ప్రీతి మరణం గుణపాఠం కావాలి

by Ravi |
ప్రీతి మరణం గుణపాఠం కావాలి
X

క గిరిజన కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాన్ని అధిరోహించి బంగారు భవిష్యత్తు, మంచి జీవితాన్ని గడపవలసిన ఒక గిరిజన బిడ్డ సమాజంలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతల వల్ల ఈరోజు మరణించడం చాలా బాధాకరం. ఆమె మరణం ఆ కుటుంబానికి, గిరిజన సమాజానికి తీరని లోటు. ఈ అమ్మాయి మరణం వెనకున్న ఉదంతాన్ని పరిశీలిస్తే తన తండ్రి చట్టాలపైన అవగాహన కలిగిన పోలీసు ఉద్యోగి. మంచి విద్యావంతులైన కుటుంబం. అయినా ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆ కళాశాలలో అమలు పరుస్తున్న నియమనిబంధనలేనా? నిజానికి సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలను నిర్వహించడం కఠినమైన శిక్షలను విధించే అధికారం కూడా కళాశాల ప్రిన్సిపాల్‌కి ఇచ్చారు. అలాగే ప్రతి కళాశాలలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ తరచుగా సమావేశాలు కావడం, సమస్యలను కనుక్కోవడం వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడం, సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూడడం కమిటీ సభ్యుల బాధ్యత. ఇంకా అమ్మాయి ఎస్సీ, ఎస్టీ, చట్టం కింద కూడా తన బాధలు చెప్పుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కళాశాలలో విమెన్ ఎంపవర్‌మెంట్ సెల్‌లోనైనా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి కళాశాల రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్రమశిక్షణ పేరిట రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని నిబంధనలు ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించే అమ్మాయి వేధింపులకు గురై చనిపోవడం అనేది చాలా బాధాకరం.

ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్‌ నియమ నిబంధనలను పర్యవేక్షిస్తున్నాడా? అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మౌఖికంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు వాటి పైన చర్య తీసుకున్నారా, లేదా? ఆ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగులు తరుచుగా జరిగాయా లేదా? అమ్మాయిల పైన జరిగే వేధింపులకు ఇంతవరకు ఎప్పుడైనా కేసులు నమోదు అయ్యాయా? అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఈ విషయంలో ప్రభుత్వం చూసీ చూడనట్టు ఉండకుండా నిబంధనల ప్రకారం అధికారులు నిర్లక్ష్యం వహించి ఉంటే వారిని శిక్షించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే అక్కడ చదువుతున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం సానుభూతి తెలపడం కాదు, సంఘటన జరగకుండా పీరియాడికల్ రివ్యూ మీటింగ్ జరుగుతున్నాయా లేదా అనే దానిపైన ఫోకస్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు ఉన్నత విద్యావ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేసి ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూడాలి.

డాక్టర్ శంకర్ నాయక్

అసోసియేట్ ప్రొఫెసర్

91107 16674

Also Read...

జననాడి: ఈశాన్య జనవాణి.... ఎలా ఉంది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి


Next Story

Most Viewed