కోచింగ్ సెంటర్లను నియంత్రించాలి

by Disha edit |
కోచింగ్ సెంటర్లను నియంత్రించాలి
X

ప్రభుత్వ అనుమతులు, జీహెచ్ఎంసీ అనుమతులు లేకున్నా కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒక్కో బ్యాచ్‌కి 800 నుంచి 1000 మందిని తీసుకుంటున్నారు. వారందరినీ ఒకే రూమ్‌లో పెట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అంతమందికి రెండు మూడు టాయిలెట్స్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. గాలి, వెలుతురు లేని గదిలో, గంటల తరబడి ఒకే గదిలో క్లాసులతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కోచింగ్ సెంటర్లను నియంత్రించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు, వసతులు లేని, ఫీజులు దోచుకునే కోచింగ్ సెంటర్లను మూసివేయించాలి. వ్యాపారమే ధ్యేయంగా అడ్డూ అదుపూ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

దాదాపు 90వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన నిరుద్యోగులలో కొత్త ఆశలు చిగురించడమే కాదు, కరోనా ఎఫెక్ట్‌తో మూతపడిన కోచింగ్‌ సెంటర్లకు జీవం పోసింది. తెలంగాణలో కొలువుల జాతరతో కోచింగ్‌ సెంటర్లు బిజీ అయిపోతున్నాయి. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతుండటంతో కొత్త బ్యాచ్‌లు మొదలవుతున్నాయి. పగలూ సాయంత్రం జరుగుతున్న క్లాసులతో కోచింగ్‌ సెంటర్లలో సందడి కనిపిస్తోంది. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో కొత్త కొత్త కోచింగ్‌ సెంటర్లూ వెలుస్తున్నాయి. ఈసారి నియామకాలకు ఏజ్ లిమిట్ పదేండ్లు పెంచడంతో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. హైదరాబాద్‌తోపాటు తమ సమీప పట్టణాలలో ఉన్న కోచింగ్ సెంటర్లలో ఉద్యోగార్థులు చేరుతున్నారు.

వారే ఎక్కువగా ఉన్నారు

ఇది తమకు మంచి అవకాశమని పట్టభద్రులు చెబుతున్నారు. ఇప్పటికే డిపార్టమెంట్లవారీగా భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రయివేటులో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ నియామకాలకు ప్రిపేర్ అవుతుండడంతో వారి కోసం సాయంత్రం పూట క్లాసులు నిర్వహిస్తున్నారు. డిగ్రీ, బీటెక్ అభ్యర్థులు కూడా సర్కారీ కొలువు టార్గెట్‌గా ప్రిపేర్ అవుతున్నారు. ఇక వీలైనంత త్వరగా అన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని, దీంతోపాటు ఉద్యోగ భర్తీ క్యాలెండర్ విడుదల చేయాలని యువత కోరుతోంది. అలాగే, అన్ని జిల్లాల విశ్వవిద్యాలయాలలో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని విన్నవిస్తోంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వం ఒకే దఫాలో పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో ఎంతో మంది పేదలు పోటీ పరీక్షలు రాయడానికి ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. నిర్వాహకులు వారి దగ్గర రూ. యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కోచింగ్ తీసుకునేందుకు రూమ్ కిరాయికు తీసుకోవడం, తిండి ఖర్చులు మరో ముప్పయి వేల నుంచి నలభై వేల వరకు అవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పేద మధ్య తరగతి కుటుంబాలకు కోచింగ్ తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం పెద్ద యెత్తున స్టడీ సర్కిల్‌లు ఏర్పాటు చేయాలి. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకునే వారికి స్టై-ఫండ్ ఇవ్వాలి.

వాటిని నియంత్రించాలి

ఇక కోచింగ్ సెంటర్లు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోచింగ్ అంటూ వేలకు వేలు ఫీజులు గుంజుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్, అశోక్‌నగర్, ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులోని గ్రూప్ -1, 2, డీఎస్‌సీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్ లాంటి వాటికి ప్రధాన కోచింగ్ సెంటర్ల దోపిడీ అడ్డూ అదుపు లేకుండా పోయింది. తమ ఇష్టానుసారంగా అన్ని కోచింగ్ సెంటర్ యాజమాన్యాలు 20 నుంచి 25 శాతం ఫీజులు పెంచేశాయి. ఉదాహరణకు మొన్నటి వరకు కానిస్టేబుల్ కోచింగ్ ఫీజు రూ.10 వేలు ఉంటే తాజాగా దాన్ని రూ. 15 వేల నుంచి 18 వేలకు పెంచారు. నిరుద్యోగులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెంచిన ఫీజులకు అనుగుణంగా కనీస వసతులైన పెంచారా, అంటే అదీ లేదు. ప్రభుత్వ అనుమతులు, జీహెచ్ఎంసీ అనుమతులు లేకున్నా కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

ఒక్కో బ్యాచ్‌కి 800 నుంచి 1000 మందిని తీసుకుంటున్నారు. వారందరినీ ఒకే రూమ్‌లో పెట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అంతమందికి రెండు మూడు టాయిలెట్స్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. గాలి, వెలుతురు లేని గదిలో, గంటల తరబడి ఒకే గదిలో క్లాసులతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కోచింగ్ సెంటర్లను నియంత్రించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు, వసతులు లేని, ఫీజులు దోచుకునే కోచింగ్ సెంటర్లను మూసివేయించాలి. వ్యాపారమే ధ్యేయంగా అడ్డూ అదుపూ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

మారుపాక అనిల్‌కుమార్

AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

94404 82429



Next Story

Most Viewed