అధికారానికి సంకెళ్లు?

by Disha edit |
అధికారానికి సంకెళ్లు?
X

జనాభాలో సగ భాగంగా ఉండి కూడా ప్రాతినిధ్యం కోసం 26 సంవత్సరాలుగా చేస్తున్న సుదీర్ఘ పోరాటాలకు అడ్డుపడుతున్న శక్తులు స్థానిక సంస్థలలో మహిళలకు పాలనాధికారాలు ఇచ్చినా మహిళలను పురుషులపై ఆధారపడే పరాన్నజీవులుగా మార్చివేశారు. వారు స్వతంత్రంగా పాలన చేయలేకపోతున్నారనే వాదనతో మహిళల అవకాశాలకు అడ్డుపడే ప్రమాదం లేకపోలేదు. అందుకే చట్టసభలలో మహిళలకు సముచిత ప్రాతినిధ్య కల్పన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాను ముక్కలేననే సత్యాన్ని గ్రహించాలి. వారి కుట్రలను ఛేదిస్తూ వంద శాతం పోరాటంతో ముందడుగు వేయాలి. గెలుపు మీదే, యూవిల్ బీ అన్‌స్టాపబుల్, గో ఎహెడ్..

స్వతంత్ర భారతంలో దోపిడికి, సాంఘిక, ఆర్థిక అసమానతలకు తావు లేని ఓ ఆదర్శ పాలనా వ్యవస్థను సృష్టించాలని తలచి రాజ్యాంగాన్ని రచించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమాజంలో మహిళల పట్ల పెరుగుతున్న అసమానతలకు 1951 సంవత్సరంలోనే హిందూ కోడ్ బిల్లు ద్వారా పరిష్కారం చూపాలనుకున్నారు. తరతరాలుగా అసమానతల ఊబిలో కూరుకుపోయిన వారు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ పురుషులతో సమానంగా ఉంచాలని ఆశపడి పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టారు. కానీ, ప్రతిపక్షాలే కాదు స్వపక్షంవారు కూడా వ్యతిరేకించడంతో ఆ బిల్లు వీగిపోయింది. దీంతో మహిళలకు సమాన హక్కు తీసుకురాలేకపోయానని కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారు. ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలం దాటినా నేటికీ మహిళల జీవితాలలో అసమానతల చీకట్లు తొలగిపోలేదని బుద్ధిజీవులనుకుంటున్నారు.

వంటింట బందీలను చేసి

నిజానికి ప్రాచీన కాలంలో పురుషులతో సమానంగా మహిళల జీవితాలు ఉండేవి. మధ్య యుగాల నాటికి వచ్చే సరికి మహిళలను అణచివేసి, వంటింటి కుందేళ్లుగా మార్చేశారు. పునరుత్పత్తికి ఉపయోగపడే మాంసపు ముద్దగా, సాంప్రదాయపు ఉక్కు సంకెళ్లలో బందీ చేశారు. కట్టుబానిసలుగా మార్చి చదువుకు, ఉద్యోగానికి, ఆర్థిక, సామాజిక సమానత్వానికి దూరం చేశారు. తదనంతరం పూలే, రాజారామ్మోహన్ రాయ్ వంటి సంఘ సంస్కర్తల కృషితో మనుధర్మ పునాదులను చీల్చుకుంటూ నేడు కొంత వరకు మహిళలు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నారు. పాలనా కేంద్రీకరణ కంటే వికేంద్రీకరణ ద్వారానే (స్థానిక సంస్థల ఏర్పాటు) దేశాభివృద్ధి సాధ్యమవుతుందని నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందించింది.

పంచాయతీరాజ్ చట్టంలో మూడవ వంతు పదవులను మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. పాలనలో మహిళలకు క్రియాశీలక భాగస్వామ్యాన్ని ఇవ్వడం చరిత్రాత్మకమే కాదు, రాజ్యాంగం ప్రసాదించిన వరం. అయితే, గ్రామ పంచాయతీలలో, మండలాలలో, జిల్లా పరిషత్‌లో 33 శాతం పదవులను వారికి కేటాయించి వారు గెలిచాక, వారి తరఫున కుటుంబ సభ్యులే అధికారం చెలాయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది మహిళల ఎదుగుదలకు అవరోధంగా ఉండే కుట్ర పూరిత చర్యగా భావించాలి. గ్రామీణ కుటుంబాల మహిళలు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నారంటే ఏదోలే అనుకోవచ్చు కానీ, నగరాలలోనూ అదే తంతు. విద్యాధికులైన మహిళా ప్రజాప్రతినిధులు సైతం పాలనా పగ్గాలను తమ భర్తలకే అప్పగిస్తున్నారు.

మహిళలు మేలుకోవాలి

'ఆకాశంలో సగం, అవనిలో సగం-అవకాశాలలో మాత్రం శూన్యం' మీ జీవితాలను మారుస్తున్న రాజకీయ నాయకుల కుట్రలను ఛేదించండి. రాజ్యాంగపరంగా మీకు సంక్రమించిన పాలనాధికారాలను మీరే అనుభవించండి. భర్తలపై, కుటుంబంలోని పురుషులపై ఆధార పడుతున్నారనే అపప్రథ నుండి బయటకు రండి. ఈ దేశంలో ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించి ప్రదర్శించిన నాయకత్వ పటిమను, సాధించిన అద్భుత విజయాలను స్ఫురణకు తెచ్చుకుని వాటి ప్రేరణతో ముందుకు సాగండి. తద్వారా మీ స్థానంలో మీ పాలనాధికారాలు మీరే నిర్వర్తించి స్వతంత్రంగా పాలన చేయలేకపోతున్నారనే వాదనకు తెరదించండి.

అందుకే ఓ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జడ్‌పీటీసీగా, ఎంపీపీగా జడ్‌పీ చైర్ పర్సన్‌గా, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్, మేయర్‌గా పాలనా పటిమను మహిళలు బుజువు చేసుకోకపోతే ప్రయోజనం ఉండదు. జనాభాలో సగ భాగంగా ఉండి కూడా ప్రాతినిధ్యం కోసం 26 సంవత్సరాలుగా చేస్తున్న సుదీర్ఘ పోరాటాలకు అడ్డుపడుతున్న శక్తులు స్థానిక సంస్థలలో మహిళలకు పాలనాధికారాలు ఇచ్చినా మహిళలను పురుషులపై ఆధారపడే పరాన్నజీవులుగా మార్చివేశారు. వారు స్వతంత్రంగా పాలన చేయలేకపోతున్నారనే వాదనతో మహిళల అవకాశాలకు అడ్డుపడే ప్రమాదం లేకపోలేదు. అందుకే చట్టసభలలో మహిళలకు సముచిత ప్రాతినిధ్య కల్పన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాను ముక్కలేననే సత్యాన్ని గ్రహించాలి. వారి కుట్రలను ఛేదిస్తూ వంద శాతం పోరాటంతో ముందడుగు వేయాలి. గెలుపు మీదే, యూవిల్ బీ అన్‌స్టాపబుల్, గో ఎహెడ్..

నీలం సంపత్

సామాజిక కార్యకర్త

98667 67471


Next Story

Most Viewed