాధ్యాయులకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేకపోయినా భావితరాలకు జరిగే నష్టం గురించి. ఒక గ్రామంలో పాఠశాల మూసేస్తే ఆ గ్రామంలో పిల్లలు వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి భవిష్యత్తులో ప్రయివేట్ పాఠశాలలకు వెళ్లలేరనే బాధతో ఒక బాధ్యతగా నా సందేశం అందించాను తప్ప ఇదేదో వ్యతిరేక ప్రచారం కాదని విన్నవిస్తున్నా. ఫీజుల భారం మోయలేని తల్లిదండ్రులు పిల్లలను బాలకార్మిక వ్యవస్థలో భాగం చేస్తారని బాధ్యతతో ఒక సాధారణ పౌరుడిగా స్పందించా. జాతీయ విద్యా విధానం 2020 అమలుకు 28 రాష్ట్రాలు దూరంగా ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలుచేసిన దరిమిలా విద్యారంగంలో జరిగిన భారీ నష్టం గురించి మాత్రమే నా ప్రతిస్పందన!

- మోహన్ దాస్,

ఏపిటిఎఫ్ 1938

94908 09909



Next Story

Most Viewed