కైవల్యం పొందిన కళాతపస్వి

by Disha edit |
కైవల్యం పొందిన కళాతపస్వి
X

చిత్ర యవనికపై కళాత్మక చిత్రాలుగా తీర్చిదిద్ది భారతీయ సినిమాకి పేరుతెచ్చిన యశస్వి, ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న మనస్వి మన కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్. సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవైనా.. అవి మనుషుల్ని వేరు చేసేవి కావని పాఠాలు నేర్పిస్తారు. ఒక మనిషి ఎలా బతకాలో.. తోటి వాళ్ళతో ఎలా ఉండాలో.. ఎలా ప్రేమ చూపించాలో సినిమాల ద్వారా మనకు అర్థమయ్యేలా చెబుతారు. మన చుట్టూ బతుకుతున్న మనలాంటి సాధారణ మనుషులే ఆ సినిమాల్లో కనిపిస్తారు. వయసు పైబడిన ముసలాయన.. మతిస్థిమితం సరిగా లేని ఓ సాధారణ వ్యక్తి.. సక్సెస్ అంటే ఏంటో తెలియని ఓ కళాకారుడు.. కళ్ళు కనిపించని ఓ గుడ్డివాడు.. చెప్పులు కుట్టుకునే పేదవాడు.. చేపలు పట్టుకునేవాడు.. వీళ్ళే విశ్వనాథ్ గారి హీరోలు. వాళ్ళ జీవితాలే మనం ఆరాధించే గొప్ప కళాఖండాలు..

సంప్రదాయానికి పాదాభివందనం

అచ్చమైన తెలుగుదనానికి అందమైన చిరునామా కాశీనాథుని విశ్వనాథ్ సినిమా.. కళాతపస్విగా సినీ అభిమానులు పిలుచుకుంటున్న పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా ఆవిష్కరించిన మహా గొప్ప దర్శకుడు, రచయిత. జనరంజక సంగీతం గురించి తనకు తెలిసినంత మరెవరికి తెలియదు అన్నట్లుగా విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. సంగీతం ఆభిమతం సంఘ హితం. యావత్ జగతిని స్పందింపజేసి పరవశంతో తన వశం చేసుకునే అద్భుత శక్తి సంగీతానికి వుంది. పాశ్చాత్య సంగీతం ఆస్వాదించడం తప్పు కాదు. సాంప్రదాయ సంగీతాన్ని విమర్శించడం, విస్మరించడం వివేకం కాదు. "పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డు పెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను" అన్న జంధ్యాల మాటలు శిరోధార్యం.

కళకు కాసులద్దిన తపస్వి

రాగం తానం పల్లవి స్వర మిశ్ర త్రయాన్ని త్రికరణ శుద్ధితో తన హృది సవ్వడిని రాగం తానం పల్లవిగా మార్చి వాటి సాధనలో తాదాత్మ్యం చెంది జీవన గమనంలో అరోహణలను, అవరోహణలను అధిగమించి రాగాభరణాన్ని శంకరుని ఆభరణంగా సమర్పించిన సంగీత విద్వాంసుని కథ, ఔచిత్యమైన పాత్రల రూపకల్పన చేసిన నీ దర్శక కౌశలానికి దర్పణం శంకరాభరణం. కమర్షియల్ సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్న వేళ సప్తస్వర శాస్త్రీయ సంగీత రాగల వర్షాన్ని కురిపించి ప్రేక్షకుడిని ఆనంద దృష్టిలో తడిపి కళాత్మక చిత్రాలు కూడా మనగలవు, మన సంస్కృతికి మన్నన తేగలవు అని చాటిచెప్పిన నీవు కారణ జన్ముడివే.

ఆదిభిక్షువుని ఆర్చించి అర్ధించి ఓంకార నాదం నుంచి ప్రభవించిన సామవేద సారాన్ని వరంగా తెచ్చుకున్నవో ఏమో మురళీరవం చేసి సినీ వినీలాకాశంలో సిరివెన్నెల కురిపించావు. నవరస రవళీ రాగాలల్లి ఎద ఘల్లుమనిపించావు. నెమలికి కులుకుల నడకలు నేర్పించావు మురళికి అందిని పలుకులు పలికింపజేసి శ్రోతల మది పులకింపజేశావు. ఆ సప్తస్వరాలు సప్తపదిగా పదిలం.

అందుకే అవార్డులు నడుస్తూ వచ్చాయి

వైఫల్యం చెందిన కళాకారుని కథను తెరకెక్కించడం సాహసం. కళాపరిపూర్ణోదయ హృదయుల సాకారంతో మీ దర్శక మేథోమథనం నుంచి ఉద్భవించిన నృత్య, సంగీత సాహిత్య సంగమం కళాసాగర సంగమమై, దృశ్య కావ్యమై, ప్రేక్షకుల కళాపిపాసను తీర్చే అమృత భాండమై నిలిచింది. స్వాతి ముత్యమై మెరిసింది. సంగీత సాహిత్య సమదళాంకృత స్వర్ణకమలమై చిత్రసీమలో కళా సౌరభాన్ని పరిమళింపచేసింది. కాస్మోటిక్ కవచాన్ని తీసి అందాల నటుడిని చెల్లెలికాపురం చిత్రంలో తెరమీద చూపించిన మీ వైవిధ్యమైన దృష్టికి సాహో. ఏ వృత్తిలో ఉన్నా అంకితభావం స్వయంకృషి వుంటే జీవితం సాఫల్యమౌతుంది, శుభసంకల్పంతో, సిరి సంపద లభిస్తుంది, అన్న సందేశాన్ని సమాజానికి అందించి సినిమా సామాజిక బాధ్యతను నెరవేర్చినావు. నేటి తరానికి తలమానికంగా నిలిచే చిత్రాలకు దర్శకత్వం వహించి కళను సంస్కృతిని కాపాడిన ఆపద్బాంధవుడవి.

స్వాతిముత్యం.. భారతీయ చలన చిత్రానికి అస్కార్‌లో ప్రదర్శింపజేసే స్థాయిని కల్పించి ఆ కళాత్మక క్రతువును చేపట్టిన సూత్రధారివి. కనుకనే నందులు మీ ఇంటికి నడిచివచ్చాయి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు మీ దరికి చేరి దరహాసాన్ని చిందించింది. ఇలా.. ఎన్నో.. మరెన్నో తెలుగు జాతి గర్వించే సినిమాలు మనకు అందించి సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన విశ్వనాథ్ మన తెలుగువాడు అయినందుకు మనం ఎంతో గర్వపడాలి.

ఆయన చిత్రాలు తెలుగు సాంస్కృతిక ఆత్మగౌరవానికి ప్రతీకలు. సంగీత సాహిత్యామృత సాగర సంగమాలు. ఆ చిత్రాలు సిరిసిరి మువ్వల హారాలై శంకరాభరణమై, శ్రుతిలయబద్ధమై, ప్రణవనాదంతో అనుసంధానమై రాగరంజితమైనది. ఆ కథా కౌశల కౌముది సినీ వినీలాకాశంలో సిరివెన్నెలని కురిపించింది. యశస్వి, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ "యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మనః యతో మనః తతో భావః, యతో భావః తతో రసః". దృష్టిని మనస్సును కళల యందు లగ్నం చేసినప్పుడే రస సిద్ధి కలుగుతుంది అంటూ త్రికరణ శుద్ధిగా తన కర్తవ్యాన్ని నిర్వహించి, రస సిద్దిని పొందిన తాపసి ఈ కళాతపస్వికి ఆక్షరాంజలి.

శ్రీధర్ వాడవల్లి

9989855445

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story

Most Viewed