లిక్కర్ స్కాంలో క్విడ్ ప్రో కో

by Disha edit |
లిక్కర్ స్కాంలో క్విడ్ ప్రో కో
X

ఢిల్లీ మద్యం కుంభకోణం గత రెండేళ్లుగా పత్రికలు, ప్రసార సాధనాల పతాక శీర్షికల్లో నలుగుతున్నది. గతంలో ఢిల్లీ రాష్ట్ర అధికార పార్టీ నాయకులు మనీష్ సిసోడియ, సంజయ్ సింగ్‌లను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా మొన్ననే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ని సైతం అరెస్ట్ చేశారు. అయితే.. ఈ మధ్య తలెత్తిన పరిణామాలు చూస్తున్న దేశ ప్రజలు.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోని అసలు నేరస్తులను పట్టుకునే ఉద్దేశం ఈడీ అధికారులకు అసలు ఉన్నదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఎందుకంటే.. తాజాగా ఈ కుంభకోణం తాలూకు మనీ ట్రెయిల్ వెలుగులోకి వచ్చింది. మనీ ట్రెయిల్ అంటే.. అవినీతి సొమ్ము ఆనవాలు అని చెప్పుకోవచ్చు. ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సుమారు 100 కోట్ల రూపాయలను మద్యం వ్యాపారులు, అధికారంలో ఉన్నవారికి అందజేశారు. అధికారంలో ఉన్నవారు, మద్యం వ్యాపారులూ కుమ్మక్కై.. ప్రభుత్వ బొక్కసానికి రావలసిన పన్నులు రాకుండా చేసి, తామే మింగేసారనేది ఈడీ అధికారుల అభియోగం. ఇందులో శరత్ చంద్రారెడ్డి ముఖ్యుడని ఆరోపణలు ఉన్నాయి.

అవినీతి సొమ్మే బాండ్లుగా మారి...

ఈ మనీ ట్రెయిల్ ఎక్కడ బయటపడింది అంటే.. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతమవడం ద్వారా బయటపడింది! కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ప్రజలకు తెలియకూడదంటూ.. బ్యాంకు ఉన్నతాధికారులతో నానా కుంటి సాకులు చెప్పిస్తూ.. చివరి వరకూ తప్పించుకోవాలని చూసింది. సుప్రీంకోర్టు వెంటపడి మరీ.. బ్యాంకు ఉన్నతాధికారుల చెవులు మెలేసి.. ఎలక్టోరల్ బాండ్ల రహస్య లన్నింటినీ ప్రజల ముందు ఉంచగలిగింది. అలా బయటకు వచ్చిన చందాల బాగోతంలో.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి.. డబ్బులను ఎవరికి ఇచ్చాడనేది కూడా నేడు బహిర్గతం అయింది.

ఎవరు ఈ శరత్ చంద్రారెడ్డి

తెలుగువాడైన పెనక శరత్ చంద్రారెడ్డి.. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అరబిందో ఫార్మాకి ఎండీగా పనిచేస్తున్నాడు. మద్యం వ్యాపారంలో సైతం ఆయనకు ప్రవేశం ఉన్నది. ఈ శరత్ చంద్రారెడ్డి.. మరికొందరు దక్షిణాది వ్యాపారస్తులు కలిసి.. సౌత్ బ్లాక్‌గా ఏర్పడి, అధికారంలో ఉన్నవారితో కుమ్మక్కై కుంభకోణానికి పాల్పడ్డారన్నది ఈడీ ఆరోపణ. ఇతడే ఢిల్లీ మద్యం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అని ఈడీ మొదటి నుండీ చెబుతున్నది. ఇతడిని మొదటిసారిగా ఈడీ అధికారులు 2022 నవంబర్ 9న విచారణలో భాగంగా ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల వ్యవహారం గురించి ఆ సాయంత్రం మీడియాతో మాట్లాడిన శరత్ చంద్రారెడ్డి.. కేజ్రివాల్‌ని ఎప్పుడు కలుసుకున్నారంటూ ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారు కానీ నేను కలవలేదని సమాధానం ఇచ్చానని చెప్పుకొచ్చారు. కానీ రెండో రోజు ఆయనను విచారించి 2022 నవంబర్ 10న శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరు నెలలు జైల్లో గడిపిన తర్వాత శరత్ చంద్రారెడ్డికి జ్ఞానోదయం ఇప్పుడు కలిగి..నేను కేజ్రీవాల్‌ను కలుసుకున్నాను.. ఆయన సహకారం తోటే కుంభకోణం జరిగింది అని ఆయన ఈడీకి సాక్ష్యమిచ్చారు. అయితే, తాము కోరుకున్న పద్ధతిలో.. కేజ్రీవాల్ పేరును రాబట్టగలిగామన్న సంతోషంలో.. ఈడి అధికారులు సైతం శరత్ చంద్రారెడ్డి బెయిల్ అభ్యర్థనను కోర్టులో వ్యతిరేకించలేదు.

ఎలక్టోరల్ బాండ్లు.. మనీ ట్రెయిల్

ఇక.. సుప్రీంకోర్టు బయటపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వెల్లడైన అవినీతి సొమ్ము ఆనవాలు 2024 మార్చి 21న ఎస్‌బీఐ అధికారులు బహిర్గతపరిచిన బాండ్ల వివరాలు పరిశీలించి చూస్తే.. ఈ శరత్ చంద్రారెడ్డి 55 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో బీజేపీకి విరాళాలు అందజేశాడు! ఈసీ వెబ్ సైట్లో దర్శనమిస్తున్న ఈ వివరాల ప్రకారం.. ఈయన మొత్తం 55 కోట్ల రూపాయలు బీజేపీకి చందా అందజేశాడు. ఇదంతా తాను అరెస్ట్ అయ్యాకే మూడు విడతలుగా 55 కోట్ల చందా బీజేపీకి ఇచ్చాడు.అయితే, ఒక కుంభకోణం ప్రధాన సూత్రధారిగా కోర్టు ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. తరఫున అధికారంలో ఉన్న పార్టీకి 55 కోట్ల రూపాయలు ముట్టాయంటే.. ఇది క్విడ్ ప్రో కో కాక మరేమిటి? జైలులో ఉన్న వ్యక్తి.. దేశభక్తితో చందా ఇస్తాడా, తనని గట్టెక్కించడానికి హామీ ఇచ్చిన వ్యక్తికి డబ్బులు ఇస్తాడా మతలబేమిటో దేశ ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది..!

జైల్లో ఉన్న వ్యక్తి చందా పంపాడా?

నిజానికి నిందితుడుగా ఉన్న శరత్ చంద్ర రెడ్డిపై విచారణ సాగుతున్న సమయంలో ఆయన నుండి డబ్బులు తీసుకున్న వారు సైతం తప్పకుండా నిందితుల జాబితాలో చేరాల్సిందే. అది ప్రాథమిక న్యాయ సూత్రం. ఆ ప్రాథమిక న్యాయ సూత్రాన్ని కచ్చితంగా అమలు పరిస్తే.. నేడు ఈడీ అధికారులు అరెస్ట్ చేయాల్సింది జెపి నడ్డాని! ఎందుకంటే.. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఆ పార్టీ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన బాధ్యుడు నడ్డానే. మరి ఎందుకు చేయడం లేదని దేశ ప్రజలు నేడు ఈడీ అధికారులను నిలదీసి అడుగుతున్నారు.. అధికార పార్టీ నేతలను అరెస్టు చేస్తారా? అసలు నిందితులను పట్టుకుంటారా? నిందితులకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేనంటూ దేశ ప్రజలు నిలదీస్తున్నారు.

బాండ్ల బహిర్గతానికి అడ్డుకున్నదెవరు?

ఈ పద్ధతిలో తమ అవినీతి బాగోతాలన్నీ బయటపడతాయనే భయంతోనే.. మోడీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయట పెట్టొద్దంటూ వాదించింది. నానా రకాల తప్పుడు పద్ధతులతో.. ఉన్నతాధికారులను తమ వైపు లాక్కోని.. వాస్తవాలు ప్రజలకు తెలియజేయకుండా అడ్డుకున్నది. సుప్రీంకోర్టు చొరవతోనే నేడు వాస్తవాలు బయటకు వచ్చినవి. ఎవరెవరు ఏ పార్టీకి ఎంత చందా ఇచ్చారు అనేది బయటపడటంతో పాటు.. కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నవారు కేంద్రంలోని అధికార పార్టీకి ఎంత ముట్టజెప్పారనే కీలక వాస్తవం సైతం నేడు బయటికి వచ్చింది. బయటకు వచ్చిన వాస్తవాల ఆధారంగా నేరస్తులను పట్టుకుని బోనులో ఎక్కించి.. శిక్షిస్తేనే సుప్రీంకోర్టు చేసిన పనికి సార్ధకత దక్కుతుంది.

- సంకె రవి

99897 58283



Next Story

Most Viewed