పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు ఇవే!

by Disha edit |
పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు ఇవే!
X

పత్రికా స్వేచ్ఛలో భారత్ ఏటేటా దిగజారిపోతుంది. అధిక జనాభా కలిగిన.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛ తీవ్ర సంక్షోభంలోకి పోతూ.. ఇది భవిష్యత్ ఆందోళన కలిగించేదిగా పరిణమించింది. గత నెల ఫ్రాన్స్‌కు చెందిన ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ సంస్థ తన 21వ ఎడిషన్‌‌లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ-2023 సంవత్సరానికి తన నివేదికను ప్రకటించింది. మొత్తంగా 180 దేశాలను లెక్కలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించగా.. భారత్ 161వ స్థానంలో నిలిచింది. మన పొరుగు దేశాలైన భూటాన్ (90), నేపాల్ (95), శ్రీలంక (135), ఆఫ్ఘనిస్తాన్ (152) లాంటివి మెరుగైన స్థానాల్లో నిలిచాయి. భారత్ గతేడాది 150 వ స్థానంలో ఉంటే ఈసారి మరింత కిందకు పడిపోయింది. ఇలా భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోవడానికి.. సంక్షోభంలో ఉందనడానికి జర్నలిస్టులపై జరుగుతున్న హింస, మీడియా పక్షపాత ధోరణి, గుత్తాధిపత్యం వంటి కారణాలేనని సంస్థ నివేదికలో స్పష్టం చేసింది. ఎప్పటిలాగే నార్వే (1) వరుసగా ఏడోసారి కూడా అగ్రభాగాన ఉండగా.. ఐర్లాండ్ (2), డెన్మార్క్(3) స్థానంలో నిలిచాయి. ఈ స్వేచ్ఛ సూచిని రాజకీయ, శాసన, ఆర్థిక, సామాజిక, జర్నలిస్టుల భద్రత అనే ఐదు అంశాల ఆధారంగా ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ రూపొందిస్తుంది.

ప్రజలను చైతన్యం చేస్తూ..

ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో శాసన, న్యాయ, కార్యనిర్వాహక సంస్థల తర్వాత నాలుగో ఎస్టేట్ మీడియా. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికి వాచ్ డాగ్ మీడియా. నలుదిక్కులా జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడమే మీడియా బాధ్యత. అందుకే జర్నలిజాన్ని వృత్తిలా కాకుండా సామాజిక బాధ్యతగా చూస్తారు. ప్రభుత్వాల నిర్ణయాలు, విధానాలను, తప్పొప్పులను ప్రజలకు తెలియజెప్పే వారధి మీడియా. అలాగే ప్రజల అభిప్రాయాలను కూడా ప్రభుత్వానికి చేరవేసే ముఖ్యమైన సాధనం. పాలకులు పారదర్శకత, జవాబుదారితనం, సమర్థవంతమైన, నిబద్ధత, చిత్తశుద్ధితో పరిపాలన చేసేలా చూడడం వంటివి కూడా మీడియాపైనే ఆధారపడి ఉంటుంది. పశ్చిమ దేశాల్లోనైతే మీడియాను ప్రత్యామ్నాయ ప్రభుత్వంగానూ పేర్కొంటుంటారు. అలాంటి మీడియాకు ప్రస్తుత కాలంలో రాజకీయ ఒత్తిడులు, కుల, మత విద్వేషాల వంటి కారణాలతో జర్నలిస్టులపై జరిగే దాడులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా మారాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే మన దేశంలో పత్రికలు ప్రధాన పోషించాయి. స్వాతంత్రోద్యమ కాలంలో అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, చంద్రబోస్ తదితర జాతీయ నేతలు స్వయంగా పత్రికలను నడిపారు. ఆనాటి దేశ, సామాజిక పరిస్థితులను ప్రజలకు చేరవేసి చైతన్యం చేశారు. నాటి నుంచి నేటి కాలం వరకు ప్రజలను చైతన్యం చేసే ప్రధాన సాధనంగానూ మీడియా నిలుస్తుంది. పత్రికా స్వేచ్ఛపై మన రాజ్యాంగం అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. కానీ.. రాజ్యాంగంలోని అధికరణ19A(1) కింద పౌరులకు భావ ప్రకటన హక్కును కల్పించింది. అందులోంచే పత్రికా స్వేచ్ఛ కూడా ఆవిర్భవించింది. ప్రపంచీకరణలో భాగంగా కాలానుగుణంగా టెక్నాలజీలో వచ్చిన మార్పులతో సంప్రదాయ ప్రింట్ నుంచి న్యూ మీడియాలో ఇంటర్నెట్‌, డిజిటల్ జర్నలిజంగాను విస్తరించింది.

వాటిపై నియంత్రణ విధించి..

కొన్నేళ్లుగా దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎంతగా దిగజారిపోయిందంటే.. వార్తలు సేకరించే జర్నలిస్టుల ప్రాణాలకు కూడా ముప్పువాటిల్లేంతగా పరిణమించింది. ఇంకా చెప్పాలంటే జర్నలిస్టుల ప్రాణాలు పోయేంత.. తీసేంత ప్రమాదకర స్థాయికి వెళ్లింది. విధి నిర్వహణలో జర్నలిస్టులు చంపబడిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. జర్నలిస్టులపై బెదిరింపులకు దిగడం, దేశద్రోహం, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కేసులు పెట్టడం, పత్రికా స్వేచ్ఛను హరించడం లాంటివి చర్యలు నిత్యకృత్యమే.! ఇందుకు ఉదాహరణే.. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో బాలికపై లైంగికదాడి, హత్య ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన కేరళ జర్నలిస్ట్‌ సిద్ధిక్ కప్పన్‌పై అక్కడి ప్రభుత్వం యాంటీ టెర్రర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఏడాదిన్నరకు పైగా జైలులో పెట్టడం, కర్ణాకటలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య లాంటి ఘటనలు చెప్పుకోవచ్చు. ఎన్డీటీవీ వ్యవహారంలో జర్నలిస్ట్ రవీష్ కుమార్‌పై, భావ వ్యక్తికరనలో మహిళా జర్నలిస్టు సాగరికా ఘోష్ వంటి వారిపైనా వేధింపులు, బెదిరింపుల చర్యలు చూశాం. అంతేకాదు.. గుజరాత్ లో ముస్లింలపై హింసకు పాల్పడ్డారని ప్రధానిని విమర్శిస్తూ డాక్యుమెంటరీని ప్రసారం చేసినందుకే అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడిందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం బీబీసీ మీడియా సంస్థపై చర్యలకు దిగింది తెలిసిందే. ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని.. ఏకంగా మీడియా చానల్‌ను, పత్రికలను బ్యాన్ చేస్తున్నం అని రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తులు వాటిపై నియంత్రణ విధించారు. ఇలా జర్నలిస్టులపై, ప్రధానంగా ప్రభుత్వ పక్షపాత ధోరణి.. రాజకీయ నేతలు, పోలీసులు, నేరగాళ్లు, అవినీతి అధికారుల నుంచి వివక్షత, దాడులను ఎదుర్కొన్నారు. మరోవైపు సోషల్ మీడియాలోని నకిలీ వార్తలను బూచిగా చూపిస్తూ జర్నలిస్టులపైనా హెచ్చరికలు, దాడులకు దిగిన సంఘటనలు కొకొల్లలుగానే ఉన్నాయి.

మీడియా గొంతు నొక్కుతున్నవి..

పత్రికా స్వేచ్ఛ అనేది ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతిష్టాత్మకమైన హక్కు. ఏ దేశమైనా పత్రికా స్వేచ్ఛను ఒక జాతిగా పరిగణిస్తుంది. ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ వాస్తవాల ద్వారా ప్రజా ప్రయోజనాలను అభివృద్ధి చేసేందుకే ప్రయత్నిస్తోంది. ఇది లేకుండా ప్రజలు బాధ్యతాయుతంగా ఉండలేరు. ఓటర్లు స్పష్టమైన తీర్పులు ఇవ్వలేరు. సామాజిక బాధ్యతగానూ ప్రజల పక్షాన ప్రత్యామ్నాయ శక్తిగా వెన్నుదన్నుగా నిలిచేదే మీడియా. ఇది ప్రజా చైతన్యానికి పాటుపడుతుంది. బాధ్యతాయుతంగా మెలుగుతూ తన విశ్వసనీయతను చాటుతూ మెజార్టీ ప్రజల శ్రేయస్సుకు కృషి చేస్తుంది. క్షేత్రస్థాయిలో పేదల కష్టాలను, నిరుద్యోగుల బాధలను, పాలకుల, అధికారుల అవినీతిని నిత్యం ప్రజల ముందుంచుతుంది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, అభివృద్ధి పరంగా సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా మీడియా మెలుగుతుంది. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో మిగతా మూడు వ్యవస్థలు ఇప్పటికే గొడ్డలిపెట్టుగా మారాయి. అవినీతి, కుంభకోణాలు, పారదర్శకత లేకపోవడం వంటి విమర్శలను ప్రజల నుంచి ఎదుర్కొంటున్నాయి. నాలుగో స్తంభమైనా మీడియాను పై మూడూ సందర్భానుసారంగా గొంతు నొక్కేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకులు నిర్బంధాలు, సంకెళ్లు వేసేందుకు చూస్తుంటాయి. భవిష్యత్ లో ఇదే పెచ్చుమీరితే.. ప్రజాస్వామ్యానికి వాచ్ డాగ్ అయిన మీడియా మూగబోతే.. ఇక గొంతు లేని వారికి గొంతుకగా నిలిచేదెవరు..! అది బతకాలంటే జర్నలిస్టులపై జరిగే దాడులపై, నిర్భంధాలపై ప్రజాస్వామిక వాదులు, మేధావులు, బుద్ధిజీవులు ప్రశ్నిస్తూ ఉండాలి. మీడియా అణచివేతదారులపై నిలదీయకపోతే ప్రజాస్వామ్య దీపం పాలకుల చేతిలో ఆరిపోవడం ఖాయం. పత్రికా స్వేచ్ఛకు స్వేచ్ఛ లేకుండా చేస్తే.. చీకట్లో ఉండే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.!

సురేష్ వేల్పుల

సీనియర్ జర్నలిస్ట్

91001 44990



Next Story

Most Viewed