బాధితులా.. నిందితులా?

by Disha edit |
బాధితులా.. నిందితులా?
X

రైళ్లను ఆపుదామని మాత్రమే అనుకున్నారు. వారి చేతుల నుంచి పరిస్థితి అదుపు తప్పింది. బోగీలు అంటుకున్నాయి. అగ్గి పెట్టింది ఎవరో ఇప్పటికీ తెలియదు. పోలీసులు కూడా తేల్చే ప్రయత్నాలేమీ చేయడం లేదు. వేలాది మంది గుర్తు తెలియకుండా వెళ్లిపోయారు. గాయపడి చిక్కిన 56 మంది మాత్రం పోలీసుల లిస్టుకు ఎక్కారు. వారిని జైలుకు పంపుతున్నారు. ఇక వీరి జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులే. గాయాలు కాకుంటే వీరు కూడా తప్పించుకునేవారే. జైలు దగ్గర పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం. 'అగ్గి పెట్టింది ఎవరో? అద్దాలు పగులగొట్టింది ఎవరో? దొరికింది మాత్రం వీళ్లు. మొన్నటి వరకు బాధితులుగానే ఉన్నవాళ్లంతా ఇప్పుడు నిందితులుగా మారారు. వీరికి న్యాయం చేసేదెవరు !?

'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా సికింద్రాబాద్​రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనలో నేరం ఎవరిది? బాధ్యులు ఎవరు? నిందితులు ఎవరు? బాధితులు ఎవరు? ఇప్పుడివన్నీ మిలియన్ డాలర్ ప్రశ్నలుగా మారిపోయాయి. రైల్వే పోలీసులు, హైదరాబాద్ నార్త్​జోన్​పోలీసులు తమ వైఫల్యాలను కేసుల రూపంలో కప్పిపుచ్చుకుంటున్నారు. ఈ ఘటనలో వేలాది మంది భాగస్వాములు అయితే, గాయాలపాలైనవారు మాత్రమే పోలీసులకు దొరుకుతున్నారు. అభ్యర్థులు ముందుగా శాంతియుత నిరసనకు పూనుకున్నారు. యవత రెచ్చిపోయేందుకు ఒక విధంగా పోలీసులే కారణమయ్యారు.

ఆయిల్ ట్యాంకర్‌కు నిప్పు పెడుతారనే ఉద్దేశ్యంతో కాల్పులకు దిగామని ప్రకటించారు. చివరకు కాల్పులలో, ఉరుకులు, పరుగులలో కిందపడిన వారు మాత్రమే పోలీసులకు కనిపిస్తున్నారు. కనీసం మూడు వేల మంది యువకులు సికింద్రాబాద్​ ఘటనలో ఉన్నారని సమాచారం. ఒక ప్రైవేట్ డిఫెన్స్​అకాడమీకి చెందినవారే 450 మంది ఉన్నారని పోలీసులే చెప్పారు. ఇప్పుడు 56 మందిని నిందితులుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారే ఇందులో 90 శాతం ఉన్నారు. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్‌లకు భయపడి జనగామకు చెందిన అజయ్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నంచాడు. యువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పిల్లలకేం తెలియదంటూ ప్రాధేయ పడుతున్నారు. కనిపించినవారినే పట్టుకుంటున్నారు. అసలు వీరంతా ఇప్పుడు బాధితులా, నిందితులా? అనేది తేల్చాల్సింది ఎవరు?

అసలేం జరుగుతోంది?

సికింద్రాబాద్ ఘటనలో కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ముందుగా దీని మీద ఏమీ మాట్లాడలేదు. కేంద్ర బృందాలు మాత్రం కుట్ర కోణం ఉందంటూనే చెబుతూ వచ్చాయి. రాజకీయ ప్రమేయాల సంగతి పక్కన పెడితే, ప్రైవేట్​డిఫెన్స్ అకాడమీలు మాత్రం కచ్చితంగా చేయందించాయని స్పష్టమైంది. ఫీజుల రూపంలో యువకుల నుంచి లక్షలు వసూలు చేసిన అకాడమీలు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే, అగ్నిపథ్ అమలుకు వస్తే​అకాడమీలు మూసుకోవాల్సిందే. శిక్షణకు వచ్చేవారుండరు. ఆర్మీ ఉద్యోగాలను సాకుగా చూపించి కోట్లు కూడబెట్టారు. కేంద్ర నిఘా వర్గాల నుంచే ఈ సమాచారం అందడంతో సాయి డిఫెన్స్​అకాడమీ తెరపైకి వచ్చింది. వాట్సాప్​ గ్రూపులలో ఈ అకాడమీ గ్రూప్​ఎండీ సుబ్బారావు చాటింగ్ బహిర్గతమైంది. ఘటన తర్వాత పోలీసులు యథాతథంగా దూకుడు చూపిస్తున్నారు.

అభ్యర్థులు ముందుగా శాంతియుతంగానే ఉన్నారు. అకాడమీ సిబ్బంది, అకాడమీకి చెందిన ప్రత్యేక అభ్యర్థులు అడుగుపెట్టిన తర్వాతే అసలు కథ మొదలైంది. ఇది పోలీసులకు ముందుగానే తెలుసు. కాల్పులకు ఒక యువకుడు బలైతే, మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ కుట్ర చేసిందెవ్వరనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మారింది. సాయి డిఫెన్స్​ అకాడమీ పేరు ఎండీ ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. విచిత్రమేమిటంటే ఎఫ్ఐఆర్‌లో ముందుగా ఆయన పేరు లేదు. ఏపీ పోలీసులు ఆయన మీద విచారణ జరుపుతుంటే, కేంద్ర ఐబీ బలగాలు అకాడమీ కార్యాలయాలలో సోదాలు చేశాయి. ఐటీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. అయినప్పటికీ సుబ్బారావును విచారించేందుకు తెలంగాణ పోలీసులు మాత్రం ఎందుకో సాహసించలేదు. చివరకు ఒత్తిడి తట్టుకోలేక ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చారు.

నిందితులైన బాధితులు

ఆ యువకులు నాలుగేండ్ల నుంచి ఆర్మీ నోటిఫికేషన్​ కోసం ఎదురు చూస్తున్నారు. ఏటా రెండు లక్షల చొప్పున డిఫెన్స్​ అకాడమీలకు ఫీజులు చెల్లించి దేహదారుఢ్యాన్ని కాపాడుకుంటున్నారు. అగ్నిపథ్ ప్రకటనతో వారంతా ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. నాలుగేండ్ల నుంచి పడుతున్న కష్టం బాధించింది. వీటికి రెచ్చగొట్టే బృందాలు తోడయ్యాయి. దీంతో వారంతా సికింద్రాబాద్​స్టేషన్‌కు వచ్చారు. రైళ్లను ఆపుదామని మాత్రమే అనుకున్నారు. వారి చేతుల నుంచి పరిస్థితి అదుపు తప్పింది. బోగీలు అంటుకున్నాయి. అగ్గి పెట్టింది ఎవరో ఇప్పటికీ తెలియదు.

పోలీసులు కూడా తేల్చే ప్రయత్నాలేమీ చేయడం లేదు. వేలాది మంది గుర్తు తెలియకుండా వెళ్లిపోయారు. గాయపడి చిక్కిన 56 మంది మాత్రం పోలీసుల లిస్టుకు ఎక్కారు. వారిని జైలుకు పంపుతున్నారు. ఇక వీరి జీవితాంతం ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులే. గాయాలు కాకుంటే వీరు కూడా తప్పించుకునేవారే. జైలు దగ్గర పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం. 'అగ్గి పెట్టింది ఎవరో? అద్దాలు పగులగొట్టింది ఎవరో? దొరికింది మాత్రం వీళ్లు. మొన్నటి వరకు బాధితులుగానే ఉన్నవాళ్లంతా ఇప్పుడు నిందితులుగా మారారు. వీరికి న్యాయం చేసేదెవరు !?

టి. సంపత్

94414 06811



Next Story

Most Viewed