కామన్ మ్యాన్ డైరీ:కైసా భీ జీనా హై సాబ్

by Disha edit |
కామన్ మ్యాన్ డైరీ:కైసా భీ జీనా హై సాబ్
X

సరిగ్గా నాలుగు నెలలు నడిపాడో లేదో.. కరోనా ఫస్ట్ వేవ్ మొదలైంది. రూ.15 వేల వరకు ఈఎంఐ కట్టడం ఇబ్బందికరంగా మారింది. నెలలు గడిచిపోతున్నాయి. చేతిలో డబ్బుల్లేవు. కిరాయిలు రావడం లేదు. లాక్‌డౌన్ సమయం కావడంతో ఇంట్లోంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. పూటగడవటమే కష్టంగా మారింది. ఎల్లమ్మబండకు మకాం మార్చాడు.. అట్లాగైతే రెండు వేల కిరాయి తగ్గుతుందనుకున్నాడు. ఇరుకు ఇంట్లో కాపురం మొదలెట్టాడు. ఫైనాన్స్ కంపెనీవాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. రికవరీ టీంలు ఇంటిమీదకు వస్తున్నాయి. లేదంటే బండి లాక్కుపోతమంటూ బెదిరిస్తున్నాయి. పరువుగా బతికిన ఆ కుటుంబం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఏ ఫోను వచ్చినా ఎత్తి మాట్లాడాలంటే భయం. 'హలో' అనగానే అవతలి వైపు నుంచి బూతుపురాణం అందుకుంటున్నారు.

సోమవారం ఉదయం..10 గంటలు..దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ ఫంక్షన్ కు వెళ్లాలని క్యాబ్ బుక్ చేశాను. రేట్లు మండిపోతున్నాయి. 800 రూపాయలు పడింది. సరే ఏం చేస్తాం. ఎండకు తట్టుకోలేం. ఫ్యామిలీతో వెళ్లాలనుకున్నాం.. తప్పదు. క్యాబ్ బుక్ అయ్యింది. నాలుగు నిమిషాల్లో ఇంటి ముందు వచ్చి వాలింది. 'సాబ్ లొకేషన్ పే హూ!'అంటూ కాల్ చేశాడు డ్రైవర్ షరీఫ్. 'సాబ్ క్యాష్ దేరే.. నైతో ఓలా మనీ'అన్నాడు. డబ్బులే ఇస్తానని చెప్పడంతో ఆయన ముఖం వెలిగిపోయింది. 'ఆవో సాబ్ బైఠో'అన్నాడు. ఇద్దరం మాటల్లో పడ్డాం. ఏ ఊరు? అని అడిగాను. అచ్చంపేట అన్నడు. మీ ఏరియా వాళ్లు ఎవరన్నా ఉన్నారా? అని అడిగా. 'మా దోస్తు రాజు పట్నం వచ్చి బర్బాద్ అయిండు. అప్పులు చేసి పరేషాన్ల పడుతున్నడు'అన్నడు. అయ్యో ఏమైంది.. అడిగితే...!

*

నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లికి చెందిన రాజు వృత్తి రీత్యా డ్రైవర్. ఊళ్లో ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. డిగ్రీవరకు చదువుకున్నా కొలువు రాలేదు. ఏం చేయాలో పాలు పోలేదు. స్టీరింగ్ చేతబట్టక తప్పలేదు. భార్య స్థానికంగా ఉండే పాఠశాలలో టీచర్‌గా పనిచేసేది. ఇద్దరు కలిసి శ్రమిస్తే నెలకు 20 వేల వరకు ఆదాయం వచ్చేది. ఇద్దరు పిల్లలు. తల్లి వెంట బుడిబుడి నడకలతో బడికెళ్లేవారు. సంసారం సాఫీగా సాగింది. అంతలోనే రాజుకు హైదరాబాద్ వెళ్లాలని మనసైంది. అక్కడైతే నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించవచ్చనుకున్నాడు. ఈ విషయాన్ని భార్యతో చెప్పాడు. అక్కడ బతికేందుకు టవేరా కొందామని, లక్షరూపాయలు కడితే బ్యాంకు లోన్ వస్తుందని, అక్కడైతే కిరాయిలు ఎక్కువొస్తాయని ఒప్పించాడు. ఆమె కూడా సరే అన్నది. 2016లో కుటుంబాన్ని తీసుకొని పట్నం బాట పట్టాడు. కూకట్‌పల్లిలో మకాం పెట్టారు. తొలి రోజుల్లో కిరాయిలు బాగానే దొరికాయి. మూడేండ్లు కష్టపడి ఈఎంఐలు కట్టేశాడు. టవేరా పాతబడి పోయింది. గిరాకీలు తగ్గుతున్నాయి. దానిని అమ్మేసి మహీంద్రా జైలో బండి కొనుగోలు చేశాడు. 14 లక్షల వరకు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకున్నాడు. అడ్వాన్సు కింద రెండు లక్షలు కట్టాడు. ఓలా, ఉబేర్ కంపెనీలకు అటాచ్ చేశాడు.

సరిగ్గా నాలుగు నెలలు నడిపాడో లేదో.. కరోనా ఫస్ట్ వేవ్ మొదలైంది. రూ.15 వేల వరకు ఈఎంఐ కట్టడం ఇబ్బందికరంగా మారింది. నెలలు గడిచిపోతున్నాయి. చేతిలో డబ్బుల్లేవు. కిరాయిలు రావడం లేదు. లాక్‌డౌన్ సమయం కావడంతో ఇంట్లోంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. పూటగడవటమే కష్టంగా మారింది. ఎల్లమ్మబండకు మకాం మార్చాడు.. అట్లాగైతే రెండు వేల కిరాయి తగ్గుతుందనుకున్నాడు. ఇరుకు ఇంట్లో కాపురం మొదలెట్టాడు. ఫైనాన్స్ కంపెనీవాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. రికవరీ టీంలు ఇంటిమీదకు వస్తున్నాయి. లేదంటే బండి లాక్కుపోతమంటూ బెదిరిస్తున్నాయి. పరువుగా బతికిన ఆ కుటుంబం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నది. ఏ ఫోను వచ్చినా ఎత్తి మాట్లాడాలంటే భయం. 'హలో' అనగానే అవతలి వైపు నుంచి బూతుపురాణం అందుకుంటున్నారు. తండ్రి పరిస్థితిని చూసిన పిల్లలు గజగజా వణికిపోతున్నారు. అంతలోనే ఓ రోజు ఫైనాన్స్ కంపెనీ టీం ఇంటిమీదకు వచ్చి బండి లాక్కుపోయింది. ఫైనాన్స్ కు రమ్మని చెప్పి వెళ్లిపోయింది.

తెలిసిన ఓ పెద్దాయనను తీసుకొని సదరు ఫైనాన్స్‌కు వెళ్లాడు రాజు. 'బండికి ఖరీదు కట్టాం.. వడ్డీలు, అసలు పోను ఇంకా మూడు లక్షలు కట్టాలి'ఎప్పుడిస్తావ్? ష్యూరిటీ ఎవరు?'అంటూ అడిగారు. 'మరి నా రెండు లక్షలు'అన్నాడు రాజు. అవన్నీ కలిపే లెక్కలు చేశాం. కాళ్లావేళ్లా పడి బతిమాలినా వినలేదు. రాజు గోస చూసిన వెంట వెళ్లిన పెద్దమనిషి తాను ష్యూరిటీగా ఉంటానని సంతకం చేశాడు. ఎలాగోలా ఇల్లు చేరిన రాజుకు బతుకుమీద ఆశ కనిపించలేదు. మళ్లీ ఊరెళ్లలేడు? ఎలా? తానూ ఉద్యోగం చేస్తానంది భార్య గీత. తనకు టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి స్కూళ్లలో ట్రై చేశారు. లాక్‌డౌన్ కావడంతో బడులింకా తెరుచుకోలేదు. పక్కనే ఉన్న బొటిక్‌లో బ్లౌజ్‌లు కుట్టడం ప్రారంభించింది గీత. రాజు పరిస్థితి దయనీయం. పూలమ్మిన చోటే కట్టెలమ్మలేడు! సిటీ ఔట్ స్కట్స్ లో ఉన్న ఓ హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా కుదిరాడు. నెలకు రూ. 10 వేల జీతం. హోటల్ కు వచ్చేవారి కార్లను సెల్లార్‌లో పార్క్ చేయాలి. వాళ్లు బయటికి వచ్చాక తెచ్చి ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా టిప్పులు కూడా వస్తుంటాయి. పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. మొత్తానికి జీవితనౌకను అలా నెట్టుకొస్తున్నారు. గతాన్ని యాది చేసుకొని కన్నీళ్లు తీసుకుంటున్నారా భార్యాభర్తలు.

*

'నాకు వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్.. మస్తు బాధైతది. ఎందుకు హైదరాబాద్ వచ్చినమో ఏమో అర్థం కాదు. డీజిల్ రేట్లు అడ్డగోలుగా పెరుగుతున్నయ్. క్యాబ్ కంపెనీలోళ్లు కమీషన్లు బాగా గుంజుతుండ్రు. ఏం మిగుల్తలేవు. ఒక్కో నెలలో సర్వీసింగ్ కు కూడా పైసలుంటలేవ్..'అన్నాడు షరీఫ్. అంతలోనే మేం దిగాల్సిన లొకేషన్ రావడంతో డబ్బులిచ్చి దిగిపోయాం.. ఎంతైనా ఒకప్పటి రేట్లు కాదు కదా! వాళ్లేం చేస్తారు పాపం..!

ఎమ్ఎస్‌ఎన్ చారి

79950 47580

Next Story

Most Viewed