తెలంగాణ కవి అందెశ్రీ గురించి తెలుసా?

by Disha edit |
తెలంగాణ కవి అందెశ్రీ గురించి తెలుసా?
X

నేల అద్భుతమైన గనులు, మణులు, మాణిక్యాలు, ఎన్నో సహజ వనరులను తన గర్భంలో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. అడవులు, నదీనదాలు, ఎడారులు, కొండలు, గుట్టలు, అగ్నిపర్వతాలను తన ఎదమీద రక్షణగా నిలుపుకుంటుంది. అలాంటి అగ్నిపర్వతాలలో ఒక నడిచే అగ్నిపర్వతం అందెశ్రీ. సమస్త లోకాన్ని సహజ సైనికుడై చుడుతూ కవిత్వ కవాతు చేస్తున్నవాడు. అగ్నిపర్వతం చూడడానికి బుద్ధిగా, ఒద్దికగా కనిపించినా కాలక్రమ ధ్వంసం, కాలగర్భిత హింసను భరించి, భరించి కడకు సహించలేక బద్ధలవుతుంది.

అందెశ్రీ పాట, కవిత్వం కూడా అంతే. పాలకపక్షం కానీ, ప్రతిపక్షం కానీ, ఆధిపత్యం కానీ మానవాళిపై, సమస్త భూమండలం పై చేస్తున్న దుర్మార్గాలను చూసి తట్టుకోలేడు.అవి పరాకాష్టకు చేరినపుడు లావా ఉబికి వస్తుంది. అక్షర ప్రళయాగ్ని ఎగిసిపడుతుంది. అన్యాయంపై పాటల జడివాన వర్షిస్తుంది. తన కంఠం ఫెడేల్మని మోగే ఉరుముల శబ్ధమై గర్జిస్తుంది. అనారోగ్య పీడితుడిని ఉపశమనపరుస్తూ ఔషధం గొంతు లోపలికి దిగినట్టు అందెశ్రీ పాట 'జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి / ఝంఝా మారుత జన నినాదమై జేగంటలు మోగించాలి' 'ఒకటే జననం ఓహోహో, ఒకటే మరణం ఆహాహా / జీవితమంతా ఓహోహో జనమే మననం అహాహా / కష్టాల్ నష్టాల్ ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ / జై బోలో తెలంగాణ' అంటూ కదులుతుంది. దానిని మనమంతా కళ్లారా చూశాం. తనువారా అనుభవించాం. కడదాకా జ్వలించాం.

వారికి కొదువలేదు కానీ

తెలంగాణ ఎర్రని మాగాణంలో ఎక్కడ చూసినా గద్దర్, గోరేటి వెంకన్న, జయరాజు లాంటి వాళ్లకు కొదవలేదు. వీరందరూ చదువుకుని ప్రత్యక్ష పోరుబాటలోంచి వచ్చిన వాళ్ళు. అందెశ్రీ అలా కాదు. తనమీద విప్లవోద్యమ ప్రభావం బలంగానే ఉంటుంది. తనే చెప్పుకున్నట్లు సుద్దాల హనుమంతు రాసి, పాడిన 'పల్లెటూరి పిల్లగాడ, పసులగాసే మొనగాడ' పాట ఆయనను కమ్మేసింది. పాలబుగ్గల జీతగాడుగా ఉన్న కాలంనుంచే ఆయన మెదడును ప్రజా ఉద్యమ గాలి ఆవహించింది. తనకు తెలియకుండానే ఉద్యమాలను చదువుకున్నడు, ఆకళింపు చేసుకున్నడు. ఏనాడూ కన్నప్రేమకు, కలం ప్రేమకు నోచుకున్నోడు కాదు. ఆ బాధలు మరిచిపోవడానికి పద్యం శరణుజొచ్చాడు అందెశ్రీ.

ఏనాడూ బడి మొఖం చూడని సామాన్యుడు ఇవాళ అందరి బాధలు తీర్చేందుకు పాట ఆయుధాన్ని భుజానికెత్తుకొని ధైర్యంగా కైతల కవాతు చేస్తున్నాడు. ప్రజలను పందిరిగా చేసుకొని, పాటను పరాకాష్టగా నిలబెట్టడం కోసం తపిస్తున్నాడు. బహుశా పోతన పుట్టిన నేలమీద పుట్టినందున కావచ్చు అందెశ్రీ 'రాజ్యాలకు, రాజులకు, రాజ్య ప్రాకారాలకు పాటను తాకట్టు పెట్టనని' శపథం తీసుకున్నాడు. నేటి పాటల పరాయీకరణ యుగంలో అందెశ్రీ ప్రజలకు తప్ప దేనికీ, ఎవరికీ తలవంచనని ప్రకటించడం అత్యంత సాహసమే కాదు! సమరపు ధైర్యం కూడా.

Also read: రాష్ట్ర ఉద్యమంలో వెయ్యి సార్ల కంటే ఎక్కువ అరెస్టయిన లీడర్ ఎవరో తెలుసా?

అనేకానేక పాటలు

ఇలాంటి మచ్చు తునకలను చూసే కాబోలు 'ఇక్కడి మనుషులు మనుషులుగానే జీవిస్తున్నారు' అంటాడు ప్రసిద్ధ చరిత్రకారుడు జయధీర్ తిరుమలరావు. ప్రతి ఇంటిలో పటంగట్టి గోడలకు తగిలించాల్సిన ఎన్నో పాటలు రాశాడు అందెశ్రీ. 'కొమ్మ చెక్కితె బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా' అని మానవజాతి తొలి జీవన గమనాన్ని వివరిస్తాడు. జానపదుల జీవిక, గ్రామ దేవతల భూమికను చిత్రికపడతాడు. ప్రపంచీకరణ యుగంలో మాయమైపోతున్న మనిషిని వెతుకుతాడు. భక్తి పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని, ఆధ్యాత్మికత పేరుతో చేస్తున్న మతోన్మాద దుర్మార్గాలను ఖండిస్తాడు. 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు/ మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం వున్నవాడూ' అంటూ ఎండగడతాడు.

ఆధ్యాత్మికత అంటే బుద్ధుడిలా ఉండటమే తప్ప కుప్పిగంతులు, క్షుద్ర విద్యలు కావని బుగులు పడతాడు. 'కుక్కనక్కల దైవ రూపాలుగా కొలిసి / పంది నందిని జూస్తే పడి మొక్కుతుంటాడు/ చీమలకు చక్కెర పాములకు పాలోసీ/ జీవకారుణ్యమే జీవితము అంటాడు/ తోడబుట్టిన వాళ్ల ఊరవతలికి నెట్టి/ కులమంటు ఇల మీద కలహాల గిరిగీసి' అంటూ జంతువులను మొక్కడం కాదు మనుషులను మనుషులుగా చూడటం నేర్చుకోవాలని కోరుతుంటాడు. ఆవుల కోసం మనుషులను చంపుతున్న నేటి మత స్వామ్యం రాజ్యమేలుతున్న ఈ కాలంలో అందెశ్రీ పాట అత్యయిక అవసరం అనిపిస్తుంది. తన రేఖాచిత్రంలో సుద్దాల హనుమంతు లాంటివారు కనపడతారంటాడు.

Also read: తెలంగాణ ఉద్యమకారులు ఎటు? వారి ఆశలు ఏంటి?

అందుకే పురస్కారం

ఇప్పుడు అదే సందర్భం. సినీ గేయ రచయితగా ప్రఖ్యాతి గడించిన సుద్దాల అశోక్ తేజ తల్లిదండ్రుల జ్ఞాపకంగా నెలకొల్పిన 'సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం' ఈ ఏడాది అందెశ్రీకి ప్రకటించారు. మట్టిని, మట్టి పరిమళాన్ని ఒళ్లంతా పులుముకుని, నరాల బిగువున పొలాలు దున్ని, కరాళ బలమున వరాలు చేసి, పంట పండించిన నిజ పాలబుగ్గల జీతగాడిని అవార్డు వరించడం నిజంగా అభినందనీయం. సుద్దాల హనుమంతు పాట వింటూ పెరిగిన అందెశ్రీకి, హనుమంతు పాటలకు బలమైన సారుప్యతలున్నాయి.

వారి పాట రాజ్యంపై ధిక్కార స్వర పతాకమై ఎగురుతూనే ఉంటుంది. నాడు 'పల్లెటూరి పిల్లగాడ' పాట వెట్టి చాకిరీ విముక్తికి జాతీయ గీతంలా ధ్వనిస్తే, నేడు అందెశ్రీ 'జయ జయహే తెలంగాణ' పాట రాష్ట్రావతరణకు జాతిగీతమై జ్వలించింది. ఓ మానవీయ ఉన్నతోన్నత సమసమాజాన్ని కాంక్షించే అందెశ్రీ పాట మరింత ప్రజ్వరించాలని కోరుకుందాం.

(నేడు హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో అందెశ్రీ 'సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం' అందుకుంటున్న సందర్భంగా)


ఎం. విప్లవకుమార్

95152 25658

Next Story