సర్వేల పేరిట రాజకీయ జూదం

by Disha edit |
సర్వేల పేరిట రాజకీయ జూదం
X

టిక్కెట్లు ఇవ్వడానికి సర్వే. టిక్కెట్లు ఇవ్వకుండా ఉండటానికి సర్వే. పదవులు ఇవ్వడానికి సర్వే. పదవులు ఇవ్వకుండా ఉండటానికి సర్వే. ఈ సర్వే నాటకంలో తెలుగునాట ఏ పార్టీకీ మినహాయింపు లేదు. ‘సర్వే’జన సుఖీనోభవంతు!!... ఇదే ఇప్పుడు పార్టీ అధినాయకుల పోకడ!! సకల రాజకీయ సమస్యలకూ ‘సర్వే’నే రోగ నివారిణి... ఇది వారి రాజకీయ ఎత్తుగడ!! సర్వే అంటే ఊహించి చెప్పే లెక్క కాదు. జ్యోతిష్యం అంత కన్నా కాదు. సర్వే ఒక సైన్స్‌.

సర్వేలు చేయించడం, సర్వేల పేరిట రాజకీయం చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000 సంవత్సరం నుంచి మొదలైంది. ఎన్నికల ముందు ‘మనం సర్వే చేపిస్తున్నాం. అందులో బాగున్నవారికే టిక్కెట్టు ఇచ్చుకుంటున్నాం’ అని అధినేతలు పార్టీ సమావేశాల్లో చెప్పడం ఒక ఆనవాయితీగా మారింది. సర్వే చేయించారా లేదా అనే దానితో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు రుద్దడానికి సర్వేలను పావుగా వాడుకుంటున్నారు. సర్వే భుజమ్మీద తుపాకీ పెట్టి, నచ్చని వారిని పక్కన పెట్టి, నచ్చినవారిని పక్కకు తీసుకుంటున్నారు.

అందుకే ఆత్మవంచన ఫలితాలు

సర్వే చేయించాం కాబట్టే ఫలానా నిర్ణయం తీసుకుంటున్నామని పార్టీలు చెప్తున్నాయి. కానీ, అది ఇంటలిజెన్స్‌ విభాగం వంటి ప్రభుత్వ యంత్రాంగం జరిపిన సర్వేనా, ప్రయివేట్‌ సంస్థలతో చేయించిన సర్వేనా అనే విషయం ఎవరికీ తెలియదు! దీని గురించి అడిగేవారు ఉండరు. ఒకవేళ సాహసం చేసి అడిగినా వారి ఉరుములకు భయపడిపోతారు. నిస్పక్షపాత ధోరణితో తీసుకునే సరైన శాంపిల్‌, తగిన ఉపకరణాలతో సేకరించిన డేటాకు హేతుబద్ధత ఉంటే సర్వేలన్నీ వాస్తవానికి దగ్గరగానే ఉంటాయి. కానీ, సర్వేల పేరు చెప్పి ‘మీకు ఇలా ఉంది, వారికి అలా ఉంది’ అని సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సర్వే పేరు వాడుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు జూదమాడుతున్నాయి. సర్వేల పిచ్చితో చేసుకుంటున్న ఆత్మవంచన ఫలితాలు కూడా వెంటనే కనపడుతున్నాయి. అయినా, గుణపాఠం నేర్చుకోవడానికి అధినేతలు ఇష్టపడటం లేదు.

క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండా...

‘క్షేత్రాన్ని బట్టే విత్తనం మొలకెత్తుతుంది’ అని ప్రముఖ పాత్రికేయులు, కమ్యూనిస్టు నాయకులు గజ్జెల మల్లారెడ్డి ఏనాడో చెప్పారు. అంటే, అభ్యర్థికి అనువైన చోట పోటీ చేసినప్పుడే విజయం సాధించడానికి అధిక అవకాశాలు ఉంటాయి. కానీ, క్షేత్రం, క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రస్తుతం చేస్తున్న రాజకీయ బదిలీలను పరిశీలిస్తే... హేతుబద్ధత ఉన్న ఏ సర్వే సంస్థ అలా సిఫారసు చేయదని ఇట్టే అర్థమవుతుంది. ఊరు, పేరు తెలియని ప్రాంతాలకు బదిలీలు చేయడంతో... క్రికెట్‌‌లో ఆస్ట్రేలియా పిచ్‌‌లపై ఆడటానికి భారత ఆటగాళ్లు ఎలా ఇబ్బందులు పడతారో... హోం గ్రౌండ్‌ నుంచి బదిలీ అయిన వైఎస్సార్సీపీ నాయకులు కూడా అచ్చంగా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఒక చోట చెల్లని రూపాయి ఇంకో చోట ఎలా చెల్లుతుంది. చెల్లవనే ఈ ఉదంతాలన్నింటిలో ఎదురైన ఓటములు నిరూపించాయి. కాబట్టి, సర్వేలను దేనికోసం వాడుతున్నారో లోతుగా అర్థం చేసుకోవాలి.

తాత్కాలిక అవసరాలకే సర్వేలు

సర్వేల పేరు చెప్పి పార్టీలు తాత్కాలిక అవసరాలు తీర్చుకుంటున్నాయే తప్ప నిజమైన ప్రయోజనం పొందడం లేదు. కమ్యూనిస్టు పార్టీలు తప్ప అంతా సర్వే పేరు వాడుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలు సర్వే కాకుండా ప్రజా క్షేత్రంలో పోరాటం అంటాయి. కానీ, ఆ పోరాటాలూ తగ్గిపోతున్నాయి. శాస్త్రీయంగా జరిపే సర్వే ఈసీజీ లాంటిది. ఉన్నదున్నట్టు, లేదా స్వల్ప వ్యత్యాసాలతో క్షేత్రంలోని వాస్తవ పరిస్థితిని యదాతథంగా చూపిస్తుంది. ఒక నాయకుడి పనితీరు, ప్రజల్లో అతనికున్న ఆదరణ, తదితర వివరాలతో రాగద్వేషాలకు అతీతంగా ఒక బయోడేటా తయారు చేసి ఇస్తుంది. తద్వారా మంచి నాయకుడికి అవకాశం లభిస్తుంది. ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. రాజకీయాలను ఖరీదైన వ్యవహారంగా మార్చేసిన ఈ నాయకులు ఇప్పుడు బయోడేటాకు బదులు బ్యాలెన్స్‌ షీట్‌ చూసి టికెట్లు ఇస్తున్నారు. ఈ బ్యాలెన్స్‌ షీట్లను తమ వైపు తిప్పుకోవడం కోసమే సర్వే పేరిట పార్టీలు నాటకం ఆడుతున్నాయి. దీంతో డబ్బు వెంట పరుగులు తీసే కొన్ని సర్వే సంస్థలు కూడా క్లయింట్‌‌కి అనుకూలంగా సర్వే నివేదికలు ఇచ్చే ఫ్యాక్టరీల్లా తయారయ్యాయి. రాత్రికి రాత్రే పార్టీ మారి కండువా కప్పుకున్న నాయకులకు పొద్దున్నే టికెట్లు కేటాయించమని ఏ సర్వే సంస్థ ఫాస్ట్‌ ఫుడ్‌ నివేదిక వండి వారుస్తోంది.

సన్నగిల్లుతున్న విశ్వసనీయత

సర్వే అంటే ఊహించి చెప్పే లెక్క కాదు. జ్యోతిష్యం అంత కన్నా కాదు. సర్వే ఒక సైన్స్‌. శాస్త్రీయ పద్ధతిలో చేసే సర్వే క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పడుతుంది. అలాంటి సర్వే నిర్వహించాలంటే...ఒక్క శాంపిల్‌కి కనిష్టంగా 300 రూపాయిల ఖర్చు వస్తుంది. దేశంలో, రాష్ట్రంలో నిబద్ధత కలిగిన సర్వే సంస్థలు ఈ ఖర్చును చూసే తమ విశ్వసనీయత దెబ్బతినకుండా ఆచితూచి అడుగులు వేస్తుంటాయి. కానీ, కొన్ని సర్వే సంస్థలు తమ సర్వేలో లక్షల శాంపిల్స్‌ సేకరించామని ప్రచారం చేసుకుంటాయి. అన్ని శాంపిల్స్‌ తీసుకోవడం సాధ్యమేనా ఆ సర్వేలో అంత డేటాను సేకరించడానికి అంతమంది మ్యాన్‌ పవర్‌, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆ సంస్థలు చెప్పిన దాఖలాలే లేవు. ఇది సర్వేల విశ్వసనీయతపై ప్రభావం చూపిస్తోంది. పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సర్వేలను వాడుకున్నంత కాలం సర్వేల విశ్వసనీయత సన్నగిల్లుతూనే ఉంటుంది.

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

[email protected]


Next Story

Most Viewed