Telangana: ఇక్కడ మీ పాచికలు పనిచేయవు?

by Disha edit |
Telangana: ఇక్కడ మీ పాచికలు పనిచేయవు?
X

తెలంగాణ 60 యేండ్ల గోసను చెరుపుకొని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దశాబ్దానికి ముందే అద్భుత అభివృద్ధితో ముందుకెళ్తున్నది. పాడి పంటలతో ప్రగతి వైపునకు సాగుతున్నది. ఇంతటి అభివృద్ధి ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. రాజన్న రాజ్యం అంటూ షర్మిల(Ys sharmila), కుటుంబ పాలన నుంచి విముక్తి అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్(Bandi sanjay) పాదయాత్రలు చేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బద్ద వ్యతిరేకిగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పాగా వేయాలని ఈ మధ్యే తన కేడర్ ను రెడీ చేసింది. ఇవన్నీ కూడా తెలంగాణను మరోసారి ఆగం జేసే రాజకీయ కుట్రలేనని ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడిప్పుడే బలపడుతుండగా

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys rajashekar reddy) తెలంగాణకు బద్ద వ్యతిరేకి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి పెద్దగా జరిగింది లేదు కానీ, తన సొంత ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరిగింది. తెలంగాణపై అంత వ్యతిరేకత చూపించిన ఆయన ఆశయాల కోసం, రాజన్న రాజ్యం కోసం అంటూ తనయ వైఎస్ షర్మిల వైఎస్ఆర్‌టీపీని(YSRTP) ఏర్పాటు చేసారు. బీఆర్ఎస్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని(kcr family) లక్ష్యంగా చేసుకొని ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కనీసం సంఘీభావం తెలపని నేతలు నేడు కేసీఆర్(kcr) పాలనపై విమర్శలు చేయడం బాధాకరం. రాజకీయ పార్టీ పెట్టే స్వేచ్ఛ అందరికీ ఉంది. ప్రతి పార్టీకి సిద్ధాంతాలు ఉండాలి. దాని కోసం పని చేయాలి. కానీ, ఎటువంటి సిద్ధాంతం లేకుండా పాదయాత్ర చేస్తున్న షర్మిలను (ysrtp chief) రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికి గురి చేసిన దాఖలా లేదు. దీనిని అలుసుగా తీసుకున్న షర్మిల కేసీఆర్‌, వారి కుటుంబాల మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సిగ్గుచేటు.

ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే ఒక్కో రంగంలో ఎదుగుతోంది. పుట్ల కొద్దీ పంటల రాసులు పండిస్తోంది. పల్లేరులు మొలచిన పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఇలా పచ్చగా ఉన్న తెలంగాణలో పాగా వేయాలని కపట ప్రేమతో షర్మిల పార్టీ ఏర్పాటు చేసిందనడంలో సందేహం లేదు. నిజంగా ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉంటే ఇప్పటికి ఎన్ని సభలలో 'జై తెలంగాణ' నినాదం ఇచ్చారో తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధిస్తే, కుట్రలు చేసి గందరగోళం సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణ పై అంత ప్రేమే ఉంటే నాడు వందలాది మంది రాష్ట్రం కోసం నేల రాలుతుంటే కనీసం ఎందుకు స్పందించలేదు?

కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు?

గతంలో నిరుద్యోగుల కోసం 'మంగళవారం నిరాహార దీక్ష' పేరుతో కేసీఆర్ ను విమర్శించారు. తెలంగాణ నూతన జోన్ల వ్యవస్థ ఆమోదం కోసం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని, విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటాపై ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? యేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎందుకు ప్రశ్నించరు? కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ఎస్సీ వర్గీకరణ (sc sc classification) చేస్తామని, బీసీ సమస్యలు పరిష్కరిస్తామన్న బీజేపీ(bjp) గురించి ఎందుకు మాట్లాడరు? కేవలం తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పై(BRS) పక్కాగా టార్గెట్ చేయడం వెనుక ఎవరున్నారన్నది ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి.

బీజేపీ నాయకుడు బండి సంజయ్(Bandi sanjay పాదయాత్రల ద్వారా తెలంగాణ మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. చంద్రబాబు(chandrababunaidu) సైతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి(TDP) పునర్వైభవం తీసుకు వస్తానని బహిరంగ సభలు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించింది లేదు. ఎందుకంటే, తెలంగాణ గడ్డ అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం. అందరినీ సోదరభావంతో గౌరవించడమే ఈ గడ్డకు తెలుసు. అధికార దాహంతో చిచ్చుపెట్టే వారి పట్ల తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి. రైతును రాజును చేయడానికి 'కిసాన్ సర్కార్' పేరుతో కదులుతున్న కేసీఆర్‌కు మనం మరింత అండగా నిలబడాలి.

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమకారుడు

కామారెడ్డి జిల్లా

7893303516

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Next Story

Most Viewed