రాజీ పడని అక్షరయోఢుడు..

by Ravi |
రాజీ పడని అక్షరయోఢుడు..
X

ఆ అక్షరాలు... ఉషాకిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు ప్రగతి రధ చక్రాలు. ఆ అక్షరం సామాన్యుని చేతిలో పాశుపతాస్త్రం. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు రామోజీరావు. అందుకే ఆయనను 'మీడియా మొఘల్‌' అని కీర్తిస్తారు. మరే పత్రికా లేని ఓ మారుమూల ప్రదేశంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడ్డ తొలి అడుగు.. నేటికి అనంతమై నిరంతరం, తరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. గిరులు, ఝరులు దాటి అడవుల్లో మారుమూల దాగున్న పల్లెల్లో సైతం రెక్కలు కట్టుకుని వాలిపోయింది. 'ఈనాడు' అంటే తెలుగువారి ఆత్మగౌరవ పతాకగా నిలిచింది. తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే, ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా 'ఈనాడు' అవతరించింది.

చెరుకూరి రామోజీరావు, కృష్ణా జిల్లాలోని పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. తర్వాత ఆయన తన పేరును రామోజీరావుగా మార్చుకున్నారు. ఢిల్లీలో రామోజీ తన మొదటి ఉద్యోగం చేశారు. అనంత్ అనే మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు. విజయవాడ పక్కనున్న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవిని ఆయన 1961 ఆగస్టు 19న వివాహం చేసుకున్నారు. 1962లో ఆయన హైదరాబాద్‌కు తిరిగివచ్చి అదే ఏడాది అక్టోబర్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ను స్థాపించారు. ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవంతో 1965లో కిరణ్ యాడ్స్‌ను ప్రారంభించారు.1967 నుంచి 1969 వరకు ఖమ్మం పట్టణంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఫెర్టిలైజర్స్ వ్యాపారాన్ని నిలిపివేసి, 1970 నవంబర్ 23న రమాదేవి ఎండీగా ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్లు దీనికి ఆయన భార్య రమాదేవి నేతృత్వం వహించారు. 1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణం చేపట్టారు. 1980 జూన్ 21న అది త్రీస్టార్ హోటల్‌గా ప్రారంభమైంది. తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో తార, సితార హోటళ్లను నిర్మించారు.

అక్షరాలా మీడియా మొఘల్

మిగిలిన అన్ని వ్యాపారాల కంటే రామోజీరావు అనగానే గుర్తొచ్చేది ఆయన పెట్టిన మీడియా సంస్థలే. రామోజీరావు 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించారు. అప్పటికే ఉన్న సంప్రదాయ శైలికి భిన్నంగా నడపడంతో ఈనాడు వేగంగా ప్రజల్లోకి వెళ్లింది. విశాఖపట్నంలో మొదలైన పత్రిక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో పాటు తెలుగు వారు ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. సినీ ప్రేమికుల కోసం 1976 అక్టోబర్‌ 3న సితార అనే సినీ పత్రికను ప్రారంభించారు. తర్వాత 1978లో నెలకో నవలతో 'చతుర' వివిధ భాషా కథల సమాహారంగా 'విపుల' మాసపత్రికను మొదలుపెట్టారు. తెలుగువారి వంటింటి రుచుల్ని ప్రపంచానికి చాటుతున్న ప్రియా ఫుడ్స్‌ను 1980 ఫిబ్రవరి 9న ప్రారంభించారు. 2014 నుంచి ఆధునిక రీతిలో పిల్లల కోసం ఆయన తీసుకొచ్చిన బాలభారతం, తెలుగు సాహిత్య, సాంస్కృతిక వికాసం కోసం తెచ్చిన తెలుగు వెలుగు పత్రికలు విశేష ప్రాచుర్యం పొందాయి

తెలుగు వాకిళ్లలో ఈనాడు.. ఈటీవీ

స్వతహాగా కళాభిమాని అయిన రామోజీరావు చిన్నతనంలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒక సినిమాలోనూ అతిథిగా నటించారు. యు. విశ్వేశ్వరరావు 1978లో నిర్మించిన ‘మార్పు’ సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్ర పోషించారు. అతిథి పాత్రలో నటించినప్పటికీ, సినిమా పోస్టర్లపై రామోజీరావు ఫోటోను ప్రచురించారు. 1974లో విశాఖలో ఈనాడు పత్రికను స్థాపించి క్రమంగా ఎదిగారు. నాలుగేళ్లలోనే ఈనాడు పత్రికను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన రామోజీరావు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1995 నాటికి ఈనాడు టీవీ (ఈటీవీ) పేరుతో తొలి తెలుగు ఛానల్‌ను తీసుకొచ్చారు. ఈటీవీ-మీటీవీ అనే స్లోగన్‌తో తెలుగువారి వాకిళ్లలోకి ఈనాడు పత్రికతో పాటు ఈటీవీ కూడా ప్రవేశించింది. దీంతో రామోజీ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఎన్ని తెలుగు న్యూస్ ఛానళ్లు వచ్చినా విశ్వసనీయంగా వార్తల్ని అందించడంలో ఈనాడు, ఈటీవీని ఎవరూ అందుకోలేకపోయారు.

ఫిల్మ్ సిటీ సామ్రాజ్యం...

హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి రికార్డు సృష్టించారు. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం ఓ చరిత్ర. దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ నిర్మాణంతో టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమలు తమ సినిమాల్నీ, సీరియళ్లనూ ఇక్కడే నిర్మించడం మొదలుపెట్టాయి. అదే సమయంలో నిర్మాతగా మారి ప్రతిఘటన, మౌనపోరాటం వంటి విప్లవాత్మక సినిమాలను నిర్మించి తానే స్వయంగా పంపిణీ కూడా చేశారు. ఓవైపు ప్రియ పచ్చళ్ల వ్యాపారం, మరోవైపు సినిమాల నిర్మాణం, ఇంకోవైపు మీడియా రంగంలో విజయాలు, అటు మార్గదర్శి చిట్స్ ఇలా చూస్తుండగానే రామోజీ ఓ పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించేశారు.

చరిత్ర సృష్టించిన సినిమాలు

అలాగే, సినీరంగంలోనూ తనదైన ముద్రవేశారు రామోజీ. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా అనేక అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. శ్రీవారికి ప్రేమలేఖ, ప్రతిఘటన, మౌనపోరాటం, జడ్జిమెంట్, మయూరి, చిత్రం, నువ్వే కావాలి, కాంచన గంగ వంటి ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించారు. మీడియా, వినోద రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ 2016లో కేంద్ర ప్రభుత్వం రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఎన్నో పురస్కారాలను, అనితర సాధ్యమైన విజయాలను అందుకున్నారు. మాతృభాషపై అయనకు ఎనలేని మమకారం. మాతృభాష ఆభివృద్ధికి, తెలుగు భాషకు ప్రాచీనహోదాకై ఆయన చేసిన కృషి అజరామరం. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నేను సైతం అంటూ విరాళాలిచ్చి అదుకున్న వితరణశీలి. పేదలకు ఇళ్ల నిర్మాణంతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అనేక సాంఘిక ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు. సమాజంలో జరిగే అన్యాయాలు, ప్రభుత్వ దమననీతిని ఎండగట్టడంలో తన కలం తన గళం నిత్యం మారుమోగుతూనే ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజీలేని పోరాటం చేశారు రామోజీ.

రామోజీ... సాహోజీ

నిరంతరం అక్షర యజ్ఞాన్ని వీడని ఋషి. సామాన్యుని స్థాయి నుంచి అసామాన్య స్థాయికి చేర్చింది ఆయన కృషి. అన్నదాతలకు చేయూతనిచ్చి తెలుగు ప్రజలకు ఎన్నో ప్రియమైన రుచులను అందించడమే కాకుండా ప్రజలను నిత్యం పొదుపు చేయ్యాలన్న మార్గదర్శి ఆయన. ఉషాకిరణాలతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపే సినిమాలు నిర్మించి చిత్రపురిలో మరో ప్రపంచాన్ని సృష్టించిన రామోజీ... మీకు సాహోజీ.. రామోజీ రావు గారికి అక్షర నివాళి.

శ్రీధర్ వాడవల్లి

99898 55445



Next Story

Most Viewed