చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు

by Ravi |
చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు
X

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు చిరస్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. ఆయన మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేశారు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడు.

శరీరం కృశించినా.. ఆగని దీక్ష

ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఈ దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు.

రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబర్ 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం... పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబరు 5వతేదీ నాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహార దీక్షకు కూర్చునే ముందు ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్ని కొన్ని సందర్భాల్లో నెత్తురు పడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబర్ నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు.

రాష్ట్రం కోసం బలిదానం

ఉద్యమం ఉధృతం కావడం ప్రభుత్వం స్పందించకపోవడంతో ఓరోజు బులుసు సాంబమూర్తి, నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు. డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు. ప్రజలు హింసాత్మక చర్యలు పాల్పడ్డారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. పలు తర్జనభర్జనల తర్వాత కర్నూలు రాజధానిగా 1953 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. బళ్ళారి, బరంపురం,హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.

(నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి)

- ఎన్.సీతారామయ్య

94409 72048

Next Story